ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పుడు పత్రాలు సమర్పిస్తే కేసులు

ABN, Publish Date - Nov 22 , 2024 | 01:01 AM

జిల్లాలో ఎవరైనా సరే తప్పుడు పత్రాలు సమర్పించి స్థిరాస్తులను రిజిస్టర్‌ చేసుకున్నట్టయితే వారిపై క్రిమినల్‌ కేసులు తప్పవని జిల్లా రిజిస్ట్రార్‌ టి.ఉపేంద్రరావు హెచ్చరించారు.

  • రిజిస్ర్టేషన్‌ వ్యవహారంలో మోసపూరితంగా వ్యవహరిస్తే ఉపేక్షించేంది లేదు

  • పెందుర్తి, భీమిలి, ద్వారకా నగర్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి

  • అన్నీ పరిశీలించుకున్నాకే స్థిరాస్తులు కొనండి

  • స్టాంపు పేపర్లకు ఎటువంటి కొరత లేదు

  • జిల్లా రిజిస్ట్రార్‌ టి.ఉపేంద్రరావు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఎవరైనా సరే తప్పుడు పత్రాలు సమర్పించి స్థిరాస్తులను రిజిస్టర్‌ చేసుకున్నట్టయితే వారిపై క్రిమినల్‌ కేసులు తప్పవని జిల్లా రిజిస్ట్రార్‌ టి.ఉపేంద్రరావు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యాన ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తప్పుడు రిజిస్ట్రేషన్లపై వారానికి కనీసం ఐదు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గురువారం ఆయన పలు అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ఇప్పటివరకూ సుమారు 150 ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ ప్రారంభించామన్నారు.

ప్ర: తప్పుడు రిజిస్ట్రేషన్‌ ఎవరు చేయించుకుంటున్నారు?

జ: కొందరు తమవి కాని ఆస్తులకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి వాటి ఆధారంగా రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఒకరికి బదులుగా వేరొకరు వచ్చి డాక్యుమెంట్‌లో ఉన్న పేరు గల వ్యక్తిని తానేనంటూ రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. ఇంకొందరు రెవెన్యూ శాఖ నుంచి తప్పుడు సర్వే నివేదికలు సమర్పించి పనులు పూర్తి చేసుకుంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి కుటుంబాల ఆస్తుల విషయంలో తాము తప్ప ఇంకెవరూ వారసులు లేరని వాస్తవాలు దాచి రిజిస్ర్టేషన్‌ చేసుకుంటున్నారు. కక్షిదారులు సమర్పించిన ఆధారాలు పరిశీలించి సబ్‌ రిజిస్ట్రార్లు పనులు చేస్తారు. తప్పుడు వివరాలు సమర్పించిన వారే బాధ్యులు అవుతారు. వారిని ప్రాసిక్యూట్‌ చేస్తాం.

ప్ర: ఎక్కడ ఇలాంటివి ఎక్కువ జరిగాయి?

జ: ఇప్పటివరకూ అందిన ఫిర్యాదుల ప్రకారం చూసుకుంటే పెందుర్తి, భీమిలి, ద్వారకా నగర్‌ ప్రాంతాల్లో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి.

ప్ర: స్థిరాస్తి కొంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జ: జీవితంలో ఎవరైనా సరే ఒకటి లేదా రెండు మాత్రమే స్థిరాస్తులు సమకూర్చుకోగలుగుతారు. కష్టపడి సంపాదించిన సొమ్ము పరులపాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొనాలనుకుంటున్న ఆస్తికి సంబంధించిన ఎంకంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) తీసుకోవాలి. దానివల్ల అది ఎవరి పేరున ఉందో తెలుస్తుంది. సర్వే నంబరు అదేనా?, వేరొకటి వేశారా?...అనేది చెక్‌ చేసుకోవాలి. క్షేత్రస్థాయికి వెళ్లి పరిసరాల్లో ఉంటున్న వారితో మాట్లాడి ఆ భూమి వారసులు, హక్కుదారులు ఎవరో తెలుసుకుంటే చాలా వరకూ మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.

ప్ర: ప్రజలకు స్టాంపు పేపర్లు అందుబాటులో తెచ్చారా?

జ: సుమారు రూ.1.2 కోట్ల విలువైన స్టాంపు పేపర్లు తొలి విడతలో తెప్పించాం. రూ.100 విలువైనవి 72 వేలు, రూ.50 విలువైనవి 80 వేలు, ఇంకా రూ.20, రూ.10 విలువ కలిగినవి కూడా తెప్పించాం. జిల్లాలోని తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోను అందుబాటులో ఉన్నాయి. స్టాంపు విక్రేతలకు కూడా ఇచ్చాం.

ప్ర: స్టాంపు పేపర్లను పాత తేదీలు వేసి విక్రయిస్తే ఏం చేస్తారు?

జ: గతంలో ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు అవకాశం లేదు. దీనికి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ తీసుకువచ్చారు. ఎవరికి స్టాంపు పేపర్‌ విక్రయించినా ఆన్‌లైన్‌లో పేరు, తేదీ నమోదు చేయాల్సిందే. కొన్నవారి మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేశాకే స్టాంపు పేపరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర ఎన్ని స్టాంపు పేపర్లు ఉన్నాయో కూడా లెక్క తెలిసిపోతుంది. స్టాకు ఉంచుకొని ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం. స్టాంపు విక్రేతలు ఇండెంట్‌ పెట్టాలన్నా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.

ప్ర: ఈ స్టాంపింగ్‌ (జెరాక్స్‌) డాక్యుమెంట్‌కు స్వస్తి పలికినట్టేనా?

జ: కక్షిదారులు ఏది కోరుకుంటే దానిపైనే డాక్యుమెంట్‌ ఇస్తాం. ప్రభుత్వం నుంచి అయితే ఈ స్టాంపింగ్‌ ఆపేయాలని ఉత్తర్వులు రాలేదు. ఇప్పుడు అంతా రూ.100 స్టాంపు పేపర్లపైనే లావాదేవీలు రాసుకొని, వాటిపైనే డాక్యుమెంట్లు తీసుకుంటున్నారు.

Updated Date - Nov 22 , 2024 | 01:01 AM