ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కైలాసగిరిపై సాహస క్రీడలు

ABN, Publish Date - Oct 02 , 2024 | 01:08 AM

విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పర్యాటకులకు దసరా కానుక సిద్ధం చేస్తోంది.

జిప్‌ లైనర్‌, స్కై సైక్లింగ్‌కు ఏర్పాట్లు

ఇప్పటికే టవర్ల నిర్మాణం పూర్తి

రెండు, మూడు రోజుల్లో ట్రయల్‌ రన్‌

దసరా నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పర్యాటకులకు దసరా కానుక సిద్ధం చేస్తోంది. కైలాసగిరిపై అడ్వంచర్‌ స్పోర్ట్స్‌లో భాగంగా స్కై సైక్లింగ్‌, జిప్‌ లైనర్లను ఏర్పాటుచేస్తోంది. రెండేళ్ల క్రితమే వీటికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరినా పనులు ముందుకుసాగలేదు. ఇటీవల కమిషనర్‌గా వచ్చిన విశ్వనాథన్‌ పాత వాటిని సమీక్షించి, ఆయా పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు. దాంతో ఈ రెండింటి పనులు ఊపందుకున్నాయి. వీటి కోసం వీఎంఆర్‌డీఏ రూపాయి కూడా పెట్టుబడి పెట్టడం లేదు. కేవలం కొండపై రెండు వేల గజాల స్థలం మాత్రమే కేటాయించింది. కేరళలో జిప్‌ లైనర్‌, స్కై సైక్లింగ్‌ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్న ఓ సంస్థ, విశాఖపట్నానికి చెందిన సాయి మోక్ష షిప్పింగ్‌ ఏజెన్సీ కలిసి జాయింట్‌ వెంచర్‌ కింద ఈ ప్రాజెక్టు చేపట్టాయి. వ్యయం అంతా అవే భరిస్తాయి. అందులో వచ్చే ఆదాయంలో 45 శాతం వీఎంఆర్‌డీఏకు ఇస్తాయి.

ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..?

కైలాసగిరిపై శివపార్వతుల విగ్రహం వద్ద నుంచి విశాలాక్షి నగర్‌ వైపు 150 మీటర్ల పొడవున ఈ జిప్‌ లైనర్‌, స్కై సైక్లింగ్‌ వస్తాయి. వీటి కోసం ఇటు వైపు ఒక టవర్‌, అటు వైపు మరో టవర్‌ నిర్మించారు. కేవలం భూమి ఆకర్షణ శక్తి ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఎటువంటి విద్యుత్‌ మోటార్లు ఉండవు. ఇక్కడ నుంచి జిప్‌ లైనర్‌ను వదిలితే డౌన్‌గా ఉండడం వల్ల కిందకు వెళ్లిపోతుంది. అక్కడ దిగిన తరువాత దాని కంటే ఎత్తుగా నిర్మించిన టవర్‌ ఎక్కి అక్కడి నుంచి ఇటు వైపు మళ్లీ డౌన్‌కు గ్రావిటీతో వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కైలాసగిరి కిందన రోప్‌ వే ఉంది. ఇది విద్యుత్‌ మోటార్లతో పనిచేస్తుంది. కానీ జిప్‌ లైనర్లు కేవలం గ్రావిటీ ఆధారంగానే పనిచేస్తాయి.

జిప్‌ లైనర్‌ అంటే...

రెండు టవర్ల మధ్య తీగ కడతారు. దానికి బేరింగ్స్‌తో నడిచే రోప్స్‌ వేలాడదీస్తారు. వాటిని పర్యాటకుల నడుముకు బిగిస్తారు. జారిపోకుండా పటిష్ఠంగా కడతారు. వాటిని వదలగానే ఇటు వైపు నుంచి అటు వెళతాయి. అలాగే అటు వదిలితే ఇటు వస్తాయి. గాలిలో వేలాడుతూ వెళ్లిన అనుభూతి కలుగుతుంది.

స్కై సైక్లింగ్‌

టవర్లకు మధ్య తీగలు ఏర్పాటుచేసి, వాటిపై సైకిళ్లు నడిచేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ సైకిళ్లకు టైర్లు ఉండవు. తీగలపై బ్యాలెన్స్‌ అయ్యేలా రిమ్స్‌ మాత్రమే ఉంటాయి. వీటికి కిందన ఒక తీగ, పైన ఒక తీగ ఉంటాయి. సైకిల్‌పై పర్యాటకులు కూర్చొంటారు. ఇవి కూడా గ్రావిటీతోనే నడుస్తాయి. జిప్‌ లైనర్‌, స్కై సైక్లింగ్‌లలో ఏది ఎక్కినా ఇటు నుంచి అటు వెళ్లి, తిరిగి అటు నుంచి ఇటు వచ్చేలా అనుమతిస్తారు. కైలాసగిరి రోప్‌వేకు ఆ సదుపాయం లేదు. ఇటు నుంచి కొండ పైకి వెళ్లి అటు నుంచి రోడ్డు మార్గాన దిగిపోవలసి ఉంటుంది. అటు నుంచి కూడా రోప్‌వేలోనే రావాలంటే ప్రత్యేకంగా టికెట్‌ తీసుకోవలసి ఉంటుంది. వీటికి మాత్రం అలా కాకుండా ఇక్కడ జిల్‌ లైనర్‌ లేదా స్కై సైక్లింగ్‌ ఎక్కిన వారు అటు నుంచి వెనక్కి వచ్చే అవకాశం కల్పిస్తున్నారు.

టికెట్‌ ధరపై నిర్ణయం కమిషనర్‌దే

ఈ తరహా జిప్‌ లైనర్లు, స్కై సైక్లింగ్‌లకు కేరళలో మనిషికి రూ.150 చొప్పున టికెట్‌ పెట్టి వసూలు చేస్తున్నారు. ఇక్కడ టికెట్‌ ధర ఎంత అనేది వీఎంఆర్‌డీఏ కమిషనరే నిర్ణయిస్తారని ఈ పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బలరామరాజు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ట్రయల్‌ రన్‌ నడిపి, దసరా నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 01:08 AM