గంజాయిపై ఉక్కుపాదం
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:04 AM
గంజాయి సాగు, రవాణా, అమ్మకాలు, వినియోగం వంటి వాటిని అరికట్టడానికి బహుముఖ వ్యూహం అమలు చేస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ తెలిపారు.
నియంత్రణకు బహుముఖ వ్యూహం
సాగు, రవాణా, వినియోగంపై మరింత నిఘా
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
కాఫీ, సిల్వర్ ఓక్, అవకాడో, డ్రాగన్, మామిడి, సీతాఫలం మొక్కలు పంపిణీ
ఈ ఏడాది 45 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు డ్రోన్‌ల ద్వారా గుర్తింపు
కొత్తగా 23 చెక్‌పోస్టులు ఏర్పాటు, 350 మొబైల్ చెక్‌పోస్టులు
166 కేసులు నమోదు, 476 మంది అరెస్టు, 12,000 కిలోలు స్వాధీనం
గంజాయితే దొరికితే వాహనాలు, ఆస్తులు సీజ్
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ
విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
గంజాయి సాగు, రవాణా, అమ్మకాలు, వినియోగం వంటి వాటిని అరికట్టడానికి బహుముఖ వ్యూహం అమలు చేస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ తెలిపారు. గంజాయిని నిర్మూలించేందుకు అనుసరిస్తున్న విధానాలు ఇప్పటికే కొంత సత్ఫలితాలు ఇచ్చాయని, అయితే వ్యవస్థీకృతంగా ఏళ్ల తరబడి చేస్తున్న సాగు, అమ్మకాలు, రవాణాపై మరింత నిఘా పెట్టామన్నారు. సోమవారం తనను కలిసిన విలేకరులకు గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను డీఐజీ వివరించారు.
గంజాయి నియంత్రణకు తాను బాధ్యతలు చేపట్టిన తరువాత పలు రకాల ప్రణాళికలు అమలు చేసినట్టు డీఐజీ గోపీనాథ్ చెప్పారు. గడచిన మూడు, నాలుగు సంవత్సరాల్లో గంజాయి సాగు చేసిన గ్రామాల వివరాలను తీసుకున్నామన్నారు. మొత్తం 195 గ్రామాల్లో గతంలో గంజాయి సాగు చేశారని, వాటిలో 125 గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 215 గ్రామాల్లో 10,700 మంది రైతులకు చెందిన 10,837 ఎకరాల్లో గంజాయికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునేందుకు కాఫీ, సిల్వర్ ఓక్, అవకాడో, డ్రాగన్, మామిడి, సీతాఫలం, నేరేడు, సపోట తదితర 22 రకాల పండ్లు, ఇతర రకాల మొక్కలు పంపిణీ చేశామన్నారు. మరో 30 వేల మంది రైతులకు 4,500 క్వింటాళ్ల రాజ్‌మా విత్తనాలు పంపిణీ చేశామని, ఇంకా పసుపు పంటను ప్రోత్సహించామన్నారు. అయినప్పటికీ గంజాయి సాగు చేసే అవకాశం ఉన్న గ్రామాల్లో సచివాలయం, ఫారెస్టు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటుచేసిన బృందాలను సర్వే చేయించామన్నారు. సర్వే బృందాలు, కూంబింగ్ పార్టీలు ఇచ్చిన సమాచారం మేరకు 198 గ్రామాల్లో డ్రోన్‌ల సాయంతో 7,358 ఎకరాల్లో సర్వే చేయిస్తే జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని 41 గ్రామాల్లో 45 ఎకరాల్లో గంజాయి సాగు చేసినట్టు తేలిందన్నారు. ఆ పంటను ధ్వంసం చేశామన్నారు. మరికొన్ని గ్రామాల్లో డ్రోన్ సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే మారుమూల కొండవాలు ప్రాంతాల్లో కొంతమేర గంజాయి సాగుచేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ, వీటిని గుర్తించేందుకు కూంబింగ్ పార్టీలు యత్నిస్తున్నాయన్నారు.
ఏజెన్సీ నుంచి గంజాయి రవాణాను అరికట్టేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకూ ఉన్న 13 చెక్‌పోస్టులకు అదనంగా 23 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని డీఐజీ గోపీనాథ్ వెల్లడించారు. ఒక్కొక్క చెక్‌పోస్టులో మూడు షిఫ్టులలో నలుగురేసి సిబ్బంది విధులు నిర్వహిస్తారని వివరించారు. 11 చెక్‌పోస్టుల వద్ద డాగ్ స్క్యాడ్‌లు ఏర్పాటుచేశామన్నారు. వీటికితోడు 350 మొబైల్ చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయన్నారు. చెక్‌పోస్టుల ద్వారా 166 కేసులు నమోదుచేసి, 476 మందిని అరెస్టు చేసి వారి నుంచి 12 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణాలో నిందితులుగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న 729 మందిని అరెస్టు చేశామన్నారు. పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 120 గ్యాంగ్‌లను గుర్తించామని, వీరిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
గంజాయి రవాణాకు సంబంధించి 25 కేసులలో నిందితులకు 10 నుంచి 25 సంవత్సరాల జైలు శిక్ష పడిందని, భవిష్యత్తులో మరిన్ని కేసుల్లో శిక్షలు పడేలా చార్జిషీట్లు పక్కాగా రూపొందిస్తున్నామని డీఐజీ గోపీనాథ్ చెప్పారు. అదేపనిగా గంజాయి వ్యవహారాలతో సంబంధం ఉన్న 21 మందిపై పీడీ యాక్టు అమలు చేస్తున్నామని వెల్లడించారు. మరో 247 మంది అనుమానితులపై గంజాయి కేసులు (గంజాయి షీట్స్) నమోదుచేయగా, మరొకరిపై రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు. గంజాయితో దొరికే వ్యక్తుల వాహనాలు, ఆస్తులు సీజ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఏజెన్సీలో గతంలో పండించిన గంజాయి భారీగా నిల్వ ఉందని అనుమానం వ్యక్తంచేశారు. ఏజెన్సీలో పలు గ్రామాలతోపాటు నర్సీపట్నం నుంచి మాడుగుల వరకూ, అనకాపల్లి, విశాఖ నగర శివారుల్లో కొంతమంది వద్ద నిల్వలు ఉన్నాయని త్వరలో దాడులు చేస్తామని వెల్లడించారు. గంజాయి వినియోగంపై సంకల్పం పేరుతో ప్రారంభించిన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. రెండు లక్షల మంది విద్యార్థులను, వేలాది మంది ఉద్యోగులను చైతన్యవంతులను చేశామన్నారు. గంజాయి అమ్మకాలు, వినియోగంపై సమాచారం అందించేందుకు 150 చోట్ల బాక్సులు ఏర్పాటుచేశామన్నారు. గంజాయికి దూరంగా ఉండేందుకు ‘యుద్ధం’ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. ఏజెన్సీ సందర్శనకు వచ్చే పర్యాటకులు గంజాయి రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలని డీఐజీ పిలుపునిచ్చారు. పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులలో గంజాయికి వ్యతిరేకంగా పోస్టర్లు అతికించామని వివరించారు.
Updated Date - Dec 03 , 2024 | 01:04 AM