మహా మేత
ABN, Publish Date - Nov 14 , 2024 | 01:08 AM
జీవీఎంసీలో పనిచేస్తున్న తాత్కాలిక కార్మికులకు వేతనాల చెల్లింపులో వైసీపీకి చెందిన ఓ నేత చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులకు గతంలో మాదిరిగా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ (ఎస్‌ఎల్‌ఎఫ్) ద్వారా వేతనాలు చెల్లించాలని ఏడాది కిందట ప్రతిపాదన తీసుకొచ్చిన ఆయన...నాడు కౌన్సిల్‌లో మెజారిటీ ఉండడంతో అనుకూలమైన ఎస్‌ఎల్‌ఎఫ్‌లను ఎంపిక చేసి, వాటి ద్వారా వేతనాలు చెల్లించేలా చక్రం తిప్పారు. నాటి నుంచి కార్మికుల వేతనాల్లో సర్వీస్ చార్జీ కింద రెండు శాతం, ఆదాయ పన్ను కింద మరో రెండు శాతం మినహాయించుకుని ఆ మొత్తాన్ని వాటాలుగా పంచుకుని జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రావడంతో కొత్త ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
మలేరియా విభాగంలో తాత్కాలిక కార్మికులు: 406
ప్రజారోగ్య విభాగంలో తాత్కాలిక కార్మికులు: 790
ఒక్కో కార్మికుడికి రోజు కూలీ: రూ.450
నెలకు చెల్లించే మొత్తం: రూ.1,61,46,000
సర్వీస్ చార్జీ (2 శాతం) మినహాయింపు: రూ.3,22,920
ఐటీ మినహాయింపు (2 శాతం): రూ.3,22,920
తాత్కాలిక కార్మికుల వేతనాల్లో కోత
సర్వీస్ చార్జీ పేరిట రెండు శాతం,
ఆదాయ పన్ను కింద మరో రెండు శాతం
ఎస్‌ఎల్‌ఎఫ్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నందుకు వాత
ఎస్‌ఎల్‌ఎఫ్ ఎంపికలో చక్రం తిప్పిన వైసీపీ నేత
కార్మికుల జీతాల్లో మినహాయించుకున్న సొమ్ములో సగం ఆయన జేబులోకే?
అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కూటమి నేతల ఆరోపణ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీలో పనిచేస్తున్న తాత్కాలిక కార్మికులకు వేతనాల చెల్లింపులో వైసీపీకి చెందిన ఓ నేత చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులకు గతంలో మాదిరిగా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ (ఎస్‌ఎల్‌ఎఫ్) ద్వారా వేతనాలు చెల్లించాలని ఏడాది కిందట ప్రతిపాదన తీసుకొచ్చిన ఆయన...నాడు కౌన్సిల్‌లో మెజారిటీ ఉండడంతో అనుకూలమైన ఎస్‌ఎల్‌ఎఫ్‌లను ఎంపిక చేసి, వాటి ద్వారా వేతనాలు చెల్లించేలా చక్రం తిప్పారు. నాటి నుంచి కార్మికుల వేతనాల్లో సర్వీస్ చార్జీ కింద రెండు శాతం, ఆదాయ పన్ను కింద మరో రెండు శాతం మినహాయించుకుని ఆ మొత్తాన్ని వాటాలుగా పంచుకుని జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రావడంతో కొత్త ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
డెంగ్యూ, మలేరియా నియంత్రణకు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో పనిచేసే మలేరియా విభాగం ద్వారా ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తుంటారు. వర్షాకాలంలో దోమల సమస్య ఎక్కువ. సీజన్‌లో పనిచేసేందుకు (మూడు నెలలకు) మలేరియా విభాగం ద్వారా తాత్కాలిక కార్మికులను నియమిస్తారు. వీరిని జీవీఎంసీ నేరుగా నియమించుకుంటే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత పేరిట ఆందోళనలకు దిగుతారనే ఉంటుందనే ఉద్దేశంతో ప్రైవేటు కాంట్రాక్టర్ ద్వారా తీసుకుంటారు. రోజువారీ కూలీ లెక్కన చెల్లించేలా టెండరు పిలిచి, తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు కార్మికులను సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తున్నారు.
