ఉరుసు ఉత్సవం కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చి..
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:45 AM
గ్యార్మీ షరీఫ్ ఉరుసు సందర్భంగా సరదాగా గడుపుదామని తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ 16 ఏళ్ల బాలుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది.
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
సొంతూరు కాకినాడ..
గ్యార్మీ షరీఫ్ కోసం మూడు రోజుల క్రితం పెదబోదిగల్లం రాక
తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఢీకొనడంతో మృత్యువాత
ఎస్.రాయవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్యార్మీ షరీఫ్ ఉరుసు సందర్భంగా సరదాగా గడుపుదామని తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ 16 ఏళ్ల బాలుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. తాత, మనవడు కలిసి ద్విచక్రవాహనంపై అడ్డరోడ్డు జంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొన్నది. దీంతో బాలుడికి తీవ్ర గాయలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందాడు.. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
జిల్లా కేంద్రమైన కాకినాడకు చెందిన షేక్ మహ్మద్ యాసిన్ తన భార్య, కుమారుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ (16)తో కలిసి నక్కపల్లి మండలం పెదబోదిగల్లంలో గ్యార్మీ షరీఫ్ ఉర్సు సందర్భంగా ఈ నెల 18న మావయ్య షేక్ మహమ్మద్ ఖదీర్ బాషా ఇంటికి (భార్య పుట్టిల్లు) వచ్చారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఉరుసు మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సోమవారం ఉదయం జిలానీ, తాత ఖదీర్ బాషా కలిసి సొంత పనిమీద ద్విచక్ర వాహనంపై ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డుకు వచ్చారు. పనిముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. ఫ్లై ఓవర్ వంతెన దాటిన తరువాత వెనుక నుంచి వస్తున్న లారీ, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొన్నది. వెనుక కూర్చున్న జిలానీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నక్కపల్లి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమంగానే వుండడంతో 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బాలుడు అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Updated Date - Oct 22 , 2024 | 12:45 AM