ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భీమిలి ఆర్డీవో బరితెగింపు!

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:56 AM

జిల్లాల విభజన అనంతరం విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన భీమిలి రెవెన్యూ డివిజన్‌ అధికారిగా వచ్చిన ఎస్‌.భాస్కరరెడ్డి వైసీపీ నేతలు చెప్పిందల్లా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఏడాది కిందట నివేదిక

నాటి వైసీపీ కీలక నేతల హస్తం?

ఆ విషయం గుర్తించి, అడ్డుకున్న జేసీని బదిలీ చేసిన నాటి వైసీపీ ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రావడంతో వెలుగులోకి అక్రమాలు

ఆర్డీవో సహా ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

ఉన్నతాధికారుల తాత్సారం

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

ఆయనో రెవెన్యూ ఉన్నతాధికారి. ప్రభుత్వ భూములను, ఆస్తులను రక్షించాల్సిన ఆయన...అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన భూమి ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు తన వంతు సహకారం అందించారు. గత ప్రభుత్వ పాలకులు తమ అవసరాల కోసం ఏరికోరి తెచ్చుకున్న సదరు అధికారి తప్పు చేసినట్టు తేలినా కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జిల్లాల విభజన అనంతరం విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన భీమిలి రెవెన్యూ డివిజన్‌ అధికారిగా వచ్చిన ఎస్‌.భాస్కరరెడ్డి వైసీపీ నేతలు చెప్పిందల్లా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డివిజన్‌లో వందలాది ఎకరాల డీపట్టా భూముల ఫ్రీహోల్డ్‌ వ్యవహారంలో అప్పటి పాలకులు/ఉన్నతాధికారులు చెప్పినట్టు నడుచుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా నివేదిక ఇచ్చిన విషయం వెలుగుచూసింది.

కోట్ల విలువైన భూమి పరాధీనం చేసే యత్నం

మధురవాడలో వీఎంఆర్‌డీఏ నిర్మించిన హరిత గృహ సముదాయానికి ఎదురుగా సర్వే నంబరు 133లో గల 9.36 ఎకరాలను 2008లో హౌసింగ్‌ బోర్డుకు ప్రభుత్వం బదలాయించింది. అప్పట్లో విశాఖ రూరల్‌ తహసీల్దారుగా ఇదే భాస్కరరెడ్డి ఆ భూములను హౌసింగ్‌ బోర్డుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ 9.36 ఎకరాలు హౌసింగ్‌ బోర్డు ఆధీనంలోనే ఉంది. ఈ భూమిలో హౌసింగ్‌ బోర్డు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా ఉంచింది. ఆ భూమిపై కన్నేసిన ఒక వ్యక్తి సర్వే నంబర్‌ 133లో 3.47 ఎకరాలు తనదంటూ ఏడాది క్రితం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. భూమి కొట్టేయడానికి వీలుగా తప్పడు పత్రాలు సృష్టించారు. ఐటీ సంస్థలు, భారీ విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలు ఉన్న ఆ ప్రాంతంలో ఎకరా రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు పలుకుతుంది. తప్పుడు పత్రాలతో భూమి కాజేసే యత్నం వెనుక నాటి వైసీపీలో కీలక వ్యక్తులు ఉండడంతో అధికారులు ఫైలు ఆగమేఘాలపై ముందుకు కదిపారు. సర్వే నంబరు 133లో 9.36 ఎకరాలను హౌసింగ్‌ బోర్డుకు అప్పగించిన విషయాన్ని ప్రస్తావించకుండా భీమిలి ఆర్డీవో ద్వారా జేసీకి పంపారు. ఈ ఫైలు అందే సమయంలో జేసీగా విశ్వనాథన్‌ ఉన్నారు. అదే సమయంలో మధురవాడలో తమకు కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని హౌసింగ్‌ బోర్డు అధికారులు జేసీకి చెప్పడంతో పాటు భూమి వివరాలు అందజేశారు. దీంతో ఆయన అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికే తన వద్ద ఉన్న ఫైలులో ఉన్న సర్వే నంబరు, బోర్డు అధికారులు ఇచ్చిన సర్వే నంబరు ఒక్కటే కావడవంతో ఆయనకు అనుమానం వచ్చింది. సాధారణంగా తన వద్దకు భూముల ఫైలు వస్తే వెంటనే సదరు భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం విశ్వనాథన్‌కు అలవాటు. ఆయన స్వయంగా మధురవాడలో సర్వే నంబరు 133లో గల భూమిని పరిశీలించి హౌసింగ్‌ బోర్డుకు కేటాయించినదిగా గుర్తించారు. అయినా ప్రైవేటు వ్యక్తికి చెందిన భూమిగా పేర్కొంటూ ఫైలు పంపడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ఆర్డీవో, అప్పటి విశాఖ రూరల్‌ తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వోపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. తరువాత కొద్ది నెలలకు జేసీని ప్రభుత్వం బదిలీ చేయడం, ఈలోగా ఎన్నికలు రావడంతో భూమి వ్యవహారం తెర మరుగైంది. ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సర్వే నంబరు 133లో గల భూ వ్యవహారంపై దృష్టిసారించింది. అక్రమాలు జరిగినట్టు గుర్తించి ఆర్డీవో భాస్కర్‌రెడ్డితో పాటు ఆర్‌ఐ మల్లేశ్వరరావు, గ్రేడ్‌-2 వీఆర్వో దుర్గాప్రసాద్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. తహసీల్దారు రమణయ్య అప్పటికే హత్యకు గురికావడంతో ఆయన పేరు ప్రస్తావించలేదు. తహసీల్దారుగా ఉన్నప్పుడు సర్వే నంబరు 133లో భూమిని హౌసింగ్‌ బోర్డుకు అప్పగించిన భాస్కరరెడ్డి, అదే ఆర్డీవో అయిన తరువాత అదే భూమిలో 3.47 ఎకరాలు ప్రైవేటు వ్యక్తికి అప్పగించేలా ఫైలు పంపడం పరిశీలిస్తే అక్రమాలకు ఏ విధంగా సహకరించారో అర్థమవుతుందని రెవెన్యూలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలావుండగా ఓట్ల లెక్కింపు అనంతరం సెలవుపై విదేశాలకు వెళ్లిన భాస్కర్‌రెడ్డి ఇటీవల తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే హౌసింగ్‌ బోర్డు భూమి వివాదంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఫైలు సిద్ధమైంది. అయినా ఆయన ఆర్డీవోగా తిరిగి బాధ్యతలు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతించడం ఆశ్చర్యకరం.

Updated Date - Sep 21 , 2024 | 12:56 AM