డోలీ మోతలు ఇంకెన్నాళ్లో?
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:27 PM
మండలంలోని డౌనూరు పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక డోలీ మోతలు తప్పడంలేదు. ఈ గ్రామానికి చెందిన బోనంగి సీతారాం అనారోగ్యానికి గురికావడంతో గ్రామస్థులు సోమవారం మూడు కిలో మీటర్ల మేర డోలీపై బచ్చింత గ్రామం వరకు తరలించారు.
ముల్లుమెట్ట వాసులకు తప్పని అవస్థలు
రోగిని మూడు కిలో మీటర్ల మేర మోసుకెళ్లిన వైనం
కొయ్యూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి) మండలంలోని డౌనూరు పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక డోలీ మోతలు తప్పడంలేదు. ఈ గ్రామానికి చెందిన బోనంగి సీతారాం అనారోగ్యానికి గురికావడంతో గ్రామస్థులు సోమవారం మూడు కిలో మీటర్ల మేర డోలీపై బచ్చింత గ్రామం వరకు తరలించారు.
మండలంలోని ముల్లుమెట్ట గ్రామానికి గతంలో గ్రావెల్ రోడ్డు నిర్మించారు. ఈ రహదారి పూర్తిగా ధ్వంసమై ఇటీవల కురుస్తున్న వర్షాలకు బురదమయంగా మారింది. సోమవారం ఈ గ్రామానికి చెందిన బోనంగి సీతారాం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న బచ్చింత గ్రామం వరకు అంబులెన్స్ వచ్చింది. దీంతో డోలీ కట్టి అక్కడి వరకు సీతారాంను గ్రామస్థులు తరలించారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నామని, అయినా ఫలితం లేకపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మించాలని వారు కోరుతున్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:27 PM