స్టీల్‌ప్లాంట్, గంగవరం పోర్టు సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN, Publish Date - Apr 16 , 2024 | 07:41 PM
ఉక్కు కర్మాగారం పరిరక్షణ, గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు, నిర్వాసితులకు న్యాయం చేయడమే తన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. 86వ వార్డు పరిధి కూర్మన్నపాలెంలో సోమవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు.
టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్
కూర్మన్నపాలెం, ఏప్రిల్ 16: ఉక్కు కర్మాగారం పరిరక్షణ, గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు, నిర్వాసితులకు న్యాయం చేయడమే తన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. 86వ వార్డు పరిధి కూర్మన్నపాలెంలో సోమవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. గాజువాకలో చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌పై గులకరాయితో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తే అది రాష్ట్రానికి కష్టమని, గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరితే అదంతా ఉత్తిదేనని వైసీపీ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అరాచక పాలన గురించి ప్రజలందరికీ తెలుసునని, అయినా ఆ పార్టీ నాయకులు దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోతుండడం బాధాకరంగా ఉందన్నారుజ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ ఒక్కసారి కూడా కేంద్రంపై ఒత్తిడి తేలేదని, గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఒక్కసారి కూడా ‘ఉక్కు’ అంశంపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. డబ్బు, కులం, రౌడీయిజం, అబద్దాలతోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని శ్రీభరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా గంగవరం పోర్టు కార్మికులు కుటుంబాలతో సహా ఆందోళనలు చేస్తుంటే.. గాజువాక వైసీపీ అభ్యర్థి ఏసీ గదిలో ప్రెస్‌మీట్ పెట్టి వారి సమస్యలను మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికే గంగవరం పోర్టులో ఉన్న పది శాతం వాటాను వైసీపీ ప్రభుత్వం విక్రయించేసిందని విమర్శించారు. మరోసారి ఆ పొరపాటు పనిని ఆంధ్రులు చేయరని, విశాఖ వాసులు అసలే చేయరన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా కూటమి అభ్యర్థులదే అంతిమ విజయమన్నారు.
టీడీపీ గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్‌రెడ్డి హఠావో-ఆంధ్ర ప్రదేశ్ బచావో నినాదంతో వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. స్మార్ట్ సిటీగా పేరొందిన విశాఖ నగరాన్ని గంజాయికి, మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని విమర్శించారు. గాజువాకలో దీర్ఘకాలికంగా ఉన్న భూసమస్య, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, టోల్‌గేటు, గంగవరం పోర్టు కార్మికులు, మత్సకారుల సమస్య, ఏపీఐఐపీ భూములు పరిరక్షణ, తదితర సమస్యలను తాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కాగా ఈ పాదయాత్ర కూర్మన్నపాలెం, శాతవాహన నగర్, శ్రీకృష్ణానగర్, ముస్తఫా సెంటర్, వుడా నగర్ కాలనీలలో సాగింది. ఇంటింటికీ వెళ్లి శ్రీభరత్, పల్లా శ్రీనివాసరావు, తదితర నాయకులు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించడంతో పాటు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ 86వ వార్డు ఇన్‌చార్జి నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బొండా జగన్, కరణంరెడ్డి నరసింగరావు, గడసాల అప్పారావు, కాదా శ్రీను, ఎస్.కనకరాజు, లంకల మురళీదేవి, ఎం.కనకరాజు, వి.శ్రీనివాస్, కె.లెనిన్‌బాబు, ఎ.దీప్తి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 16 , 2024 | 07:41 PM