ప్రధాని రాకతో రోడ్లకు మెరుగులు
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:26 AM
పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఈ నెల 29వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక్కడకు రానుండడంతో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రధాన రహదారి మరమ్మతులకు ఏపీఐఐసీ అధికారులు నడుం బిగించారు.
ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనకు 29వ తేదీన మోదీ రాక
సెజ్ ప్రధాన రహదారికి అత్యవసరంగా మరమ్మతులు
అచ్యుతాపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):
పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఈ నెల 29వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక్కడకు రానుండడంతో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రధాన రహదారి మరమ్మతులకు ఏపీఐఐసీ అధికారులు నడుం బిగించారు. రోడ్డు ఎగుడుదిగుడుగా వున్నచోట ఎక్స్‌కవేటర్లతో తవ్వేసి, కొత్త లేయర్ వేయనున్నారు.
అచ్యుతాపురం జంక్షన్ నుంచి పూడిమడక వరకు ఏపీఐఐసీ గతంలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మించింది. కర్మాగారాలకు వచ్చే భారీ వాహనాలతోపాటు కార్మికులు, ఉద్యోగులను తీసుకువచ్చే వందలాది బస్సులు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఎస్‌ఈజడ్ ముఖ ద్వారం వద్ద నుంచి రోడ్డు బాగా పాడైపోయింది. ఏపీఐఐసీ కార్యాలయం ముందు భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇంకా ఏషియన్ పెయింట్స్ కర్మాగారం నుంచి పూడిమడక వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు, బ్రాండిక్స్ వద్ద రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో అన్ని రకాల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పూడిమడక సమీపంలో ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి ఈ నెల 29వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ఏపీఐఐసీ అధికారులు నాలుగు లేన్ల రహదారికి మరమ్మతు పనులు చేపట్టారు. రహదారిని బాగు చేస్తుండడంతో వాహనదాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 19 , 2024 | 01:26 AM