సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:43 PM
జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ అదనపు కార్యదర్శి గుల్జార్ నటరాజన్ ఆదేశించారు.
కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ అదనపు కాద్యదర్శి గుల్జార్ నటరాజన్ ఆదేశం
బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల అలసత్వంపై ఆగ్రహం
పాడేరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ అదనపు కార్యదర్శి గుల్జార్ నటరాజన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల నిర్మాణం జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ టవర్ల నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్ టెల్ సంస్థల సెల్ టవర్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు.
జిల్లాకు రూ.12 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల
ఆకాంక్ష జిల్లాల అభివృద్ధిలో భాగంగా వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాల కల్పన కింద కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకు ప్రత్యేకంగా రూ.12 కోట్ల నిధులు విడుదల చేసిందని గుల్జార్ నటరాజన్ తెలిపారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు, తాగునీటి పథకాల పనులను త్వరితగతిన ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ 565 టవర్లకు 157 మాత్రమే పూర్తి చేశారని, జియో465 టవర్లకు 413 పూర్తయ్యాయన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల నిర్మాణంలో జాప్యంపై ఆయన అధికారులను మందలించారు. అలాగే 394 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులకు 228 పూర్తి చేశారని, సెల్ టవర్ల నిర్మాణాల పురోగతిపై ఐటీడీఏ పీవోలు సమీక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, ఐటీడీఏ పీవో వి.అభిషేక్, సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, డీఎఫ్‌వో పీవీ సందీప్‌రెడ్డి, డీఆర్‌వో పద్మలత, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, సీపీవో ఆర్‌కే పట్నాయక్, నీతి అయోగ్ ప్రోగ్రాం అధికారి నారాయణరెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్ ఆపరేషన్స్ జీఎం ఆడమ్స్, డీజీఎంలు ఎం.సత్యప్రసాద్, ఆర్.శ్రీకాంత్ పట్నాయక్, బీవీవీ నగేశ్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నంద్, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ ఎల్.రజని, డీఈవో బ్రహ్మాజీరావు, పీహెచ్‌వో ఎన్.అశోక్, కాఫీ బోర్డు ఎస్‌ఎల్‌వో ఎస్.రమేశ్, సీడీపీవో పి.ఝాన్సీరాణి, జియో సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన టెలికాం సేవలు అందాలి
టెలికాం వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ అదనపు కార్యదర్శి గుల్జార్ నటరాజన్ సూచించారు. పాడేరు మండలంలోని వంజంగి గ్రామ సచివాలయం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, డోకులూరు పంచాయతీ మండిపుట్టు గ్రామం వద్ద రూ.87 లక్షల వ్యయంతో నిర్మించిన బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్‌ను, మోదాపల్లిలో కాఫీ తోటలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గుల్జార్ నటరాజన్ వంజంగి పంచాయతీలో అంగన్‌వాడీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆశ కార్యకర్తలతో మాట్లాడి ఆస్పత్రి ప్రసవాలపై ఆరా తీశారు. వంజంగి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వారి పఠనాసక్తిని, ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించారు.
మండిపుట్టులో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ పరిశీలన
పాడేరు మండలం డోకులూరు పంచాయతీ పరిధి మండిపుట్టు గ్రామంలో రూ.87 లక్షలతో నిర్మించిన బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్‌ను గుల్జార్ నటరాజన్ పరిశీలించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ మొబైల్ టవర్, సోలార్ పవర్ ప్లాంట్, సిగ్నల్ విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి సెల్ టవర్ నిర్మించడం వల్ల ప్రయోజనం ఉందా?, లేదా? అని అడిగి తెలుసుకున్నారు. సెల్ టవర్ నిర్మాణంతో కమ్యూనికేషన్ పెరిగిందని, కొన్ని చిన్నపాటి మొబైల్ ఫోన్లలో సక్రమంగా మాటలు వినపడడంలేదని గ్రామస్థులు ఆయనకు తెలిపారు. స్పందించిన ఆయన సక్రమంగా వాయిస్ వినబడకపోవడానికి గల సాంకేతిక సమస్యను గుర్తించి వారం రోజుల్లో పరిష్కరించాలని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులను ఆదేశించారు. మండిపుట్టు గ్రామంలో సెల్ టవర్ నిర్మాణంతో డోకులూరు, బరిసింగి పంచాయతీల పరిధిలోని గొట్టిపల్లి, డేగలవీధి, మండిపుట్టు, మసిపుట్టు గ్రామాలకు సెల్ సిగ్నల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని డోకులూరు సర్పంచ్ కె.సన్నిబాబు వివరించారు. తరువాత మండలంలోని మోదాపల్లి గ్రామంలోని కాఫీ తోటలను ఆయన పరిశీలించారు. కాఫీ తోటలు, మిరియాల సాగు ద్వారా గిరిజన రైతులు పొందుతున్న ఆదాయాలను అడిగి తెలుసుకున్నారు. కాఫీ రైతులతో ముచ్చటించి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై ఆరా తీశారు.
Updated Date - Nov 19 , 2024 | 11:43 PM