వైసీపీ నేతలకు రామవరం లేఅవుట్!?
ABN , Publish Date - Mar 30 , 2024 | 01:17 AM
విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)ను అధికార పార్టీ తన ఇష్టానుసారం ఉపయోగించుకుంటుంది. చెప్పిన పనులు చేసిపెట్టేందుకు అనుకూలమైన ఐఏఎస్ అధికారిని అక్కడ సీట్లో కూర్చోబెట్టింది.
మధ్య తరగతి కోసం స్మార్ట్ టౌన్‌షిప్స్ పేరుతో వీఎంఆర్‌డీఏ హడావుడి
దరఖాస్తుల స్వీకరణ
బాగా డిమాండ్ ఉన్న ఆనందపురం మండలం రామవరం లేఅవుట్‌లో ప్లాట్లను ఎవరికీ విక్రయించవద్దని అధికార పార్టీ పెద్దల పైనుంచి ఆదేశాలు
మళ్లీ గెలిస్తే బాగా సొమ్ము చేసుకోవచ్చుననే యోచన
అమ్మకాలు నిలిపివేసిన అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)ను అధికార పార్టీ తన ఇష్టానుసారం ఉపయోగించుకుంటుంది. చెప్పిన పనులు చేసిపెట్టేందుకు అనుకూలమైన ఐఏఎస్ అధికారిని అక్కడ సీట్లో కూర్చోబెట్టింది. అప్పటి నుంచి అక్కడ వైసీపీ ఏమి అనుకుంటే అదే జరుగుతోంది. తాజాగా వంద ఎకరాల లేఅవుట్‌ను చేజిక్కించుకునేందుకు వైసీపీ పెద్దలు వ్యూహం రూపొందిస్తే...దానిని ఇక్కడి అధికారి తు.చ. తప్పకుండా అమలు చేసి పెట్టారు. ఇదంతా మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారం పేరుతో చేయడం గమనార్హం.
ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వం 2021 మార్చి నెలలో ఒక పథకం ప్రకటించింది. ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల ఆదాయం ఉన్న వారికి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ఆహ్వానించింది. విశాఖపట్నంలో 1.4 లక్షల దరఖాస్తులు రావడంతో లేఅవుట్లు వేస్తామంటూ ల్యాండ్ పూలింగ్‌కు శ్రీకారం చుట్టారు. గతంలో ల్యాండ్ పూలింగ్ విధానం వివాదాస్పదం కావడంతో ఈసారి ఆ బాధ్యతను రెవెన్యూకు అప్పగించారు. నగర శివారునున్న ఆనందపురం మండలంలోని జీఎస్ అగ్రహారం, రామవరం, పాలవలస గ్రామాల్లో 363 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములు సమీకరించారు. వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 150, 200, 240 గజాలతో లేఅవుట్ వేశారు. ఇలా పాలవలస, రామవరం, గంగసాని అగ్రహారాల్లో నాలుగు లేఅవుట్లలో 2,310 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. పాలవలసలో గజం రూ.18 వేలు నిర్ణయించారు. రామవరం, గంగసాని అగ్రహారం లేఅవుట్లలో గజం రూ.14 వేలు ధర పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంఐజీలో 20 శాతం రాయితీ ఇస్తామన్నారు. ప్లాట్ల సంఖ్యలో 10 శాతం రిజర్వేషన్ కూడా ప్రకటించారు.
రామవరం ఆకట్టుకోవడంతో నిలిచిన అమ్మకాలు
రామవరంలో వేసిన లేఅవుట్ జాతీయ రహదారికి సమీపాన రాకపోకలకు అనుకూలంగా ఉండడం, పరిసరాలు కూడా త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడంతో వైసీపీ పెద్దల కన్ను పడింది. ఈ లేఅవుట్‌లో ప్లాట్లను అమ్మవద్దని, భవిష్యత్తు అవసరాల పేరుతో పక్కన పెట్టాలని ఆదేశించారు. చెప్పిందే తడవుగా ఆ లేఅవుట్‌లో అమ్మకాలు నిలిపివేశారు. అన్ని లేఅవుట్లను ఒకేసారి అభివృద్ధి చేయడం కష్టమని, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తామని కొత్త పల్లవి అందుకొని ముందుగా పాలవలసలో ప్లాట్లు కేటాయిస్తామంటూ అక్కడి నుంచి అమ్మకాలు ప్రారంభించారు. రామవరానికి పెద్దగా డిమాండ్ లేదని, తక్కువ దరఖాస్తులు వచ్చాయని చెప్పి ఆ లేఅవుట్‌ను వైసీపీ పెద్దల కోసం పక్కన పెట్టేశారు.
రామవరం లేఅవుట్ కోసం 75 మంది రైతుల నుంచి సర్వే నంబర్లు 141 నుంచి 154 వరకు మొత్తం 119.22 ఎకరాలు సేకరించారు. 240 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 222, 200 గజాల విస్తీర్ణం కలిగినవి 160, 150 గజాల విస్తీర్ణంతో 381 ప్లాట్లు వేశారు. ఇవి కాకుండా అంతకంటే చిన్న పరిణామం కలిగిన ప్లాట్లు మరో 106 వేశారు. మొత్తం 869 ప్లాట్లతో రూపొందించిన లేఅవుట్‌లో అమ్మకాలు ఆపేసి వైసీపీ పెద్దల కోసం రిజర్వు చేసేశారు. మొత్తం నాలుగు లేఅవుట్లలో 2,310 ప్లాట్లు కాగా అందులో అత్యధికం 869 రామవరంలోనే ఉండడం గమనార్హం.
నత్తనడకన పనులు
లేఅవుట్లను అన్నిరకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని ప్రకటించిన వీఎంఆర్‌డీఏ అధికారులు ఆ పనులు ఏవీ చేయడం లేదు. అలా చేస్తే వాటికి డిమాండ్ పెరిగి కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తారని కావాలనే జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే ముందుకువచ్చిన వారి నుంచి డబ్బులు వసూలుచేసి వాటితోనే నామమాత్రపు పనులు చేస్తున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే...విశాఖను రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తుందని, అప్పుడు భూముల విలువ మరింత పెరుగుతుందని, అప్పుడు ఈ రామవరం లేఅవుట్‌ను ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఆ పార్టీ పెద్దలు మొత్తం రిజర్వు చేసుకున్నారని వీఎంఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అక్కడ అమ్మకాలు నిలిపివేశారని స్పష్టంచేశాయి.