రైల్వే జోన్‌పై తాత్సారం!
ABN, Publish Date - Sep 12 , 2024 | 01:16 AM
విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ప్రకటించి మూడేళ్లు దాటిపోయింది. సరైన భూమి ఇవ్వలేదని వంకలు పెడుతూ కేంద్రం పనులు ప్రారంభించడం లేదు. జీవీఎంసీ ముడసర్లోవలో 52 ఎకరాల భూమిని చాలాకాలం క్రితమే కేటాయించింది.
ముడసర్లోవలో భూములు కేటాయించినా ప్రారంభంకాని పనులు
అవి వాటర్ బాడీస్ అంటూ వంక
‘వాటర్ వర్క్స్’కు చెందిన భూములే తప్ప
వాటర్ బాడీస్ కాదని స్పష్టత ఇచ్చిన జీవీఎంసీ
అక్కడ జోనల్ కార్యాలయం నిర్మాణానికి అంగీకారం తెలిపిన రైల్వే అధికారులు
ఈలోగా ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయాల్లా
మరోచోట కార్యకలాపాలు ప్రారంభించలేరా?
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ప్రకటించి మూడేళ్లు దాటిపోయింది. సరైన భూమి ఇవ్వలేదని వంకలు పెడుతూ కేంద్రం పనులు ప్రారంభించడం లేదు. జీవీఎంసీ ముడసర్లోవలో 52 ఎకరాల భూమిని చాలాకాలం క్రితమే కేటాయించింది. అందులో ఆక్రమణదారులు ఉన్నారని, వారు రానివ్వడం లేదని రైల్వే అధికారులు చెబితే...జీవీఎంసీ అఽధికారులు వారిని ఖాళీ చేయించారు. ఆ తరువాత ఆ భూములన్నీ నిర్మాణానికి అనుకూలంగా లేవని, అందులో సగం వాటర్ క్యాచ్‌మెంట్ ఏరియా పరిధిలో ఉన్నాయని, అటువంటి చోట నిర్మాణాలు చేపట్టలేమని, ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని రైల్వే అధికారులు కోరారు. అయితే జీవీఎంసీ అధికారులు దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. ముడసర్లోవలో రైల్వేకు కేటాయించిన భూముల్లో 90 శాతం నిర్మాణానికి అనుకూలమైనవని వివరించినట్టు సమాచారం. అవి జీవీఎంసీ ‘వాటర్ వర్క్స్’కు చెందిన భూములే తప్ప వాటర్ బాడీస్ కాదని స్పష్టంచేసినట్టు ఓ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దాంతో రైల్వే అధికారులు ఆ భూములు తీసుకోవడానికి అంగీకరించినట్టు, అక్కడే రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
నాన్పుడు ధోరణి
తూర్పు కోస్తా జోన్ నుంచి వాల్తేరు డివిజన్‌ను, విశాఖపట్నాన్ని విడదీయడం భువనేశ్వర్‌లోని రైల్వే ఉన్నతాధికారులకు ఇష్టం లేదు. దానివల్ల ఆదాయం తగ్గిపోతుందనేది వారి ఆలోచన. రైల్వే శాఖా మంత్రి కూడా ఒడిశాకు చెందినవారే కావడంతో అక్కడి అధికారులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించారు. విశాఖపట్నంలో ఐఐఎం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. వీటికి కూడా వందల ఎకరాల భూములు కేటాయించారు. వాటిలో నిర్మాణాలు చేపట్టి, అవి పూర్తయ్యాక కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఆలస్యం అవుతుందని ముందుగా అద్దెకు అవసరమైన భవనాలు తీసుకొని వాటిలో తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఐఐఎంను 2015లోనే ఏయూలో ఏర్పాటుచేసి 2022లో గంభీరంలో నిర్మించిన క్యాంపస్‌లోకి తరలించారు. అంటే దాదాపుగా ఏడేళ్లు అద్దె భవనంలో తరగతులు నిర్వహించారు. ఇక గిరిజన విశ్వవిద్యాలయాన్ని తీసుకుంటే దానికి కూడా 500కు పైగా ఎకరాలు కేటాయించారు. ముందు రెల్లిలో ఆ తరువాత మెంటాడలో భూములు కేటాయించారు. నిర్మాణాలు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం పడుతుందని ట్రాన్సిట్ క్యాంపస్‌ని దత్తిరాజేరు సమీపాన చినమేడపల్లిలో ప్రారంభించి తరగతులు నిర్వహిస్తున్నారు.
ఇక ఏపీ మెడ్‌టెక్ జోన్‌ను అగనంపూడిలో ప్రారంభించక ముందు రుషికొండ ఐటీ పార్కులోని సింబయోసిస్ క్యాంపస్‌లో రెండేళ్లు నడిపారు. అగనంపూడిలో భవనాలు పూర్తయ్యాక అక్కడికి మార్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటికి శాశ్వత భవనాల నిర్మాణం ఆలస్యం అవుతుందని తాత్కాలికంగా అద్దె భవనంలో కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు రైల్వే జోన్‌కు ఆ విధానం ఎందుకు అనుసరించడం లేదనేది పెద్ద ప్రశ్న?
వేయి మందికి సరిపడా భవనాలు లేవా?
రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటుచేస్తే 1,000 నుంచి 1,200 మంది పనిచేయడానికి అవసరమైన భవనాలు కావాలి. ఒక జనరల్ మేనేజర్, పది మంది వరకు ప్రిన్సిపల్ హెచ్‌ఓడీలు, వారి కింద 250 మంది అధికారులు, ఇంకో వేయి మంది సిబ్బంది వరకూ జోనల్ కార్యాలయంలో పనిచేస్తారు. వీరందరినీ ఒకేసారి నియమించే అవకాశం లేదు. దశల వారీగా సిబ్బందిని కేటాయిస్తారు. తొలుత 500 మందికి సరిపడా భవనం అద్దెకు తీసుకుంటే సరిపోతుంది. ఈలోగా శాశ్వత భవన నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవచ్చు. ఈ దిశగా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విశాఖ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంత ఎంపీలు కూడా ఈ విషయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, తక్షణమే జోనల్ కార్యాలయం ఏర్పాటయ్యేలా చూడాల్సి ఉంది. అప్పుడే ఈ ప్రాంత ప్రజల కల సాకారమవుతుంది.
Updated Date - Sep 12 , 2024 | 07:42 AM