బడ్డీల తొలగింపులో ఉద్రిక్తత
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:18 AM
జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది శనివారం 22వ వార్డులో తోపుడుబండ్లు, బడ్డీల తొలగింపు సందర్భంగా ఓవరాక్షన్ చేశారు.
వందలాది మంది జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు రాక
క్రేన్‌లతో తోపుడుబండ్లు, బడ్డీలు ధ్వంసం
చిరు వ్యాపారుల ఆగ్రహం
కార్పొరేటర్ మూర్తియాదవ్ ఇంటి ముట్టడికి విఫలయత్నం
మద్దిలపాలెం, నవంబరు 16:
జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది శనివారం 22వ వార్డులో తోపుడుబండ్లు, బడ్డీల తొలగింపు సందర్భంగా ఓవరాక్షన్ చేశారు. పెద్ద పెద్ద క్రేన్లు, ట్రాలర్ లారీలు, జేసీబీలు, టిప్పర్‌లతో భీతావహ వాతావరణం సృష్టించారు. రోడ్డుపక్క దుకాణాలను తొలగించడానికి శనివారం ఉదయం ఐదు గంటలకే టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, పోలీసులు సుమారు 300 మంది శివాజీపాలెం చేరుకున్నారు. పిఠాపురం కాలనీ రోడ్డు నుంచి ప్రారంభించి శివాజీ పార్కు రోడ్డు వరకూ ఎక్కడా చిన్న బడ్డీ మిగలకుండా క్రేన్‌లతో తీసిపారేశారు. తోపుడుబండ్లు, చెక్క బడ్డీలు మళ్లీ వినియోగించకుండా ధ్వంసం చేశారు. కొంతమంది బడ్డీలనైతే జేసీబీల బకెట్‌లో కొట్టి పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ బడ్డీల తొలగింపునకు జీవీఎంసీ అధికారులు వంద మంది కూలీలను తీసుకుని రావడం విశేషం. వారంతా బడ్డీలు ధ్వంసం చేస్తుంటే అక్కడకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు తాళ్లతో రక్షణ వలయం తయారుచేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగించి సుమారు 300 దుకాణాలను తొలగించారు. దీంతో వార్డులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిరు వర్తకులు ఆగ్రహంతో తొలగింపును అడ్డుకోవడానికి యత్నించారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అవే తమకు బతుకుదెరువని, బడ్డీలు తీయొద్దని మొరపెట్టుకున్నారు. అయితే వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి హైకోర్టులో కేసు వేశారని, ఆక్రమణలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చిందని అందుకే తొలగిస్తున్నామని జీవీఎంసీ అధికారులు సమాధానమిచ్చారు. దీంతో బాధితులు పెద్దఎత్తున మూర్తియాదవ్ ఇంటిని ముట్టడించడానికి ర్యాలీగా బయలుదేరారు. వారంతా మూర్తి యాదవ్ ఇంటి వద్దకు చేరుకోగా అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఇంటిని ముట్టడిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో మూర్తియాదవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు బాధితులు వార్డు అంతా ర్యాలీ నిర్వహించారు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
22వ వార్డులో స్ర్టీట్ వెండర్స్ యాక్ట్‌కు విరుద్ధంగా రోడ్డు మార్జిన్ దాటి జరిగిన ఆక్రమణలపై జీవీఎంసీ చర్యలు తీసుకోవడం లేదని కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన పిల్ మేరకు హైకోర్టు జీవీఎంసీకి నోటీసులు జారీచేసింది. హైకోర్టు నోటీసులకు జీవీఎంసీ అధికారులు కౌంటర్ దాఖాలు చేయలేదు. దీంతో స్ర్టీట్ వెండర్స్ యాక్ట్‌కు లోబడి రోడ్డు మార్జిన్ దాటిన ఆక్రమణలు మాత్రమే తొలగించాలని మే 10న హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే నగరంలో స్ర్టీట్ వెండర్స్ యాక్ట్ అమలులోనే లేదు. ఈ యాక్ట్ ప్రకారం వీధి వ్యాపారులకు హాకర్స్ జోన్ ఏర్పాటుచేయాలి. రోడ్డు వెడల్పు ఆధారంగా తెలుపు సున్నంతో మార్జిన్ గీతలు గీసి అందులోనే వ్యాపారాలు చేసుకోవలసిందిగా సూచించాలి. జీవీఎంసీ వీఽదివ్యాపారులకు గుర్తింపు కార్డులిచ్చి వ్యాపార రక్షణ కల్పించాలి. ఇవేమీ 22వ వార్డులో అమలులో లేకపోయినా మార్జిన్ దాటిన ఆక్రమణలు మాత్రమే తొలగించాలని హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి మరీ మొత్తం శివాజీపాలెం, పిఠాపురం కాలనీ, పీతలవానిపాలెంలో ఎక్కడా ఒక్క దుకాణం లేకుండా పూర్తిగా తొలగించారు.
Updated Date - Nov 17 , 2024 | 01:18 AM