గొల్లుమంటున్న గోకివాడ రైతు
ABN, Publish Date - Nov 18 , 2024 | 01:03 AM
సాగునీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి విషయంలో గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం మండలంలోని గోకివాడ ఆనకట్టను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అన్నదాతలను పలు విధాలుగా ఆదుకుంటున్నామని ఐదేళ్లపాటు కల్లబొల్లి కబుర్లు చెప్పారు. సుమారు 13 వేల ఎకరాలకు నీరు అందించేందుకు బ్రిటీష్ హయాంలో నిర్మించిన గోకివాడ ఆనకట్ట పూర్తిగా ఛిద్రమైంది. ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఏటా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా, గత ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
ఆధునికీకరణకు నోచుకోని ఆనకట్ట
13 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు
పుష్కర కాలం కిందట వరద ఉధృతికి ధ్వంసమైన షట్టర్లు, ఏప్రాన్, రక్షణ గోడ
గత టీడీపీ హయాంలో రూ.77 లక్షలు మంజూరు
పనులు చేపట్టడానికి ముందుకురాని కాంట్రాక్టర్లు
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా మంజూరుకాని వైనం
ఆనకట్టను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వానికి రైతులు వినతి
రాంబిల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి )
సాగునీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి విషయంలో గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం మండలంలోని గోకివాడ ఆనకట్టను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అన్నదాతలను పలు విధాలుగా ఆదుకుంటున్నామని ఐదేళ్లపాటు కల్లబొల్లి కబుర్లు చెప్పారు. సుమారు 13 వేల ఎకరాలకు నీరు అందించేందుకు బ్రిటీష్ హయాంలో నిర్మించిన గోకివాడ ఆనకట్ట పూర్తిగా ఛిద్రమైంది. ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఏటా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా, గత ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
రాంబిల్లి మండలం గోకివాడ సమీపంలో మేజర్ శారదా నదిపై 1906వ సంవత్సరంలో ఆనకట్ట నిర్మించారు. దీనికింద రాంబిల్లి, ఎలమంచిలి, ఎస్.రాయవరం మండలాల పరిధిలో 12,600 ఎకరాల ఆయకట్టు వుంది. దశాబ్దాల క్రితం నిర్మితం కావడం, కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడం, తాత్కాలిక మరమ్మతులు చేస్తుండడంతో ఆయకట్టుకు సక్రమంగా నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఆనకట్టను పునర్నిర్మించాలని రైతులు చాలా కాలంగా ప్రజాప్రతినిధులకు, జలవనరుల శాఖ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. పుష్కర కాలం క్రితం 2011 నవంబరు 2న ఎలమంచిలిలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి.. గోకివాడ ఆనకట్టను రూ.6 కోట్లతో ఆధునీకరిస్తామని ప్రకటించారు. కానీ ఆయన అధికారంలో వున్న సమయంలో నిధులు విడుదల కాలేదు. తరువాత వరుసగా మూడేళ్లపాటు శారదా నదికి భారీఎత్తున వరదలు రావడంతో ఆనకట్ట పూర్తిగా ధ్వంసమైంది. తలుపులు విరిగిపోయాయి. సుమారు 100 మీటర్ల మేర ఏప్రాన్ దెబ్బతిన్నది. దిగువ భాగంలో రాతిపేర్పు కొట్టుకుపోయింది. టీడీపీ హయాంలో (2017లో) ఆనకట్ట మరమ్మతుల కోసం రూ.77 లక్షలు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టడానికి ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కు మళ్లాయి. తరువాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. గొకివాడ ఆనకట్ట పునర్మిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. కానీ నిధులు మంజూరు చేయలేదు. తరువాత నుంచి ఏటా అంచనాలు పెరుగుతున్నాయి. కనీసం మరమ్మతు పనులు చేయడానికైనా రూ.2 కోట్లు మంజూరు చేయాలనిఇ గత ఏడాది చివరలో ప్రభుత్వానికి నివేదించారు. ఎప్పటి మాదిరిగానే వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది.
ఎలమంచిలి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన యూవీ రమణమూర్తిరాజు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన పంచకర్ల రమేశ్‌బాబు.. ఈ ఆనకట్టను పలుమార్లు పరిశీలించి ఆదునికీరణకు కృషి చేస్తామని చెప్పారు. అయితే కనీసం మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయించలేకపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి గోకివాడ ఆనకట్ట ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరమ్మతులు కాదు.. ఆధునికీకరణే!
ద్వారపురెడ్డి నానాజీ, రైతు, గోకివాడ
వేలాది ఎకరాలకు సాగునీరు అందించే గోకివాడ ఆనకట్ట గత పుష్కర కాలం నుంచి మర్మమ్మతులకు నోచుకోకపోవడంతో పూర్తిగా ఛిద్రమైంది. గేట్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆనకట్టకు మరమ్మతులు చేసినా ఫలితంగా వుండదు. ఆధునికీకరణతోనే పూర్తి ఆయకట్టుకు నీరు అందుతుంది. కూటమి ప్రభుత్వంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.
నిధులు మంజూరుకు ప్రతిపాదనలు
కె.శివాజీ, ఏఈ, జలవనరుల శాఖ
గోకివాడ ఆనకట్ట ఫాలింగ్ షట్టర్లు, ఏప్రాన్, రక్షణ గోడ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆధునికీకరణ పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి ఏటా ప్రతిపాదనలు పంపిచాం. కానీ ఒక్క ఏడాది కూడా నిధులు మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులకు, ఎలమంచిలి ఎమ్మెల్యేకు తెలియజేశాం. మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. నిధులు మంజూరు అయిన వెంటనే పనులు చేపడతాం.
Updated Date - Nov 18 , 2024 | 01:04 AM