ఆదాయ వనరుగా మార్చుకున్న నేత
గత ఏడాది జూన్‌లో ఇలా 406 మంది కార్మికులను కాంట్రాక్టర్ ద్వారా జీవీఎంసీ తీసుకుంది. ఆగస్టులో ఒప్పందం పూర్తవడంతో మరో మూడు నెలలు వారి సేవలను పొడించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో జీవీఎంసీ పాలక వర్గంలో కీలక నేత, వైసీపీ నాయకుడు దానిని ఆదాయ వనరుగా మార్చుకోవాలని భావించి ఉన్నతాధికారుల వద్ద కొత్త ప్రతిపాదన పెట్టారు. మలేరియా తాత్కాలిక కార్మికులకు కాంట్రాక్టర్ ద్వారా సక్రమంగా వేతనాలు అందడం లేదని, అందువల్ల యూసీడీ పరిధిలో కొన్ని ఎస్‌ఎల్‌ఎఫ్‌లను ఎంపిక చేసి వాటి ద్వారా చెల్లించాలని సూచించారు. పాలక వర్గంలో కీలక నేత కావడంతో ఈ ప్రతిపాదనను అధికారులు ఆగమేఘాలపై అమలుచేశారు. యూసీడీ అధికారులు సదరు నేత సూచించిన ఎస్‌ఎల్‌ఎఫ్‌లను జోన్‌ల వారీగా ఎంపిక చేసి వారి ఖాతాల్లో కార్మికుల వేతనాలు జమ చేయడం ప్రారంభించారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక కార్మికులు 790 మందికి కూడా ఎస్‌ఎల్‌ఎఫ్‌ల ద్వారానే వేతనాలు చెల్లించేలా ఆ విభాగం అధికారులపైనా ఒత్తిడి చేశారు.
నెలకు రూ.3.23 లక్షలు మినహాయింపు
మలేరియా విభాగంలో 406 మంది, పారిశుధ్య విభాగంలో 790 మంది తాత్కాలిక కార్మికులకు రోజుకు రూ.450 చొప్పున జీవీఎంసీ చెల్లిస్తోంది. ఈ మొత్తం రూ.1,61,46,000 ఎస్‌ఎల్‌ఎఫ్‌ల ఖాతాలకు జమ చేస్తోంది. వేతనాలను చెల్లిస్తున్నందుకు గానూ ఎస్‌ఎల్‌ఎఫ్‌లు సర్వీస్ చార్జీ కింద రెండు శాతం మినహాయించుకుంటున్నాయి. అంటే నెలకు సుమారు రూ.3.23 లక్షలు. ఆ మొత్తాన్ని తమ పరిధిలోని మహిళా సంఘాలకు పంచాలి. ఇదికాకుండా కార్మికుల వేతనాలను జీవీఎంసీ నుంచి తీసుకుని కార్మికులకు అందజేసే క్రమంలో భారీగా లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి రెండు శాతం మొత్తాన్ని ఐటీ కింద మినహాయించారు. కార్మికులు ఐటీ రిటర్న్స్ లేదా ఐటీ శాఖ నుంచి ప్రత్యేక అనుమతితో ఆ మొత్తాన్ని తిరిగి పొందే వీలుంటుంది. సంబంధిత పత్రాన్ని ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు అందజేస్తే వారు ఐటీ శాఖకు పంపి, మినహాయించిన మొత్తాన్ని తిరిగి పొందడం ద్వారా కార్మికులకు ఇవ్వాలి. కానీ కార్మికులకు ఐటీ రిటర్న్స్‌పై అవగాహన ఉండదు కాబట్టి ఎస్‌ఎల్‌ఎఫ్‌లు తమ ఖాతాలోనే ఆ మొత్తాన్ని ఉంచుకుంటున్నాయి. సర్వీస్ చార్జీ కింద మినహాయిస్తున్న మొత్తంలో ఎస్‌ఎల్‌ఎఫ్‌ల అధ్యక్ష, కార్యదర్శులకు కొంత, మిగిలిన మొత్తాన్ని వైసీపీ నేత జేబులో వేసుకుంటున్నారని కూటమి కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. గత నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం లేవనెత్తడంతో సభలో వాదోపవాదాలు జరిగాయి. తాజాగా కొంతమంది స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడంతోపాటు కార్మికులకు వేతనాలు ఇస్తున్న ఎస్‌ఎల్‌ఎఫ్‌లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Nov 14 , 2024 | 01:08 AM