28 సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:32 AM
జిల్లాలో గల 29 సాగునీటి సంఘాల్లో 28 సంఘాలకు పాలకవర్గాలు శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
పినగాడిలో మాత్రమే ఎన్నికల నిర్వహణ
మొత్తం 174 మందికిగాను 162 మంది ఏకగ్రీవంగా, మరో ఆరుగురు పోలింగ్ ద్వారా ఎన్నిక
ఆరుచోట్ల ఎన్నిక వాయిదా
అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి
మొత్తం ‘కూటమి’ కైవసం
విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో గల 29 సాగునీటి సంఘాల్లో 28 సంఘాలకు పాలకవర్గాలు శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. పెందుర్తి మండలం పినగాడి సంఘానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సంఘానికి ఆరుగురు చొప్పున 174 మంది ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకుగాను 162 మంది ఏకగ్రీవంగా, మరో ఆరుగురు పోలింగ్ ద్వారా ఎన్నికయ్యారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కాపులుప్పాడ, గంభీరం నీటి సంఘాల పరిధిలో ముగ్గురేసి చొప్పున ఆరు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికపై ప్రతిష్టంభన నెలకొనడంతో వాయిదా వేశారు.
జిల్లాలో ఆనందపురం మండలంలో నాలుగు, భీమిలి మండలంలో ఐదు, పద్మనాభం మండలంలో ఏడు, పెందుర్తి మండలంలో 13 నీటి సంఘాలు ఉన్నాయి. శనివారం ఉదయం ప్రతి సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి, ఇద్దరు అసిస్టెంట్లు, బందోబస్తు కోసం పోలీసులు వెళ్లారు. పినగాడి సంఘానికి తప్ప మిగిలిన వాటిలో దాదాపు అన్నిచోట్ల ఏకగ్రీవాలకు ఓటర్లు మొగ్గుచూపారు. పినగాడిలో కూటమి పార్టీలోనే రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఎన్నిక నిర్వహించారు. ఇంకా కాపులుప్పాడ, గంభీరం సంఘాల్లో మూడేసి ప్రాదేశిక నియోజక వర్గాలకు ఎన్నికలు జరగలేదు. మొత్తం 174లో 162 ప్రాదేశిక నియోజకవర్గాలకు సభ్యులపై ఏకాభిప్రాయం కుదిరింది. ఆ తరువాత ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వారంతా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. పినగాడిలో ఎన్నికలు నిర్వహించారు. అనంతరం సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షునిగా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకోవడంతో జిల్లాలోని 29 సంఘాలనూ కూటమి పార్టీల సానుభూతిపరులే చేజిక్కించుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్ పద్మనాభం మండలంలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో 29 నీటి సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తయినట్టు జల వనరుల శాఖ డీఈ, ఎన్నికల నోడల్ అధికారి జె.స్వామినాయుడు తెలిపారు.
Updated Date - Dec 15 , 2024 | 01:32 AM