గిరిజనులకు తప్పని డోలీ మోతలు
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:21 AM
రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు.
బోడిగరువులో గర్భిణికి పురిటి నొప్పులు
డోలీలో ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఐదు కి.మీ.లు నడుచుకుంటూ.. గెడ్డలు దాటుకుని దేవరాపల్లి రాక
దేవరాపల్లి, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి)
రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. పురిటి నొప్పులు వచ్చిన గర్భిణులను, అస్వస్థతకు గురైన బాలింతలను, దీర్ఘకాలిక వ్యాధులబారిన పడి నడవలేనిస్థితిలో వున్న వారిని ఆస్పత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడంలేదని గిరిజనులు వాపోతున్నారు. మండలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆనుకుని వున్న గ్రామాల్లో డోలీ మోతలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా బోడిగరువు గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణిని డోలీలో మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణికి ఆదివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతోపాటు తుఫాన్ కారణంగా వర్షం కురుస్తుండడంతో మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. సోమవారం డోలీలో మోసుకుంటూ దారిలో గెడ్డ దాటుకుని సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని చింతలపూడి బ్రిడ్జి వరకు వచ్చారు. అక్కడ నుంచి 108 అంబులెన్స్‌లో దేవరాపల్లి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వరకు ఇక్కడ వుంచినప్పటికీ ప్రసవం కాకపోవడంతోపాటు వైద్య నిపుణులు లేకపోవడంతో కె.కోటపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో సాధారణ ప్రసవం జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
------------------------------------------------------------------------------
ముసురుతో గుబులు
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి
ఆందోళన చెందుతున్న వరి రైతులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీరందాటి అల్పపీడనంగా బలహీనపడగా.. దాని ప్రభావంతో జిల్లాలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు అడపాదడపా తేలికపాటి జల్లులు పడుతూనే ఉన్నాయి. ముసురు వాతావరణం నెలకొని పాటు మోస్తరు వర్షం కురుస్తుండడంతో వరి రైతులు కలవరం చెందుతున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో దాదాపు వారం రోజుల నుంచి రైతులు వరి కోతలు కోయడం లేదు. మరోవైపు రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని, అందువల్ల వరి కోతలు మొదలు పెట్టవద్దని అధికారులు సూచిస్తున్నారు. దీంతో గింజ రాలిపోతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా వుండగా ఈదురు గాలులు వీచడంతో సాంబ మసూరి వంటి ఎక్కువ ఎత్తు పెరిగే రకాలు వేసిన పొలాల్లో వరి పైరు నేలవాలింది. దీంతో రైతులు కూలీలను ఏర్పాటు చేసుకుని, వరి దుబ్బులను నిలబెట్టుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని భూముల్లో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపుతున్నారు. మంగవారం పూర్తిగా ఎండకాసి, ఆకాశం మేఘావృతం కాకుండా వుంటే బుధవారం నుంచి వరి కోతలు మొదలుపెట్ట వచ్చని వ్యవసాయ శాఖ అధికారుల సూచిస్తున్నారు.
Updated Date - Dec 03 , 2024 | 01:21 AM