ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ!

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:06 AM

ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు అత్యున్నత టెక్నాలజీని అమలుచేస్తుండగా, సైబర్‌ నేరగాళ్లు అంతకుమించిన టెక్నాలజీని వినియోగిస్తూ ఒక క్లిక్‌తో అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. ప్రజల సొమ్ముకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సైబర్‌నేరగాళ్లు పంపే ఏపీకే ఫైల్‌ లింక్‌

సైబర్‌ నేరగాళ్లు పంపే ఏపీకే ఫైళ్లు ఓపెన్‌ చేస్తే అంతే సంగతులు

రోజుకో కొత్త తరహాలో సైబర్‌ మోసం

అప్రమత్తం చేస్తున్న ట్రాయ్‌

నక్కపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు అత్యున్నత టెక్నాలజీని అమలుచేస్తుండగా, సైబర్‌ నేరగాళ్లు అంతకుమించిన టెక్నాలజీని వినియోగిస్తూ ఒక క్లిక్‌తో అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. ప్రజల సొమ్ముకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం మొబైల్‌ ఆధారంగా నగదు చెల్లింపులు జరుపుతున్నారు. నగదు రహిత లావాదేవీలకు విద్యావంతులతోపాటు సామాన్య ప్రజలు కూడా అలవాటుపడిపోయారు. పది రూపాయల విలువ చేసే వస్తువును కొనుగోలు చేసినా.. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫారాల ద్వారా చెల్లిస్తున్నారు. వీధిలోని చిన్నపాటి దుకాణంలో కూడా క్యూఆర్‌ కోడ్‌తో స్కానర్లు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నగదు రహిత లావాదేవీలు విజయవంతంగా సాగుతున్నప్పటికీ, సైబర్‌ నేరగాళ్ల నుంచి ప్రజల సొమ్ముకు భద్రత లేకుండా పోతున్నది. సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జనం సొమ్ములు తస్కరిస్తున్నారు. ఏటీఎం కార్డు పిన్‌, బ్యాంకు ఖాతాలు వంటి వివరాలు చెప్పకుండానే, క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బును కొల్లగొడుతున్నారు. అనేక మంది బ్యాంకు ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు అత్యాధునిక టెక్నాలజీతో కొల్లగొడుతున్నారు.

ఏపీకే ఫైళ్లతో ప్రమాదం !

కొందరు అపరిచిత వ్యక్తులు పంపే వాట్సాప్‌ సందేశాలు, ఏపీకే ఫైళ్లను ఓపెన్‌ చేస్తే నిమిషాల్లో డబ్బు లాగేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్‌ (ఏపీకే) ఫైళ్లను వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారు. వీటిని ఓపెన్‌ చేసి, ఓకే అని క్లిక్‌ చేస్తే.. సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాక్‌ అవుతాయి. ఫలితంగా మనకు సంబంధం లేకుండానే మన ఫోన్‌ నియంత్రణ సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళుతుంది. తమ ఫోన్‌ హ్యాక్‌ అయిందన్న విషయం తెలియని వారు ఎవరికైనా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సొమ్ము పంపితే, వెంటనే హ్యాక్‌ చేసిన మొబైల్‌ నంబరు ద్వారా పిన్‌ నంబరు తెలుసుకుని నిమిషాల్లో ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో వున్న సొమ్మును కాజేస్తున్నారు. హ్యాక్‌ చేసిన మొబైల్‌ డివైస్‌ డిస్‌ప్లే సైబర్‌ నేరగాళ్ల చేతిలో వుంటుంది. దీని ప్రకారం ఆ డివైస్‌లో వున్న కాంటాక్ట్‌ నంబర్లక, ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైన వ్యక్తి పంపినట్టు ఏపీకే ఫైళ్లు పంపుతున్నారు. నిజంగానే మనకు తెలిసిన వ్యక్తి నుంచే ఈ మెసేజ్‌ వచ్చిందని భావించి ఏపీకే ఫైళ్ల లింక్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. దీంతో బ్యాంకు ఖాతాల్లో వున్న సొమ్మును కోల్పోతున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఇందులోనే మరో తరహా మోసానికి పాల్పడుతున్నారు. హ్యాక్‌ చేసిన వ్యక్తి డివైస్‌ ద్వారా కాంటాక్ట్‌ నంబర్లలో కొందరికి మెసేజ్‌ పెడుతున్నారు. తాను ఒక సమస్యలో ఇరుక్కున్నానని, దీని నుంచి బయటపడడానికి అర్జంటుగా కొంత సొమ్ము పంపాలని కోరుతున్నారు. ఇటీవల అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ పేరుతో కూడా సైబర్‌ నేరగాళ్లు కొంతమంది ఉన్నతాధికారులకు ఇదే మాదిరిగా వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చాయి. కొంతమంది అధికారులు ఆశ్చర్యపోయి, ఈ విషయమై నేరుగా కలెక్టర్‌తో మాట్లాడారు. దీంతో కలెక్టర్‌ తీవ్రంగా స్పందించి సైబర్‌ నేరగాళ్లపై పోలీస్‌ శాఖకు ఫిర్యాదు చేశారు.

