సమస్యల ఒడిలో ఆశ్రమ బడి
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:33 AM
మండలంలోని డౌనూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తిష్ఠ వేశాయి. విద్యార్థులకు సరిపడా గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల నూతన భవనం నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అవస్థలు తప్పడం లేదు.
డౌనూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో వసతులు కరువు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తికాని అదనపు భవన నిర్మాణం
రెండు పాత నిర్మాణాలను కూల్చి వేయడంతో అవస్థలు
చాలీచాలని గదుల్లో విద్యార్థుల ఇబ్బందులు
కొయ్యూరు, సెప్టెంబరు 15: మండలంలోని డౌనూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తిష్ఠ వేశాయి. విద్యార్థులకు సరిపడా గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల నూతన భవనం నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అవస్థలు తప్పడం లేదు.
డౌనూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 269 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో 12 గదులతో ఒక భవనం మాత్రమే ఉంది. ఇందులో ఒక గదిని కార్యాలయ నిర్వహణకు, ఒకటి ల్యాబ్‌కు, ఒకటి కంప్యూటర్లకు, మరొక స్టోర్ రూమ్‌గా వినియోగిస్తున్నారు. మిగిలిన ఎనిమిది గదుల్లో 269 మంది విద్యార్థులు పగటి పూట తరగతులకు, రాత్రి వేళ వసతి గృహంగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
అసంపూర్తి నిర్మాణాలతో అవస్థలు
గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు పథకం రెండవ విడత కింద అదనపు వసతి భవనం నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం రేకులతో నిర్మించిన విశాలమైన భవనంతో పాటు దానికి ఆనుకుని ఉన్న మరో రెండు గదులున్న మరో భవనాన్ని కూల్చి వేసింది. నూతన భవన నిర్మాణానికి పనులు చేపట్టి రెండు అంతస్థులకు శ్లాబ్ వేశారు. అయితే అక్కడి నుంచి పనులు ముందుకు సాగడం లేదు. సిమెంట్ లేకపోవడం వల్లే పనులు జరగడం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. కాగా గత ఎనిమిది నెలలుగా అసంపూర్తి భవనాలు దర్శనమిస్తున్నాయి. దీని వల్ల ప్రస్తుతం ఉన్న చాలీచాలని గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భవన నిర్మాణాలు పూర్తి చేసి విద్యార్థుల వసతి సమస్య తీర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై పాఠశాల హెచ్‌ఎం ప్రభుదాస్‌ను సంప్రతించగా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.8 లక్షల నిధులు, సామగ్రి సిద్ధంగా ఉన్నాయన్నారు. సిమెంట్ లేకపోవడంతో పనులు జరగడం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారని, వసతి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని తెలిపారు.
Updated Date - Sep 16 , 2024 | 12:33 AM