కొత్తపట్నం నుంచి వెంకటాపురం వరకు తారు రోడ్డు వేయాలి
ABN, Publish Date - Nov 21 , 2024 | 11:52 PM
మండలంలోని కొత్తపట్నం నుంచి వెంకటాపురం వరకు తారురోడ్డు వేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గోవిందపాలెం జంక్షన్లో పలు గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు.
గోవిందపాలెం జంక్షన్లో ప్రజాసంఘాల ఆందోళన
రాంబిల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపట్నం నుంచి వెంకటాపురం వరకు తారురోడ్డు వేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గోవిందపాలెం జంక్షన్లో పలు గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.దేముడునాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎన్ఏఓబీ ఏర్పాటు కావడంతో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువ అయ్యాయన్నారు. ఓవర్లోడుతో లారీలు తిరుగుతుండడంతో రోడ్లు పాడై, పెద్ద పెద్ద గోతులు ఏర్పాడాయన్నారు. దుమ్ము, ధూళి బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని, నేవీ రోడ్డుపై హెవీ లోడుతో వస్తున్న భారీ వాహనాలను రోడ్డు నిర్మాణం చేపట్టేంతవరకు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సీఐ నర్శింగరావు ఆందోళన చేస్తున్న ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడారు. ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులు, నేవీ పీడీతో మాట్లాడి తక్షణమే రోడ్డును తడిపించేందుకు చర్యలు తీసుకుంటామని, కొత్తరోడ్డు నిర్మాణానికి అధికారులతో మాట్లాడతానని సీఐ నర్శింగరావు హామీ ఇవ్వడంతో ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 11:52 PM