ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయిపై ఉక్కుపాదం

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:41 PM

దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండడంతో గంజాయి సాగు, రవాణాను నిర్మూలించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పోలీసులు ఇప్పటికే కొండల్లోని గంజాయి తోటలను ధ్వంసం చేయడంతో పాటు రవాణాను అడ్డుకునేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నారు.

జి.మాడుగుల మండలం మారుమూల ప్రాంతాల్లో గంజాయి మొక్కలను దహనం చేస్తున్న పోలీసులు(ఫైల్‌)

రాష్ట్రాన్ని గంజాయి రహితం చేయడానికి కూటమి సర్కారు అడుగులు

విస్తృతంగా వాహన తనిఖీలు, తోటలు ధ్వంసం, పల్లెల్లో అవ గాహన కార్యక్రమాలు

అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రులు అనిత, సంధ్యారాణి, డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు

కూటమి పాలనలో 156 కేసుల్లో 12,491 కిలోల గంజాయి స్వాధీనం, 444 మంది అరెస్టు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండడంతో గంజాయి సాగు, రవాణాను నిర్మూలించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పోలీసులు ఇప్పటికే కొండల్లోని గంజాయి తోటలను ధ్వంసం చేయడంతో పాటు రవాణాను అడ్డుకునేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పటిష్ట చర్యలు తీసుకుని ఇప్పటి వరకు 156 కేసుల్లో 12,491 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 444 మందిని అరెస్టు చేసిందంటే ఎంతటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా మార్చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మన్యంలో పండే గంజాయి రాష్ట్రాలు దాటి పాఠశాల విద్యార్థుల సంచుల్లోకి చేరిందని ఆరోపణలున్నాయి. నాటి ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గంజాయి రహితం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంతి గుమ్మడి సంధ్యారాణి, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. పోలీసులు గట్టిగా దృష్టిపెడితే గంజాయి నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే గంజాయిని సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పలుమార్లు రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖా మంతి గుమ్మడి సంధ్యారాణి సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై పలువురు మంత్రులతో సబ్‌ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం గంజాయి నిర్మూలనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

తోటలు ధ్వంసం, అవగాహన కార్యక్రమాలు

గంజాయికి మూలమైన గిరిజన ప్రాంతంలో పోలీసులు ప్రస్తుతం మూడు మార్గాల్లో గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని గంజాయి తోటలను డ్రోన్‌ల ద్వారా గుర్తించడం, ప్రత్యేక పోలీసు బృందాలతో ఆయా ప్రాంతాలకు చేరుకుని గంజాయి మొక్కలను ధ్వంసం చేయడం, మరో వైపు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిత్యం వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చే యడంతో పాటు గంజాయి సాగు, రవాణా వల్ల కలిగే నష్టాలపై గిరిజన రైతులు, ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఏజెన్సీ నుంచి గంజాయి మైదాన ప్రాంతానికి రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు గంజాయి సాగు జోలికి పోకుండా ఉండాలని అవగాహన కల్పించడం ద్వారా వారిని గంజాయి సాగుకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా గంజాయి సాగు, రవాణా జోలికి వెళ్లేందుకు భయపడేలా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అలాగే పోలీస్‌స్టేషన్ల స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, రైతులతో ‘పరివర్తన’ పేరిట పోలీసులు సమావేశాలు నిర్వహించి గంజాయి జోలికి వెళ్లవద్దని, ప్రత్యామ్నాయ పంట సాగు చేపట్టాలని సూచిస్తున్నారు. కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ యంత్రాంగాన్ని నిత్యం అప్రమత్తం చేస్తూ గంజాయి నిర్మూలనకు సంబంధించి కార్యాచరణను పర్యవేక్షిస్తున్నారు.

గంజాయి స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు సర్కారు యోజన

రాష్ట్రాన్ని గంజాయి రహితం చేయడంతో భాగంగా గంజాయి స్మగ్లర్ల ఆస్తులను సైతం జప్తు చేయాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో గంజాయి స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేయడానికి సైతం వెనుకాడబోమని విశాఖపట్నం పోలీస్‌ రేంజ్‌ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో విశాఖపట్నం డీఐజీ గోపీనాఽథ్‌జెట్టి స్పష్టం చేశారు. గంజాయిని సంపూర్ణంగా అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆయన ఆదేశించారు.

కూటమి హయాంలో పటిష్ట చర్యలు

గంజాయి నిర్మూలనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం, అందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించింది. రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ఈ ఏడాది జూన్‌ 12 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 156 కేసులు నమోదు చేసి 12,491 కిలోల గంజాయిని, 3 లీటర్ల గంజాయి లిక్విడ్‌ను స్వాధీనం చేసుకుని 444 మందిని అరెస్టు చేశారు. అలాగే గంజాయి రవాణాకు వినియోగించిన 20 కార్లు, 94 బైక్‌లు, 21 ఆటోలు, 3 భారీ వాహనాలు సీజ్‌ చేశారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉండి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న 145 మందిని అరెస్టు చేశారు. జిల్లాలోని 202 మారుమూల గ్రామాలను పోలీసు బృందాలు పరిశీలించాయి. తాజాగా జి.మాడుగుల, పెదబయలు ప్రాంతాల్లోని అడవుల్లో 32 ఎకరాల్లో గంజాయి తోటలను డ్రోన్‌తో గుర్తించి పోలీసులు దహనం చేశారు.

Updated Date - Nov 21 , 2024 | 11:41 PM