గడువులోగా అర్జీలు క్లియర్ చేయాలి
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:23 PM
ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నదని, అందువల్ల ప్రజలు అందించే అర్జీలకు సంబంధించిన సమస్యలను నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పలు శాఖల అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నదని, అందువల్ల ప్రజలు అందించే అర్జీలకు సంబంధించిన సమస్యలను నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పలు శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జేసీ జాహ్నవితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వేగంగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అందిన అర్జీలు ఆన్‌లైన్‌లో నమోదుతోపాటు హెల్ప్‌డెస్క్‌లను కలెక్టర్ పరిశీలించారు. పీజీఆర్‌ఎస్ ముగిసే సరికి 231 వినతులు అందాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో...
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్‌సిన్హా సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ముగిసే సరికి 34 అర్జీలు అందగా వాటిలో భూ తగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, తదితర వంటివికి సంబంధించినవి అధికంగా వున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ మనీషారెడ్డి, ఏఎస్పీ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:23 PM