నైపుణ్య గణనకు సన్నాహాలు
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:46 AM
సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు నైపుణ్య గణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
స్కిల్ సెన్సెస్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
ఇప్పటికే సచివాలయ సిబ్బందికి శిక్షణ పూర్తి
డేటా సేకరణపై పూర్తిస్థాయిలో అవగాహన
ఈ నెల మూడో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం
ఎవరికి వారే తమ వివరాలు అప్‌లోడ్ చేసుకునేందుకు చాన్స్
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):
సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు నైపుణ్య గణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. స్కిల్ సెన్సెస్ కోసం అవసరమైన శిక్షణను ఇప్పటికే అధికారులు పూర్తిచేశారు. నగర పరిధిలోని జోన్లు, గ్రామీణ ప్రాంతంలోని మండలాల నుంచి ఎంపిక చేసిన 30 మంది సచివాలయ సిబ్బందికి, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖకు చెందిన మరో 22 మందికి గడిచిన నెలలో మాస్టర్ ట్రైనర్స్‌గా విజయవాడ నుంచి వచ్చిన ఉన్నతాధికారి శిక్షణ ఇచ్చారు. ఈ మాస్టర్ ట్రైనర్స్ ఈ నెల 4, 5, 6 తేదీల్లో జిల్లాలోని 4,529 మంది సచివాలయ సిబ్బందికి మండల, జోనల్ కార్యాలయాల్లో నైపుణ్య గణనకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తికావడంతో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఈ నెల మూడో వారం నుంచి నైపుణ్య గణనను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
రెండు విధాలుగా డేటా సేకరణ
నైపుణ్య గణన రెండు రకాలుగా జరుగుతుంది. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది సంబంధిత సమాచారం సేకరిస్తారు. అదేవిధంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్...అంటే ఎవరికి వారే తమ వివరాలను ఇవ్వడం. ఈ గణనలో భాగంగా 15 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించనున్నారు. ఇంటింటికీ వెళ్లనున్న సచివాలయ సిబ్బంది...15-59 ఏళ్ల మధ్య ఉన్న వారి ఆధార్‌లో ఉన్న వివరాలు (డెమోగ్రాఫిక్ ప్రొఫైల్), ఆ తరువాత విద్యార్హతలు, నైపుణ్య సమాచారం తీసుకుంటారు. ప్రస్తుత స్థితి అంటే ఉద్యోగం చేస్తున్నారా?, ఇతర పనులు చేస్తున్నారా..? వంటి విషయాలు తెలుసుకుంటారు. వాటిని సిబ్బందికి ప్రత్యేకంగా అందించిన ‘నైపుణ్య’ అనే యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఇది ఇంటింటికీ వచ్చి సిబ్బంది చేపట్టే నైపుణ్య గణన. ఇక, రెండోది ఎవరికి వార్లే నైపుణ్య గణనకు సంబంధించిన వివరాలను అందించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగాలు చేసేవాళ్లు నైపుణ్య అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వారికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో సేకరించిన వివరాలను విశ్లేషించిన తరువాత ప్రభుత్వం కేటగిరీల వారీగా విభజించి అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. నైపుణ్యాలను కల్పించిన తరువాత ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.
వేగంగా పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం
- టి.చాముండేశ్వరరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి
నైపుణ్య గణనను వీలైనంత వేగంగా పూర్తిచేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే సిబ్బందికి శిక్షణను పూర్తిచేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లాలో సెన్సెస్‌ను ప్రారంభిస్తాం. వివరాలు సేకరణ, యాప్‌లో అప్‌లోడ్ చేయడం వంటి అంశాలు గురించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన సిబ్బందికి శిక్షణ అందించాం. మాస్టర్ ట్రైనర్స్‌గా డిజిటల్ అసిస్టెంట్స్‌కు శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నైపుణ్య గణనను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
Updated Date - Nov 13 , 2024 | 12:46 AM