గిరి రైతు ఖుషీ

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:18 AM

ఈ ఏడాది జిలాల్లో ఖరీఫ్‌ వరి సాగు ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి పంట చక్కగా పండడంతో రైతులు కోతలు కోయడం, కుప్పలు వేయడం, నూర్పులు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.

గిరి రైతు ఖుషీ
పాడేరు- హుకుంపేట మార్గంలో యంత్రంతో వరి నూర్పులు చేపడుతున్న దృశ్యం

సమృద్ధిగా వర్షాలు... ఆశాజనకంగా వరి పంట

- జిల్లా వ్యాప్తంగా 59,189 హెక్టార్లలో వరి సాగు

- వరి కోతలు, నూర్పుల్లో రైతన్న బిజీ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది జిలాల్లో ఖరీఫ్‌ వరి సాగు ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి పంట చక్కగా పండడంతో రైతులు కోతలు కోయడం, కుప్పలు వేయడం, నూర్పులు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు అనుకూలంగా వర్షాలు కురవడంతో పాటు అక్టోబరు, నవంబరు నెలల్లో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకపోవడంతో వరి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 59,189 హెక్టార్లలో వరి పంటను గిరిజన రైతులు సాగు చేశారు.

ఖరీఫ్‌ సీజన్‌కు సమృద్ధిగా కురిసిన వర్షాలు

ప్రధానంగా ఖరీఫ్‌లో సాగు చేసే పంటలకు జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాల ఆధారంగానే పంట బాగుంటుంది. జిల్లాలో జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 145 మిల్లీమీటర్లు కాగా, 342 మిల్లీ మీటర్లు నమోదైంది. అలాగే జూలైలో 312 మిల్లీ మీటర్లకు 590, ఆగస్టు నెలలో 243 మిల్లీ మీటర్లకు 466 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన మూడు నెలల్లో ఎటువంటి లోటు లేకుండా వర్షం కురవడంతో సాగునీటి పరంగా ఎటువంటి సమస్యా ఏర్పడలేదని వ్యవసాయాధికారులు తెలిపారు. ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో 30 నుంచి 40 శాతం వర్షపాతం లోటు నమోదైతే పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని వ్యవసాయాధికారులు, రైతులు అంటున్నారు.

ఖరీఫ్‌లో వరి పంటే గిరిజనులకు ప్రధాన ఆహారం

ఏజెన్సీలో ఖరీఫ్‌ సీజన్‌లోని వరి పంటే గిరిజన రైతులకు ప్రధాన ఆహారం. ఇతర ప్రాంతాల్లో వరిని వాణిజ్య పంటగా సాగు చేస్తూ, మార్కెట్‌లలో విక్రయిస్తుంటారు. కానీ ఏజెన్సీలో కేవలం తమ ఆహార అవసరాల కోసం మాత్రమే గిరిజన రైతులు వరి పంటను పండిస్తారు. వచ్చిన పంటనంతా నిల్వ చేసుకుని ఏడాదంతా వినియోగిస్తారు. పొరపాటున ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరి పంట నాశనమైతే తమ నోటికి అందే తిండి పోయిందని తీవ్రంగా ఆవేదన చెందుతారు. అందువల్ల ఖరీఫ్‌ వరిపై గిరిజనులు పూర్తి స్థాయిలో ఆధారపడి, ఇంటిల్లపాది వ్యవసాయం చేస్తారు. అయితే అన్ని పరిస్థితులు అనుకూలించడంతో ప్రస్తుతం వరి పంట బాగా పండి గిరిజన రైతులు జోరుగా కోతలు కోస్తూ, వరి పనలను కుప్పలుగా వేసుకుని నిల్వ చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే పలువురు యంత్రాలతో నూర్పులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏజెన్సీలో ఎక్కడ చూసినా గిరిజన రైతులు ఆనందంతో ఉత్సాహంగా ఆయా పనులు చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.

కోతలు, నూర్పుల పనుల్లో రైతులు నిమగ్నం

ఈ ఏడాది వరి పంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ నవంబరు నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, తుఫాన్లు సంభవించడంతో రైతులు కాస్త ఆందోళన చెందారు. అయితే వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు చేస్తుండడంతో రైతులు అప్రమత్తమయ్యారు. దీంతో అవకాశం ఉన్న రైతులు ముందస్తుగా పంటను కోసి ఇళ్లకు తరలించగా, కొందరు హుటాహుటిన యంత్రాలతో నూర్పులు సైతం చేసేశారు. మరి కొందరు కోతలు కోయకుండా పంట రక్షించుకున్నారు. దీంతో నవంబరు నెలలోని ప్రకృతి వైపరీత్యాలతో ఏజెన్సీలో వరి పంటకు ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అలాగే ప్రస్తుతం సాధారణ వాతావరణం నెలకొనడంతో పంట కోతలు, మోతలు, నూర్పులతో రైతులు బిజీగా ఉన్నారు.

Updated Date - Dec 10 , 2024 | 09:48 AM