బ్లాక్‌ మెయిలింగ్‌

హ్యాక్‌ చేసిన ఫోన్‌లో వున్న కుటుంబ సభ్యులు లేదా కాంటాక్ట్‌, మొబైల్‌ గ్యాలరీలో వున్న మహిళలు, కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, తక్షణమే తమకు డబ్బు పంపాలని, లేకపోతే ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని సైబర్‌ నేరగాళ్లు బెదిరిస్తున్నారు.

ట్రాయ్‌ సూచనలు పాటిస్తే..

ట్రాయ్‌ మీ ఫోన్‌ను ఎలా డిస్‌కనెక్ట్‌ చేయబోతోంది అనే దాని గురించి ఎవరైనా కాల్‌ చేస్తే ప్రతిస్పందించవద్దు.

ఫెడెక్స్‌ ద్వారా ప్యాకేజీ వచ్చిందని చెప్పి, ‘1‘ లేదా మరేదైనా నంబర్‌ నొక్కమని అడిగితే వెంటనే ఫోన్‌ కాల్‌ను కట్‌ చేయండి.

పోలీసు అధికారిని అంటూ మీకు ఫోన్‌ చేసి మీ ఆధార్‌ నంబరు అడిగితే స్పందించకండి.

మీరు డిడిజిటల్‌ అరెస్టులో ఉన్నారని చెబితే పట్టించుకోవద్దు.

మీకు వచ్చిన/ మీరు పంపిన ప్యాకేజీలో డ్రగ్స కొనుగొన్నట్టు సైబర్‌ నేరగాళ్లు చెబుతారు. దీనికి మీరు ప్రతిస్పందించవద్దు.

సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ఉపయోగించి మిమ్మల్ని సంప్రదిస్తే ప్రతిస్పందించవద్దు.

ఎవరైనా మీకు కాల్‌ చేసి, పొరపాటున మీ యూపీఐ ఐడీకి డబ్బు పంపామని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరితే పట్టించుకోవద్దు.

ఎవరైనా మీ కారు/ వాషింగ్‌ మెషీన్‌/ సోఫా కొనుగోలు చేయాలనుకుంటున్నామని, సైన్యం లేదా సీఆర్‌పీఎఫ్‌ నుంచి వచ్చామని చెప్పి, వారి ఐడీ కార్డును మీకు చూపించినా ప్రతిస్పందించవద్దు.

వీడియో మోడ్‌లో ఎటువంటి కాల్స్‌కు సమాధానం ఇవ్వవద్దు.

మీకు కాల్‌ వచ్చిన నంబరు గందరగోళంగా, అనుమానంగా ఉంటే మీ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఆ నంబర్‌ని బ్లాక్‌ చేయండి.

నీలం రంగులో వచ్చిన ఏ లింక్‌ను కూడా క్లిక్‌ చేయకండి

పోలీసు, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి అత్యున్నత విభాగాల నుంచి మీకు నోటీసు వస్తే.. ఆఫ్‌లైన్‌లోనే స్పందించండి. ఇటువంటి లేఖలు అధీకృత ప్రభుత్వ పోర్టల్‌ నుంచి వచ్చాయో లేదో తనిఖీ చేయండి.

మీ చిరునామా, హోదా, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, పాన్‌ నంబర్‌, పుట్టిన తేదీ లేదా ఏదైనా వ్యక్తిగత వివరాలను ఫోన్‌ లేదా సందేశాల ద్వారా ఎవరితోనూ పంచుకోవద్దు.

సైబర్‌ నేరగాళ్లు మీకు కాల్‌ చేసి మీ పేరు, ఫోన్‌ నంబరు, మరికొన్ని వివరాలు చెబుతారు. ఇవి వాస్తవం అయినప్పటికీ మీరు వాటిని నిర్ధారించకుండా కాల్‌ను కట్‌ చేసి, ఆ ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయండి.

అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసినప్పుడు కీబోర్డులో ఎటువంటి నంబర్లను నొక్కవద్దు, వాళ్లు చెప్పిన వాటిని వినవద్దు. వెంటనే కాల్‌ కట్‌ చేసి, నంబర్‌ బ్లాక్‌ చేయండి.

ఒకవేళ పొరపాటున సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతే.. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

ఏపీకే మెసేజ్‌లు ప్రమాదకరం

కుమారస్వామి, నక్కపల్లి సీఐ

తెలిసిన లేదా అపరిచిత వ్యక్తుల పేరుతో వచ్చే ఏపీకే ఫైళ్లు గానీ, మీకు లాటరీ తగిలింది, ఈ లింక్‌ ఓపెన్‌ చేస్తే మీకు మంచి అవకాశం వుంటుందంటూ వచ్చే మెసేజ్‌లను నమ్మకూడదు. వాటిని వెంటనే తీసివేయాలి. సైబర్‌ నేరగాళ్లు పంపే ఏపీకే ఫైళ్లపై క్లిక్‌ చేయగానే ‘దిస్‌ డాక్యుమెంట్‌ మైట్‌ బీ హార్మఫుల్‌ ఫర్‌ యువర్‌ డివైస్‌’ అని వస్తుంది. ఇటువంటి ఫైళ్లపై క్లిక్‌ చేసినా, ఫైల్‌ ఓపెన్‌ చేసినా ఫోన్‌ హ్యాక్‌ అయ్యే ప్రమాదం వుంది. సైబర్‌ నేరగాళ్లు డబ్బు లూటీ చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే సమీపంలో వున్న పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలి.

Updated Date - Nov 15 , 2024 | 01:06 AM