ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు ఆక్రమణ!

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:30 AM

పోతినమల్లయ్యపాలెంలో విజేత సూపర్‌ మార్కెట్‌ నుంచి సాంకేతిక ఇంజనీరింగ్‌ కళాశాలకు వెళ్లే మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు ఆక్రమణలతో బక్కచిక్కిపోయింది.

పీఎంపాలెంలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు

రెసిడెన్షియల్‌ పేరుతో ప్లాన్‌ తీసుకుని వాణిజ్య భవన సముదాయం నిర్మాణం

సెల్లార్‌లో దుకాణాలు.. అంతేగాకుండా రోడ్డు వైపు ఆరు అడుగుల మేర ఆక్రమించి షెడ్లు ఏర్పాటు

వాహనాల రాకపోకలకు అంతరాయం

చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పోతినమల్లయ్యపాలెంలో విజేత సూపర్‌ మార్కెట్‌ నుంచి సాంకేతిక ఇంజనీరింగ్‌ కళాశాలకు వెళ్లే మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు ఆక్రమణలతో బక్కచిక్కిపోయింది. రోడ్డును ఆక్రమించి మరీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, దుకాణాలు నిర్మించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ క్రమంలో తరచూ ప్రమాదాల చోటుచేసుకుంటున్నాయి. అయినా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులుగానీ, వీఎంఆర్‌డీఏ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు.

పీఎం పాలెం కార్‌షెడ్‌ జంక్షన్‌ నుంచి బక్కన్నపాలెం ఆఖరి బస్టాప్‌ వరకూ వీఎంఆర్‌డీఏ 80 అడుగులు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు ఉంది. ఆ రోడ్డులో ఉన్న విజేత సూపర్‌ మార్కెట్‌ నుంచి క్రికెట్‌ స్టేడియం వెనుక వైపు ఉన్న సాంకేతిక ఇంజనీరింగ్‌ కాలేజీ వరకూ 60 అడుగుల మాస్టర్‌ప్లాన్‌ రోడ్డును వీఎంఆర్‌డీఏ ఇటీవలే నిర్మించింది. రోడ్డు నిర్మాణం సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను కొంతమేర తొలగించారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించి, విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటుచేశారు. రోడ్డును భారీగా విస్తరించడంతో షాపులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో కొంతమంది రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీపై సిమెంట్‌ పలకలు వేసి, ర్యాంపులు నిర్మించి దుకాణాలు పెట్టేశారు. ఒకరైతే ఏకంగా నివాస భవనం నిర్మాణానికి జీవీఎంసీ నుంచి ప్లాన్‌ తీసుకుని ఏకంగా మూడంతస్థులు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేశారు. రోడ్డు ముందువైపు సెట్‌బ్యాక్‌ , పార్కింగ్‌ కోసం సెల్లార్‌ను విడిచిపెట్టాల్సి ఉన్నప్పటికీ డ్రైనేజీ వరకూ భవనం నిర్మించేశారు. సెల్లార్‌లో కూడా ఐదు దుకాణాలు ఏర్పాటుచేయడమే కాకుండా డ్రైనేజీపై సిమెంట్‌ పలకలు వేసి కప్పేశారు. రోడ్డును ఆరు అడుగులు వరకూ ఆక్రమించేసి దుకాణాల ముందు రేకులు షెడ్లు ఏర్పాటుచేశారు. అక్కడ వినియోగదారులంతా కూర్చునేలా టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటుచేశారు. ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని దుకాణాలకు వచ్చేవారంతా తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులోని ఒక లైన్‌ వాహనాలతో నిండిపోవడంతో రెండో లైన్‌లోనే వాహనాల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో అక్కడకు వచ్చేసరికి వాహన చోదకులు ఏమరుపాటుగా ఉంటే పక్కనే పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలను తగులుతుండడంతో తరచూ గొడవలు అవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఎందుచేతనో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మరోవైపు కొత్తగా నిర్మించిన రోడ్డును ఆక్రమించినా, రోడ్డు అలైన్‌మెంట్‌ను దెబ్బతీసేలా వ్యవహరించినా వీఎంఆర్‌డీఏ అధికారులు సైతం పట్టించుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంంది. ఇప్పటికైనా జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులు మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో ఆక్రమణలను తొలగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:30 AM