క్రికెట్ స్టేడియంపైనా వైసీపీ పెద్దల కన్ను?
ABN, Publish Date - Jun 09 , 2024 | 12:44 AM
పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం స్థలం కొట్టేయాలని వైసీపీ పెద్దలు ప్లాన్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అందుకోసమే భోగాపురంలో 300 ఎకరాల్లో ప్రపంచస్థాయి స్టేడియం నిర్మిస్తామంటూ ప్రకటనలు
పీఎం పాలెం స్టేడియం భూమి వెనక్కి తీసుకునే ఆలోచన
24 ఎకరాలకు టెండర్...
ఓడిపోవడంతో బెడిసి కొట్టిన ప్రణాళిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం స్థలం కొట్టేయాలని వైసీపీ పెద్దలు ప్లాన్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ స్టేడియానికి సీఎం హోదాలో జగన్మోహన్‌రెడ్డి రెండుసార్లు వచ్చారు. జాతీయ రహదారిని ఆనుకుని...పరిపాలనా రాజధాని ఏర్పాటుచేయాలనుకున్న కోర్ ఏరియా రుషికొండకు సమీపాన ఉండడంతో పూర్వాపరాలపై ఆరా తీశారు. మొత్తం 24 ఎకరాల్లో విస్తరించిన ఉన్న స్టేడియం స్థలం ప్రభుత్వానిదేనని, విశాఖ జిల్లా క్రికెట్ సంఘానికి (వీడీసీఏ) లీజుకు ఇచ్చారని తేలింది. దాంతో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి, ఆ విలువైన భూమిని అస్మదీయులకు కట్టబెట్టాలని వ్యూహం రచించారు.
ట్రాఫిక్ ఇబ్బందులనే వంక
పీఎం పాలెం స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతోందని, జాతీయ రహదారి పక్కనే ఉండడంతో సమస్యలు వస్తున్నాయని ప్రచారం ప్రారంభించారు. పనిలో పనిగా ప్రస్తుత ఏసీఏ కార్యవర్గంతో ఆధునిక వసతులతో కూడిన భారీ స్టేడియం నిర్మాణానికి భూమి కేటాయించాలనే ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తరహాలో పెద్ద స్టేడియం నిర్మిస్తామని కార్యవర్గం చెబితే...‘ఫ్యూచర్ ఆఫ్ విశాఖ’ పేరుతో రాడీసన్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాటి సీఎం జగన్ మాట్లాడుతూ, ప్రపంచస్థాయి స్టేడియం 300 ఎకరాల్లో నిర్మిస్తామని ప్రకటించారు. దీనికి భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపాన స్థలం ఎంపిక చేసినట్టుగా ప్రచారం చేశారు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే భోగాపురం సమీపాన కొత్త స్టేడియం నిర్మించి, పీఎం పాలెం స్టేడియం భూమిని వెనక్కి తీసుకోవాలనేది ఆలోచనగా తెలిసింది.
కొన్నాళ్ల క్రితమే లీజు కాలం పొడిగింపు
పీఎం పాలెం క్రికెట్ స్టేడియం గురించి కార్యవర్గంలో పనిచేసిన వారిని సంప్రతించగా అది ప్రభుత్వ భూమేనని, తొలుత 30 ఏళ్ల లీజుకు వీడీసీఏకు ఇచ్చారని, ఆ గడువు ముగిసిపోవడంతో మళ్లీ దానిని ఇంకో 30 ఏళ్లకు పొడిగించారని తెలిపారు. భోగాపురం సమీపాన కొత్త స్టేడియం నిర్మిస్తే...ఇక ఇక్కడ స్టేడియం ఎందుకనే వంకతో లీజును రద్దు చేసి భూమిని వెనక్కి తీసుకునే అవకాశం లేకపోలేదని అనుమానం వ్యక్తంచేశారు. క్రికెట్ అభిమానులకు అన్యాయం జరగకుండా జనం ఆ పార్టీని ఓడించి మంచి పని చేశారని మరొకరు వ్యాఖ్యానించారు.
Updated Date - Jun 09 , 2024 | 12:44 AM