ఫోర్బ్స్ మెచ్చిన తారా మండల్
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:38 AM
విశాఖకు చెందిన స్టార్టప్ సంస్థ తారామండల్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
అంతర్జాతీయ బిజినెస్ సామర్థ్యం కలిగిన సార్టప్‌గా గుర్తింపు
ప్రపంచవ్యాప్తంగా 30 వేలకుపైగా నామినేషన్లు
టాప్-200 కంపెనీల్లో ఒకటిగా నిలిచిన తారా మండల్
ఏపీ నుంచి గుర్తింపు పొందిన తొలి శాటిలైట్ స్టార్టప్
ఫౌండర్స్‌లో వెల్లివిరిసిన ఆనందం
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
విశాఖకు చెందిన స్టార్టప్ సంస్థ తారామండల్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. స్పేస్‌లో ఉండే శాటిలైట్ వ్యర్థాలను భూమిపైకి తీసుకురావడంతో పాటు సుస్థిరమైన శాటిలైట్స్ టెక్నాలజీపై పనిచేయడంయడం, అంతర్జాతీయంగా బిజినెస్ సామర్థ్యం కలిగిన, రానున్న రోజుల్లో వృద్ధిలోకి వచ్చే కంపెనీ (స్టార్టప్)గా ఫోర్బ్స్ ఇండియా, డి గ్లోబలిస్ట్ సంస్థ తారా మండల్‌ను గుర్తించాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న స్టార్టప్ కంపెనీల పనితీరును పరిశీలించి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కంపెనీస్ విత్ గ్లోబల్ పొటెన్షియల్ పేరుతో 200 కంపెనీలతో కూడిన జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో విశాఖకు చెందిన తారా మండల్ అనే సార్టప్ చోటు దక్కించుకుంది. ఏపీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక స్టార్టప్ కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి 30 వేలకుపైగా కంపెనీలు, స్టార్టప్‌ల నుంచి నామినేషన్లు స్వీకరించిన ఫోర్బ్స్ ఇండియా, డి గ్లోబలిస్ట్ సంస్థలు ఆరు నెలలుగా అనేక అంశాలను పరిశీలించాయి. ప్రధానంగా కంపెనీ సామర్థ్యం, పేటెంట్స్, గ్రోత్, భవిష్యత్తులో సదరు సంస్థ అవసరం వంటి అనేక అంశాలను పరిశీలించి అంతర్జాతీయంగా ఎదిగే సామర్థ్యం ఉన్న కంపెనీగా తారా మండల్‌ను ఎంపిక చేశాయి. ఇండియా నుంచి ఈ జాబితాలో 70 కంపెనీలు/ స్టార్టప్‌లు మాత్రమే చోటు దక్కించుకోగా, మిగిలిన దేశాల నుంచి 130కుపైగా కంపెనీలున్నాయి.
ఎందుకు పనిచేస్తుందంటే...
స్పేస్‌లో ఉండే శాటిలైట్ వ్యర్థాలను భూమిపైకి తీసుకురావడంతోపాటు సుస్థిర మైన శాటిలైట్స్ టెక్నాలజీపై ఈ స్టార్టప్ పనిచేస్తుంది. సాధారణంగా స్పేస్‌లోకి వెళ్లే శాటిలైట్లు కొన్నాళ్ల (పీరియడ్) తరువాత వ్యర్థాలుగా కక్ష్యలో తిరుగుతుంటాయి. ఈ వ్యర్థాలను భూమిపైకి తీసుకురావడంతో పాటు కొత్తగా పంపించే శాటిలైట్స్ కాల పరిమితి తరువాత తిరిగి భూమిపైకి వచ్చే శాటిలైట్ టెక్నాలజీపై ఈ సంస్థ పనిచేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో శాటిలైట్ వ్యర్థాలు స్పేస్‌లో పెరగకుండా, ప్రమాదాలు సంభవించకుండా కాపాడే అవకాశం ఉంటుంది. ఈ స్టార్టప్ సంస్థ పనితీరు, భవిష్యత్తులో గొప్పగా ఎదిగేందుకు ఉన్న అంశాలను పరిశీలించిన ఫోర్బ్స్ ఇండియా టాప్-200 కంపెనీలో ఎంపిక చేసింది.
ఫౌండర్స్ వీరే...
ఈ స్టార్టప్‌ను 2023లో ఎ.వినీల్ జడ్సన్, డాక్టర్ డి.రాజేష్, ఎన్.రమాజయలక్ష్మి, డాక్టర్ ఎం.గౌతమ్, డాక్టర్ టి.నీలకంఠేశ్వరరెడ్డి ఏర్పాటు చేయగా, కొన్నాళ్లుగా స్టార్టప్‌కు ఏయూ ప్రొఫెసర్ పి.మల్లికార్జునరావు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్ గుర్తింపుతో కంపెనీకి అంతర్జాతీయంగా పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ గుర్తింపు పట్ల ఫౌండర్స్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 18 , 2024 | 12:38 AM