అన్నదాతల్లో అలజడి
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:42 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నం తుఫాన్‌గా మారినట్టు వాతావరణ శాఖ వెల్లడించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. కొన్నిచోట్ల చిరుజల్లులు పడ్డాయి. దీంతో రైతుల్లో అలజడి మొదలైంది.
తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం
జిల్లా అంతటా మసుగు వాతావరణం
అక్కడక్కడ చిరుజల్లులు
నేడు, రేపు భారీ వర్షాల హెచ్చరికలు
వరి రైతులు ఆందోళన.. హడావుడిగా కుప్పలు
అనకాపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నం తుఫాన్‌గా మారినట్టు వాతావరణ శాఖ వెల్లడించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. కొన్నిచోట్ల చిరుజల్లులు పడ్డాయి. దీంతో రైతుల్లో అలజడి మొదలైంది.
సాయంత్రం తరువాత శీతల గాలుల తీవ్రత పెరిగింది. కాగా తుఫాన్ హెచ్చరికలు, ఆకాశం మేఘావృతం కావడంతో వరి రైతులు గుబులు చెందుతున్నారు. గత మూడు, నాలుగు రోజుల్లో వరి పైరు కోత కోసిన పొలాల్లో పనలను కుప్పలు వేయడం మొదలుపెట్టారు. కొన్నిచోట్ల వరి పనలు పూర్తిగా ఎండకపోయినప్పటికీ వర్షం పడితే తడిసిపోతాయన్న ఉద్దేశంతో ఆదరాబాదరాగా కుప్పలు వేశారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిస్తే వరి కుప్పలు నీట మునిగే ప్రమాదం వుండడంతో కూలీలను ఏర్పాటు చేసికుని, ఎత్తు ప్రదేశాలో కుప్పలు వేస్తున్నారు. వర్షానికి తడవకుండా వుండడానికి కుప్పలపై టార్పాలిన్లు కప్పారు. కాగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో వరి కోతలను వాయిదా వేసుకున్న రైతులు.. తుఫాన్ ప్రభావంతో రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో పంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో వర్షం నీరు నిలువకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈదురు గాలులు వీస్తుండడంతో వరి పైరు నేల వాలుతున్నది. అధిక వర్షం కురిసి, పొలాల్లో నీరు నిల్వ వుంటే వరి పైరు కుళ్లిపోయే అవకాశం వుందని అంటున్నారు.
రెల్ల రాల్చు పురుగు బెడదతో హడావిడిగా కోతలు
ఇదిలావుండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, తుఫాన్‌గా మారుతుందని నాలుగైదు రోజుల క్రితమే వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వరి కోతలు వాయిదా వేసుకోవాలని, అప్పటికే కోత కోసిన పొలాల్లో వరి పనలను కుప్పలుగా వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. అత్యధిక శాతం మంది రైతులు వరి కోతలను వాయిదా వేసుకున్నారు. అయితే చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో వరి పంటను రెల్ల రాల్చు (కత్తెర) పురుగు ఆశించి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వరి కోతలు వాయిదా వేస్తే.. రెల్ల రాల్చు పురుగు ఉధృతి మరింత పెరిగి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని భావించిన రైతులు బుధ, గురువారాల్లో కూడా వరి కోతలు కోశారు. శుక్రవారం ఆకాశం మేఘావృతం కావడంతో వరి పనలు పూర్తిగా ఎండకుండానే కుప్పలు వేస్తున్నారు.
ఇదిలా వుండగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారం యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మండల అధికారులు స్థానికంగా ఉండి అవసరమైతే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌తోపాటు అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను మరో రెండు రోజులపాటు కొనసాగించాలని నిర్ణయించారు.
Updated Date - Nov 30 , 2024 | 12:42 AM