భారీగా పశువుల అక్రమ రవాణా
ABN, Publish Date - Nov 23 , 2024 | 12:52 AM
పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు కంటైనర్ లారీలను శుక్రవారం మండలంలోని అడ్డరోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఒకదానిలో 111 పశువులు ఉండగా వాటిల్లో 19 పశువులు చనిపోయాయి. మరో కంటైనర్‌లో 44 పశువులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్‌ఐ విభీషణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
అడ్డరోడ్డు వద్ద ఎస్.రాయవరం పోలీసులు నిఘా
రెండు కంటైనర్లలో తనిఖీలు
ఒక కంటైనర్‌లో 111, మరో దానిలో 44 పశువులు
కిక్కిరిసి ఎక్కించడంతో 19 పశువులు మృత్యువాత
ఎస్.రాయవరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు కంటైనర్ లారీలను శుక్రవారం మండలంలోని అడ్డరోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఒకదానిలో 111 పశువులు ఉండగా వాటిల్లో 19 పశువులు చనిపోయాయి. మరో కంటైనర్‌లో 44 పశువులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్‌ఐ విభీషణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్నట్టు ఎస్.రాయవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం అడ్డరోడ్డు వద్ద మాటు వేశారు. ఎలమంచిలి వైపు నుంచి వస్తున్న రెండు కంటైనర్ లారీలను ఆపి తనిఖీ చేశారు. ఒక కంటైనర్‌లో పశువులను కిక్కిరిసి రవాణా చేస్తున్నారు. పోలీసులు లెక్కించగా 111 పశువులు వున్నాయి. అయితే వీటిలో 19 పశువులు అప్పటికే మృతిచెందాయి. చనిపోయిన పశువులను కూడా రవాణా చేస్తున్నారా? లేకపోతే రవాణా చేస్తుండగా చనిపోయాయా? అన్నది విచారణలో నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు. కాగా మరో కంటైనర్‌లో 44 పశువులు ఉన్నాయి. సజీవంగా వున్న 136 పశువులను పెనుగొల్లులోని గో రక్షణ చారిటబుల్ ట్రస్టు వారికి అప్పగించారు. వీటిల్లో 49 ఆవులు వున్నాయి. కాగా మృతి చెందిన పశువులకు పోస్టుమార్టం అనంతరం పెనుగొల్లు సమీపంలో గొయ్యి తీయించి ఖననం చేశారు.
Updated Date - Nov 23 , 2024 | 12:52 AM