అధ్వాన రోడ్లకు మోక్షం
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:50 AM
జిల్లాలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణంతో చేపట్టి, వైపీపీ హయాంలో నిలిచిపోయిన రహదారుల అభివృద్ధి పనులను పూర్తిచేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దీంతో అసంపూర్తిగా, అధ్వానంగా వున్న రహదారులకు మోక్షం కలగనున్నది.. వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు తొలగనున్నాయి.
ఎన్‌డీబీ రుణంతో చేపట్టిన పనుల్లో కదలిక
పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో రూ.220.62 కోట్లలో పది రోడ్లకు ఐదున్నరేళ్ల క్రితం ఎన్‌డీబీ రుణం
రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన
ఐదేళ్లపాట్లు నిధులు ఇవ్వని దుస్థితి
గోతుల రోడ్లపై ప్రయాణంతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు
తాజాగా ఎన్‌డీబీ నుంచి రుణం విడుదలకు లైన్ క్లియర్
త్వరలో రహదారుల అభివృద్ధి పనులు పునఃప్రారంభం
తొలగనున్న ప్రయాణికుల కష్టాలు
చోడవరం, అక్టోబరు20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణంతో చేపట్టి, వైపీపీ హయాంలో నిలిచిపోయిన రహదారుల అభివృద్ధి పనులను పూర్తిచేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దీంతో అసంపూర్తిగా, అధ్వానంగా వున్న రహదారులకు మోక్షం కలగనున్నది.. వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు తొలగనున్నాయి.
రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి ఎన్‌డీబీ పెద్ద మొత్తంలో రుణం మంజూరు చేయడానికి ఐదున్నరేళ్ల క్రితం ముందుకు వచ్చింది. మొత్తం వ్యయంలో 70 శాతం సొమ్మును ఏడీబీ రుణంగా ఇస్తుంది. మిగిలిన 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ కింద బ్యాంకుకు చెల్లించాలి. అభివృద్ధి చేసే వాటిలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పది రహదారులు వున్నాయి. 2019 ఫిబ్రవరిలో ఏడీబీ రుణం మంజూరు చేసింది. తరువాత టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. పనులు ప్రారంభించే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. రహదారుల నిర్మాణ పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసింది. ఎట్టకేలకు 2003లో రిటెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. కాంట్రాక్టర్లు కొంత మేర పనులు చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ 30 శాతం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఎన్‌డీబీ నుంచి రుణం మంజూరు ఆగిపోయింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయాయి. అప్పటికే విపరీతమైన జాప్యం కారణంగా తీవ్రంగా పాడైన రహదారులు.. అభివృద్ధి అభివృద్ధి పనులు ఆగిపోవడంతో మరింత దయనీయంగా తయారయ్యాయి. ఏడీబీ రుణంతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమని నాటి వైసీపీ ప్రజాప్రతినిధులు... పార్టీ అధిష్ఠానానికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల్లో వైసీపీ అఽభ్యర్థులు ఘోరంగా ఓటమిపాలయ్యారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్‌డీబీ ప్రాజెక్టు కింద చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడానికి కార్యాచరణను ప్రారంభించింది. 30 శాతం మార్జిన్ మనీ కింద రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు తొలుత రూ.113 కోట్లు విడుదల చేయడంతోపాటు, గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసినట్టు సమాచారం. ఎన్‌డీబీ నుంచి రుణం సొమ్ము విడుదలతోపాటు, కాంట్రాక్టర్లు తిరిగి పనులు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రహదారుల అభివృద్ధి పనులు కొద్ది రోజుల్లోనే పునఃప్రారంభం అవుతాయని సంబంధిత అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 10 రోడ్లు.. పూర్తయ్యింది ఒక్కటే!
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.220.62 కోట్ల అంచనా వ్యయంతో పది రోడ్ల అభివృద్ధికి గతంలో టెండర్లు నిర్వహించారు. వీటిలో కొన్ని పనులు ప్రారంభించారు. అరకులోయ నియోజకవర్గంలోని పెదబయలు-ముంచంగిపుట్టు రోడ్డులో రూ.11.71కోట్లతో చేపట్టిన 4.97 కిలోమీటర్ల రోడ్డు పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినచోట్ల పనులు చేపట్టిన మేరకు కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో నిలిపివేశారు. మైదాన ప్రాంతంలో అనకాపల్లి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది రోడ్ల పనులు అసంపూర్తిగా వున్నాయి.
అనకాపల్లి నియోజకవర్గంలో బవులువాడ నుంచి చోడవరం మండలం వెంకన్నపాలెం వరకు రూ.12.33 కోట్లతో 4.95 కిలోమీటర్లు, వెంకన్నపాలెం నుంచి బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వరకు రూ.31.45 కోట్లతో 11.13 కిలోమీటర్లు, వడ్దాది నుంచి నర్సీపట్నం మండలం చెట్టుపల్లి వరకు రూ.79.81 కోట్లతో 28.6 కిలోమీటర్లు, బుచ్చెయ్యపేట మండలం వడ్డాది నుంచి మాడుగుల నియోజకవర్గం మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గరికబంధ వరకు రూ.23.59 కోట్లతో 12.7 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తిచేయవలసి ఉంది. నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం నుంచి నీలంపేట వరకు రూ.2.57 కోట్లతో ఒక కిలోమీటరు రోడ్డు, పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్ల మండలం ఇందేశమ్మ ఘాట్ నుంచి ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు (పెదగుమ్ములూరు) వరకు రూ.20.78 కోట్లతో 7.86 కిలోమీటర్లు, పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం నుంచి పినగాడి రూట్‌లో రూ.13.92 కోట్లతో 7.13 కిలోమీటర్లమేర్లు, విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పద్మనాభం- శొంఠ్యాం (నీళ్ల కుండీల జంక్షన్) మధ్య రూ.10.04 కోట్లతో 3.55 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాల్సి వుంది.
ఐదేళ్ల నరకయాతనకు త్వరలో విముక్తి
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టిన రోడ్ల పనులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దారుణమైన రహదారులతో ప్రజలు ఐదేళ్ల నుంచి ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ప్రత్యేకించి చోడవరం నియోజకవర్గంలో వెంకన్నపాలెం నుంచి రోలుగుంట మండలం శివారు వరకు. మాడుగుల నియోజకవర్గంలో వడ్డాది నుంచి పాడేరు మండలం గరికబంధ వరకు, కోటవురట్ల మండలం ఇందేశమ్మ ఘాట్ రోడ్డు భారీ గోతులతో అత్యంత దారుణంగా తయారయ్యాయి. వాహనాలు పాడైపోవడం, ప్రయాణం సమయం పెరిగిపోవడం, భారీ గోతుల్లో వాహనాలు కూరుకుపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా నాటి వైసీపీ పాలకులు కనీసం స్పందించలేదు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయి కూటమి అధికారంలోకి రావడం, ఎన్‌డీబీ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులకు పెండింగ్ నిధులు విడుదల చేయడంతోపాటు, పనులు పునఃప్రారంభానికి చర్యలు చేపట్టడంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Updated Date - Oct 21 , 2024 | 12:50 AM