ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరాయి పంచన ప్రభుత్వ కార్యాలయాలు

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:06 AM

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో చాలీచాలని గదుల్లో, అసౌకర్యాల నడుమ అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

నర్సీపట్నంలో అద్దె భవనంలో ఎక్సైజ్‌ కార్యాలయం

ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో నిర్వహణ

సరైన సౌకర్యాలు లేక అధికారులు, ఉద్యోగుల ఇబ్బందులు

అద్దెల రూపంలో రూ.లక్షలు ప్రభుత్వానికి వ్యయం

నర్సీపట్నం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో చాలీచాలని గదుల్లో, అసౌకర్యాల నడుమ అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

నర్సీపట్నంలో ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం, ఎక్సైజ్‌ కార్యాలయం, డివిజనల్‌ గృహ నిర్మాణ శాఖ కార్యాలయం, గనులు, భూగర్భ శాఖ, తూనికలు కొలతలు శాఖ డివిజనల్‌ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే ఉంటున్నాయి. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని బ్యాంక్‌ కాలనీలోని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆర్టీవో, ఇద్దరు బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు, ఒకరు అసిస్టెంట్‌ బ్రేక్‌ ఇన్‌స్పెక్టరు పని చేస్తున్నారు. కార్యాలయంలో అధికారులకు, సిబ్బందికి సరిపడా గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్లకు వచ్చే వాహనాలు రోడ్డు మీద, ప్రైవేటు స్థలాల్లో పార్కింగ్‌ చేస్తున్నారు. కేసులు రాసి సీజ్‌ చేసిన వాహనాలను ఆర్టీసీ డిపోలో ఉంచుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వచ్చేవారి డ్రైవింగ్‌ సామర్థ్ధ్యం పరీక్షించడానికి సరిపడా స్థలం లేదు. సొంత భవనం నిర్మించుకోవడానికి ఐదు ఎకరాల స్థలం అవసరమని అధికారులు అంటున్నారు.

ఎక్సైజ్‌ కార్యాలయంలో ఎన్నో ఇబ్బందులు

ఎక్సైజ్‌ కార్యాలయాన్ని నర్సీపట్నం- చింతపల్లి రోడ్డులోని ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ సీఐ, ఎస్‌ఐతో పాటు సిబ్బంది పని చేయడానికి సరిపడా స్థలం లేదు. వరండాలో రెండు కంప్యూటర్లు పెట్టుకొని ఆఫీసు పని చేసుకుంటున్నారు. గంజాయి, నాటు సారా కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలు ఉంచడానికి జాగా లేక మెయిన్‌ రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్‌ చేశారు. కార్యాలయం ఆవరణ, పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో కార్లు, ఆటోలు, లారీలు గుట్టగుట్టలుగా పేర్చి పెట్టారు. నర్సీపట్నం సీనియర్‌ సివిల్‌ జడ్జి షియాజ్‌ఖాన్‌ రోడ్డుపై పార్కింగ్‌ చేసిన వాహనాలను వెంటనే తీయించాలని ఎక్సైజ్‌ అధికారులకు లిఖిత పూర్వంగా ఆదేశాలు జారీ చేశారు. వీటిని ఎక్కడికి తరలించాలో అర్థంకాని పరిస్థితి ఉంది.

డివిజనల్‌ గృహ నిర్మాణ శాఖ కార్యాలయం

డివిజనల్‌ గృహ నిర్మాణ శాఖ కార్యాలయాన్ని పెదబొడ్డేపల్లి వంతెన సమీపంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈఈ, డీఈ, సిబ్బంది పని చేయడానికి సరిపడా గదులు లేవు. డివిజన్‌ స్థాయిలో ఏఈలతో సమావేశం నిర్వహిద్దామంటే హాలు లేదు. అధికారుల కార్లు, సిబ్బంది బైక్‌లు పెట్టుకోవడానికి స్థలం లేక బయట పార్కింగ్‌ చేసుకుంటున్నారు.

గనుల శాఖదీ అదే పరిస్థితి

పెదబొడ్డేపల్లి- చోడవరం రోడ్డులో డివిజనల్‌ గనులు, భూగర్భ శాఖ, తూనికలు కొలతలు శాఖ కార్యాలయాలను అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఏడీ, ఏజీ, సూపరింటెండెంట్‌, సిబ్బందికి సరిపడా గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కూడా అధికారుల కార్లు, సిబ్బంది బైక్‌లు పెట్టుకోవడానికి స్థలం లేక రోడ్డు మీద పార్కింగ్‌ చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కార్యాలయాలను నిర్వహించడం వల్ల అద్దెల రూపంలో లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులు ప్రతి ఏటా ఖర్చవుతున్నాయి. అలా కాకుండా ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, ఎంపీడీవో కార్యాలయాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను ఈ భవనాలకు కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:06 AM