బ్లాస్టింగ్ పనులతో బెంబేలు
ABN, Publish Date - Mar 24 , 2024 | 12:36 AM
డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పరిధి కొత్తవలస గ్రామానికి అతి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపడుతున్న బ్లాస్టింగ్ పనులతో గిరిజనులు బెంబేలెత్తిపోతున్నారు.
జాతీయ రహదారి నిర్మాణం కోసం కొండల పేల్చివేత
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎగిరి పడుతున్న బండరాళ్లు
గ్రామంలో పడుతుండడంతో భీతిల్లుతున్న ప్రజలు
పేలుళ్ల ధాటికి ధ్వంసమవుతున్న ఇళ్లు
అరకులోయ, మార్చి 23: డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పరిధి కొత్తవలస గ్రామానికి అతి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపడుతున్న బ్లాస్టింగ్ పనులతో గిరిజనులు బెంబేలెత్తిపోతున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొండలను బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్లు ఎగిరి కొత్తవలస గ్రామ సమీపంలో పడుతున్నాయి. బండరాళ్లు పెంకుటిళ్లపై కూడా పడుతుండడంతో ఇళ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. బ్లాస్టింగ్ వల్ల బండరాళ్లు గ్రామంలో పడుతున్నాయని కాంట్రాక్టరు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని, పైగా తమపై వాదనకు దిగుతున్నారని గ్రామస్థులు తెలిపారు. మోతాదుకు మించి మందుగుండును వినియోగించడం వల్లే బండరాళ్లు ఎగిరి పడుతున్నాయని చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బ్లాస్టింగ్ చేయ డం వల్ల బండరాళ్లు గ్రామానికి సమీపంలో ఎగిరిపడ్డాయని, ఇళ్లు సైతం దెబ్బ తిన్నాయని గ్రామస్థులు తెలిపారు. దీనిపై కలెక్టర్, సబ్ కలెక్టర్ స్పందించి తమకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.
Updated Date - Mar 24 , 2024 | 12:36 AM