23న ఏయూ ఈసీ సమావేశం
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:32 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
20 కీలకాంశాలతో సిద్ధమైన ఎజెండా
వీసీ పోస్టుకు పేరు సిఫార్సుతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారులకు సమాచారాన్ని అందించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పలు కీలక నిర్ణ యాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
వర్సిటీకి పూర్తిస్థాయి ఉపకులపతిని నియమించేందుకు ఉన్నత విద్యా శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టును ఆశిస్తూ భారీ సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీని నియమించాల్సి ఉంది. ఈ సెర్చ్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి నామినీ పేరును సిఫార్సు చేయాలి. ఈ పేరును ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫైనల్ చేయాలి. సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తారని చెబుతున్నారు. ఈ నెల 25లోగా నామినీ పేరును పంపించాల్సిందిగా ఇటీవల వర్సిటీకి సర్క్యులర్ వచ్చింది. దానికి అనుగుణంగా ఇప్పటికే కొన్నిపేర్లను వర్సిటీ అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు. వీటిపై సమావేశంలో చర్చించి ఒక పేరును ఖరారు చేయనున్నట్టు చెబుతున్నారు. దీంతోపాటు వర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న కొన్ని కోర్సులకు సంబంధించి ఈసీ అనుమతిని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆయా కోర్సులు, ఫీజుల అంశాన్ని చర్చించనున్నారు. అలాగే వర్సిటీలో వివాదంగా మారుతున్న ఎయిడెడ్ ఫ్యాకల్టీని కొనసాగించడం, లేదా వెనక్కి పంపించే అంశాన్ని ఎజెండాలో చేర్చినట్టు చెబు తున్నారు. కొన్ని హాస్టల్స్‌కు అవసరమైన భవన నిర్మాణాలకు సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాలు, విచారణ కమిటీల నియామకానికి సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వీటితోపాటు కొత్త ఈసీ నియామకానికి సంబంధించి ప్రస్తుత సభ్యులకు సూత్రపాయంగా తెలియజేస్తారని చెబు తున్నారు. సుమారు ఏడాది తరువాత జరిగే ఈసీ సమావేశానికి ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారులు వర్సిటీకి వస్తారా..? లేక వర్చువల్‌గా పాల్గొంటారా..? అన్నది తెలియాల్సి ఉంది.
Updated Date - Oct 21 , 2024 | 12:32 AM