తాండవలో ఎండుతున్న వరి
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:51 AM
తాండవలో ఎండుతున్న వరి
ఆయకట్టు చివరి భూములకు అందని నీరు
కాలువల్లో పేరుకుపోయిన పూడిక, నాచు
తుప్పు పట్టి పాడైన రెగ్యులేటింగ్ గేట్లు
రెండేళ్ల నుంచి పట్టించుకోని అధికారులు
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
నాతవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): తాండవ రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఆయకట్టు చివరి భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంది. వరి పైరు వెన్ను, గింజ కట్టే దశలో నీరు లేకపోవడంతో వడ్ల గింజలు పొల్లుగా మారతాయని రైతులు వాపోతున్నారు. ప్రధాన కాలువల్లో రెండేళ్ల నుంచి పూడికలు తీయకపోవడం, పిల్ల కాలువల రెగ్యులేటర్ల గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో తమ భూములకు నీరు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండవ జలాశయం కింద అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 52 వేల ఎకరాల ఆయకట్టు వుంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఆశాజనకంగా వున్నాయి. పంట కాలువలకు సకాలంలో నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరాలో వరిసాగు చేపట్టారు. ఇదిలావుండగా గత ఐదేళ్ల నుంచి ప్రధాన కాలువల గేట్ల నిర్వహణను ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. కాలువల్లో రెండే పూడిక తీయలేదు, తుప్పలు/నాచు తొలగించలేదు. పిల్ల కాలువలకు ఏర్పాటు చేసిన తలుపులు తుప్పుపట్టి పాడైపోయాయి. దీంతో పల్లంగా వున్న పొలాలకు నీటి అవసరం తీరిన తరువాత గేట్లు దించే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా నిరంతరం నీరు వృథాగా పోతూ, మెరక భూములకు నీరు అందడంలేదు. కుడి కాలువ చివరనున్న కేఈ చిన్నయ్యపాలెం, రామకృష్ణాపురం గంగవరం, తిమ్మరాజుపేట తదితర గ్రామాల్లో వరి పొలాలకు నీరు అందక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాదాపు నెల రోజుల క్రితం వరకు వర్షాలు పడుతుండడంతో నీటి ఎద్దడి ఏర్పడలేదు. తరువాత నుంచి వర్షాలు లేకపోవడంతో ఆయకట్టుకు నీటి వినియోగం పెరిగింది. దీంతో చివరి భూములకు నీరు రాని పరిస్థితి నెలకొంది.
నాలుగో వంతుకు తగ్గిన లష్కర్లు
తాండవ ఆయకట్టు పరిధిలో కాలువల పర్యవేక్షణ కోసం గతం 40 మంది వరకు లష్కర్లు వుండేవారు. వీరు నిరంతరం కాలువలను పరిశీలిస్తూ.. నీరు ఎక్కడ అవసరమో అక్కడ తలుపులు తెరచి నీటి విడుదల చేసి, అవసరం లేనిచోట తలుపులు మూసివేసేవారు. కానీ ప్రస్తుతం 10 మంది మాత్రమే లష్కర్లు వున్నారు. దీంతో కాలువలపై పర్యవేక్షణ తగ్గిపోయింది. కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీయించాలని ఖరీఫ్ మొదలవడానికి రెండు నెలల ముందే అధికారులను కోరినప్పటికీ పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వరిపంట ప్రస్తుతం పొట్టదశకు వచ్చిందని, ఇటువంటి తరుణంలో నీటి ఎద్దడి ఏర్పడితే తీవ్రంగా నష్టపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీరందక వరి ఎండిపోతోంది
ఈగల లోవ రైతు, రాజవరం
నేను మూడు ఎకరాల్లో వరిపంట వేశాను. కుడి కాలువలో మూడేళ్ల నుంచి పూడిక తీయలేదు. దీంతోపాటు నాచు కూడా విపరీతంగా పెరిగిపోయి నీటి ప్రవాహం మందగించింది. దీనివల్ల చివరి భూములకు నీరు అందడం లేదు. ప్రస్తుతం పొట్టదశలో ఉన్న వరిపంటకు నీరు అందక నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లిప్తత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.
తాండవకు రూ.2.1 కోట్లు మంజూరు
అనురాధ, డీఈఈ, తాండవ ప్రాజెక్టు
తాండవ రిజర్వాయర్‌కు ప్రభుత్వం రూ.2.1 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తుండడంతో నిర్వహణ, మరమ్మతు పనులు చేయడం సాధ్యం కాదు. జనవరిలో తాండవ మెయిన్‌గేట్లకు మరమ్మత్తులు, ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడిక, నాచును తొలగిస్తాం. కుడి కాలువపై గుమ్మిడిగొండ, రొంగల కొత్తూరు వద్ద, ఎడమ కాలువ 1.5 కిలోమీటరు వద్ద అక్విడక్టులకు మరమ్మతులు చేయిస్తాం.
Updated Date - Nov 20 , 2024 | 12:51 AM