పెరిగిన వాయు కాలుష్యం
ABN, Publish Date - Nov 22 , 2024 | 01:00 AM
నగరవాసులను వారం రోజులుగా కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలిలో ధూళికణాలు పీఎం 10 (0.01 ఎంఎం), పీఎం 2.5 (0.0025 ఎంఎం) క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
గడచిన వారం రోజులుగా నగరవాసులు ఉక్కిరిబిక్కిరి
గాలిలో పెరుగుతున్న ధూళి కణాలు
కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్యాచరణ : డిప్యూటీ సి ఎం పవన్
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
నగరవాసులను వారం రోజులుగా కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలిలో ధూళికణాలు పీఎం 10 (0.01 ఎంఎం), పీఎం 2.5 (0.0025 ఎంఎం) క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం పీఎం 10 అయితే 172, పీఎం 2.5...182 రికార్డయ్యాయి. సాధారణంగా 24 గంటల వ్యవధిలో పీఎం10...100, ఏడాది సగటు 60గా, పీఎం 2.5 అయితే 24 గంటల వ్యవధిలో 60, ఏడాది సగటు 40 మైక్రో గ్రాములుగా ఉండాలి. అటువంటిది నగరంలో గత వారం రోజులుగా ఈ రెండూ మూడింతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పీఎం10, పీఎం2.5 పెరుగుదల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
విశాఖలో కాలుష్యం పెరగడానికి పరిశ్రమలు, వాహనాలు, నిర్మాణాలు, ఘన వ్యర్థాలతో పాటు నగరం బౌల్ ఏరియాలో ఉండడం కారణాలుగా చెప్పవచ్చు. నగరం చుట్టూ ఉన్న కొండల కారణంగా విశాఖలో శీతాకాలం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీంతో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య కారకాలు పైకి వెళ్లకుండా భూమి ఉపరితలంపై ఉండిపోతున్నాయి. దీంతో వాతావరణంలో ధూళి కణాలు, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి ఉద్గారాలు పెరుగుతున్నాయి. ఇంకా నగరంలో ఏటేటా పెరుగుతున్న వాహనాల వల్ల ధూళి పెరుగుతుంది. అలాగే నగరంలో భవన నిర్మాణాలు సమయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ధూళి గాలిలో కలుస్తోంది. ఇదిలావుండగా నగరంలో కాలుష్య తీవ్రత తగ్గించడానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించింది. చెట్ల పెంపకం విరివిగా చేపట్టాలన్న ప్రణాళిక తూతూమంత్రంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గతంతో పోల్చితే విశాఖపట్నంలో కాలుష్యం ఏడు రెట్లు పెరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గురువారం శాసనమండలిలో ఆందోళన వ్యక్తంచేశారు. కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. దీనిపై పీసీబీ అధ్యయనం చేస్తోందని, 2025 జనవరిలో నివేదిక వస్తుందని...దానిని బట్టి తగిన కార్యాచరణ చేపడతామన్నారు. శీతాకాలంలో నగరంలో కాలుష్య తీవ్రతకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి.ముకుందరావు తెలిపారు. హెచ్‌పీఎసీల్‌లో తక్కువ సల్ఫర్ ఉన్న ముడి చమురు వాడాలని ఆదేశించామన్నారు. మిగిలిన కాలుష్య కారక పరిశ్రమల్ని అప్రమత్తం చేశామన్నారు.
Updated Date - Nov 22 , 2024 | 01:11 AM