ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరిపై క్రిమికీటకాలు దాడి

ABN, Publish Date - Nov 18 , 2024 | 01:07 AM

వరిపై క్రిమికీటకాలు దాడి

మత్స్యపురంలో సుడిదోమ తెగులు ఆశించడంతో ఎండిపోతున్న వరి పైరు

ఆర్‌జేఎల్‌, సాంబ మసూరి రకాలను ఆశించిన కత్తెర పురుగు, సుడిదోమ

గింజ కట్టిన తరువాత తెగుళ్లు సోకడంపై రైతులు విస్మయం

తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆందోళన

నివారణ చర్యలు చేపట్టాలని ఏవో సూచన

రావికమతం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మరో రెండు, మూడు వారాల్లో కోతకు రానున్న వరి పైరుపై క్రిమికీటకాలు దాడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గింజకట్టిన తరువాత కత్తెర పురుగు (పచ్చపురుగు), సుడిదోమ ఆశించాయని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల కత్తెర పురుగు దాడి ఉధృతంగా వుండడంతో వరి కంకులను ఎడాపెడా కొరికివేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. సుడిదోమ ఆశించిన పొలంలో వరి దుబ్బులు ఎండిపోయి, కంకులు గింజ కట్టకుండానే పొల్లుగా రాలిపోతున్నదని వాపోతున్నారు.

కత్తెర పురుగు ఎక్కువగా ఆర్‌జేఎల్‌, సాంబ మసూరి రకాలను ఆశించింది. ఈ పురుగు వ్యాప్తి చాలా వేగంగా వుంటుంది. రైతులు వెంటనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే మూడు, నాలుగు రోజుల్లో పొలం మొత్తం వ్యాపించి వరి వెన్నులు కొరికివేస్తున్నాయి. మండలంలోని గుమ్మాళ్లపాడు, చినపాచిల, గర్నికం, కొమిర, మత్స్యపురం, మేడివాడ, గొంప తదితర గ్రామాల్లో ఉధృతంగా వుందని రైతులు కరెడ్ల నారాయణ, నక్కా అచ్చిమినాయుడు, కలిగిరి ధనలక్ష్మి, సిద్దా ప్రసాద్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేసిన కొద్ది రోజుల నుంచి ఇటీవల వరకు తెగుళ్ల నివారణకు పలుమార్లు రసాయన ఎరువులను పచికారీ చేశామని, మరికొద్ది రోజుల్లో పంట చేతికవచ్చే తరుణంలో కూడా తెగుళ్లు సోకడం ఇప్పుడే చూస్తున్నామని అంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సంతృప్తికరంగానే కురిసి, వాతావరణం అనుకూలంగా వుండడంతో వరి పంట బాగానే పండిందని, దిగుబడి కూడా ఆశాజనకంగా వుంటుందని భావిస్తున్న తరుణంలో కత్తెర పురుగు, సుడిదోమ ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.

కాగా గింజ దశలో వున్న వరి పైరును ఆశించిన తెగుళ్ల గురించి మండల వ్యవసాయ అధికారి డి.రూప దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా.. నివారణ చర్యల కోసం ఆమె పలు సూచనలు చేశారు. కత్తెర పురుగు దాడి విషయాన్ని ఇప్పటికే పలువురు రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ పురుగులు చాలా వేగంగా వ్యాప్తి చెంది, వరి వెన్నులను కొరికివేస్తాయన్నారు. కత్తెర పురుగులు పగటిపూట వరి దుబ్బుల మొదళ్లలో వుంచి, చీకటి పడిన తరువాత బయటకు వచ్చి వరి వెన్నులను కొరికివేస్తాయని ఆమె వివరించారు.

కత్తెర పురుగు నివారణకు ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ మందును లీటరు నీటిలో 0.5-1.0 గ్రాముల చొప్పున కలిపి ఎకరానికి 100 నుంచి 150 లీటర్ల వరకు మందు నీటిని పిచికారీ చేసుకోవాలన్నారు. లేకపోతే ప్రొఫెనోపాస్‌ మందును లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి 200 లీటర్ల మందునీటిని పిచికారీ చేయాలని సూచించారు.

సుడిదోమ నివారణకు పైమెట్రోజైన్‌ అనే మందును లీటరు నీటికి 0.6 గ్రాముల చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు నీటిని వరి దుబ్బు పైనుంచి మొదళ్ల వరకు తడిచేలా పిచికారీ చేయాలన్నారు. లేదంటే ధియోమిథాక్స్‌మ్‌ మందునైనా పిచికారీ చేసుకోవచ్చున్నారు. కత్తెర పురుగు, సుడిదోమ సాయంత్రం పూట దుబ్బుల నుంచి బయటకు వస్తాయని, ఈ సమయంలో మందులను పిచికారీ చేస్తే నియంత్రణ సాధ్యమవుతుందని మండల వ్యవసాయ అధికారి రూప వివరించారు.

Updated Date - Nov 18 , 2024 | 01:07 AM