భూ కబ్జా యత్నాలకు రెవెన్యూ బ్రేకులు
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:52 PM
మండంలోని బాటజంగాలపాలెంలో ఆరు వరుసల జాతీయ రహదారికి సమీపంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు.
బాటజంగాలపాలెంలో 5.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
పలు రకాల మొక్కలు నాటిన కబ్జాదారులు
అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదుతో స్పందించిన అధికారులు
ఆక్రమణదారులపై కేసు నమోదు చేయాలని ఆర్డీవో ఆదేశం
సబ్బవరం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండంలోని బాటజంగాలపాలెంలో ఆరు వరుసల జాతీయ రహదారికి సమీపంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. భూమిలో నాటిని మొక్కలను పీకివేశారు. స్థానిక తహసీల్దార్ బి.చిన్నికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బాటజంగాలపాలెంలో 185 సర్వే నంబరులో ఖాళీగా వున్న 5.37 ఎకరాల వాగు పోరంబోకు/ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. రెండు, మూడు రోజుల క్రితం ఈ భూమిని చదును చేసి కొబ్బరి, యూకలిప్టస్, గంధం మొక్కలు నాటారు. దీనిపై ఒక అజ్ఞాన వక్తి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, మండల సర్వేయర్ ఎల్.అప్పారావు, ఆర్‌ఐ వీరయ్య సోమవారం సర్వే నంబరు 185లో వున్న ప్రభుత్వ భూమిని సందర్శించారు. సర్వే చేయించిన అధికారులు.. గెడ్డవాగు భూమిని ఆక్రమించి, మొక్కలు నాటినట్టు గుర్తించారు. అనంతరం మొక్కలను తొలగించారు. కొద్దిసేపటి తరువాత అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయేషా ఇక్కడకు వచ్చి భూమిని పరిశీలించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడిన వారిని గుర్తించి భూ కబ్జా చట్టం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
Updated Date - Nov 18 , 2024 | 11:52 PM