ప్రాణాలు తీస్తున్న చీప్ లిక్కర్
ABN , Publish Date - Apr 27 , 2024 | 01:42 AM
తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.

సంవత్సరం అమ్ముడైన మద్యం విలువ (రూ.కోట్లలో)
2019-20 రూ.767.92 కోట్లు
2022-23 రూ.1952.33 కోట్లు
2023-24 రూ.2061.3 కోట్లు
వైసీపీ పాలనలో నాసిరకం మద్యం ప్రవాహం
అధికార పార్టీ నేతల చేతుల్లో గల డిస్టిలరీల్లో తయారీ
బ్రాండెడ్ మద్యం స్థానంలో సొంతబ్రాండ్లు విక్రయం
గత్యంతరం లేని పరిస్థితుల్లో తాగేస్తున్న మందుబాబులు
కాలేయం, జీర్ణాశయం, దృష్టి సమస్యలు
కేజీహెచ్‌కు ప్రతిరోజూ 30 వరకూ ఓపీ నమోదు
తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకుని చికిత్స
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దశలవారీగా మద్యాన్ని తగ్గించి పేదలకు అందుబాటులో లేకుండా కేవలం స్టార్ హోటళ్లకే విక్రయాలను పరిమితం చేస్తామన్నారు. మద్య నిషేధం చేసిన తరువాతే మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తానన్నారు. ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోగా మరింత నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చారు. ఏమాత్రం నాణ్యత లేని ఆ చీప్ లిక్కర్ మందుబాబుల ప్రాణాలను హరిస్తోంది. ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్న నాసిరకం మద్యం తాగుతున్నవారి కాలేయం, జీర్ణాశయం దెబ్బతింటున్నాయి. ఇంకా కంటిచూపు సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకేసారి శరీర అవయవాలు పనిచేయకపోవడంతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది. కొంతమంది అప్పటికి ప్రాణాపాయం నుంచి బయటపడినా, చాలామంది మృత్యువు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. మద్యం తాగడం వల్ల అనారోగ్యం పాలైన కేసులు కేజీహెచ్‌కు నిత్యం 30 వరకూ వస్తున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మద్యం పాలసీని ప్రకటించింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మద్యం తయారుచేసే డిస్టిలరీలు కూడా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. అధిక లాభాల కోసం నాణ్యత లేని మద్యం తయారుచేసి ఏదో ఒక బ్రాండ్‌తో మార్కెట్‌లోకి వదులుతున్నాయి. ప్రీమియం బ్రాండ్లు అయిన బ్లాక్‌డాగ్, 100 పైపర్స్, టీచర్స్, బ్లెండర్‌స్ర్పెడ్, సిగ్నేచర్ వంటి బ్రాండ్ల సరఫరాను నియంత్రించి, తమ సొంతబ్రాండ్‌లు మద్యం విక్రయాలు పెరిగేలా అబ్కారీ శాఖ అధికారులకు ఆదేశాలివ్వడం మొదలెట్టారు. మద్యం దుకాణాల్లో నాసిరకం మద్యం మాత్రమే అందుబాటులో ఉండడంతో మందుబాబులు తప్పనిసరి పరిస్థితుల్లో దానినే తాగుతున్నారు. దీనివల్ల మద్యం తాగినవారి ఆరోగ్యం కొద్దికాలానికే దెబ్బతింటోంది. నాణ్యత లేని ముడిసరకులు, విపరీతమైన ఫ్లేవర్స్, రంగులు వినియోగించడం, కిక్ పెరగడానికి సింథటిక్ కెమికల్‌ను మోతాదుకు మించి వాడడం వల్ల నాసిరకం మద్యం సేవించిన వారిలో ముందుగా కాలేయం పనితీరు దెబ్బతింటోంది. అలాగే జీర్ణాశయం దెబ్బతిని ఆకలి మందగిస్తోంది. దీనివల్ల పోషకాహారలోపం తలెత్తి రక్తహీనతకు దారితీస్తోంది. రక్తహీనత దరిచేరగానే కంటి సమస్యలు వచ్చి దృష్టిలోపం తలెత్తుతోంది. వీటన్నింటి కారణంగా మద్యం తాగిన వ్యక్తి చూస్తుండగానే శక్తిని కోల్పోయి పనిచేయలేని స్థితిలో మంచానపడిపోతున్నాడు. నాసిరకం మద్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా, ప్రాణాలు పోతున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు.
కేజీహెచ్‌కు రోజుకు 30 వరకూ కేసులు
నాసిరకం మద్యం సేవించి అనారోగ్యం బారినపడినవారు, మద్యానికి బానిసైనవారు (వారి ఆ సమస్య నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు తీసుకువస్తున్నారు) ప్రతిరోజూ 30 మంది వరకూ కేజీహెచ్‌కు వస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారిన వారిని ఆ అలవాటు నుంచి బయటపడేసేందుకు వీలుగా కేజీహెచ్‌లో ప్రత్యేకంగా డీ అడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. కేజీహెచ్‌లో ఓపీ తీసుకున్న వారిని వైద్యులు, మానసిక నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్ చేస్తారు. తర్వాత వారికి మందులు ఇచ్చి మద్యం అలవాటు నుంచి క్రమంగా బయటపడేసేందుకు కృషిచేస్తారు. ఓపీకి వచ్చిన వారిలో కాలేయం, జీర్ణాశయం, కిడ్నీలు వంటివి దెబ్బతిన్నట్టు వైద్యులు భావిస్తే వారిని గ్యాస్ర్టో ఎంటరాలజీ విభాగంలో చేర్పించి చికిత్స అందజేస్తారు. గ్యాస్ర్టో ఎంటరాలజీ విభాగంలో ఇన్‌పేషెంట్లుగా నిత్యం 50 మంది వరకూ చికిత్స పొందుతుంటారని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నా, వైద్యులు మాత్రం అలాంటివారు తమ వద్ద ఎవరూ చికిత్స తీసుకోవడం లేదనే బుకాయిస్తుంటారు. మద్యం సేవించడం కారణంగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిలో రెండు, మూడు రోజులకొకరు ప్రాణాలు కోల్పోతున్నా, వైద్యులు మాత్రం నెలకు ఒకటి, రెండుకు మించి ఉండవని చెబుతున్నారు.
మద్యం బాధితులకు పురందేశ్వరి పరామర్శ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గత ఏడాది డిసెంబరులో కేజీహెచ్‌ను సందర్శించి నాసిరకం మద్యం కారణంగా అనారోగ్యం పాలై గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. అప్పటికి 52 మంది వార్డులో చికిత్స పొందుతుండగా వారిలో 39 మంది కేవలం మద్యం కారణంగానే అనారోగ్యం పాలయ్యారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం పేరుతో వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రికి ఆమె లేఖ కూడా రాశారు.
ధర కూడా గతం కంటే రెట్టింపు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ రూ.60 నుంచి రూ.70 మద్య విక్రయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ సొంత మనుషుల డిస్టిలరీల్లో తయారైన బ్రాండ్లను విక్రయిస్తున్నారు. మొదట్లో క్వార్టర్ బాటిల్ రెట్టింపు (రూ.120 నుంచి రూ.140) ధరకు అమ్మారు. దశలవారీగా రూ.200 చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్నాయని ఆరేడు నెలలుగా తగ్గించుకుంటూ వచ్చి ప్రస్తుతం రూ.130కి విక్రయిస్తున్నారు.