భూములు దోచేస్తున్న దుష్ట చతుష్టయం
ABN, Publish Date - May 04 , 2024 | 01:56 AM
‘దుష్టచతుష్టయం...జగన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు ఉత్తరాంధ్రలో భూములు దోచేశారు.
జగన్, బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలపై తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ధ్వజం
జగన్ ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి...జనాన్ని పాతాళంలోకి నెట్టారు
మూడు రాజధానులంటూ నాటకమాడి ఒక్కటి కూడా లేకుండా చేశారు
గులకరాయి డ్రామాలతో మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నం
ఈ ప్రాంత ప్రజలు ఎంతో సౌమ్యులు, విజ్ఞులు....ఆలోచించి ఓటేయాలి
జగన్‌ను ఇంటికి పంపించేందుకు సిద్ధం కావాలని పిలుపు
రాష్ట్రం గాడినపడాలంటే చంద్రబాబు సీఎం కావాలి
కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు
విశాఖపట్నం/కంచరపాలెం, మే 3 (ఆంధ్రజ్యోతి):
‘దుష్టచతుష్టయం...జగన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు ఉత్తరాంధ్రలో భూములు దోచేశారు. విశాఖలో విలువైన బే పార్క్, సీబీసీఎన్‌సీ భూములను కబ్జా చేశారు.’ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం నగర పరిధిలో పలు ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. అనంతరం కంచరపాలెం మెట్టు వద్ద నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి బాలకృష్ణ ప్రసంగించారు. బొత్స, ధర్మాన, తమ్మినేని, అవంతి, అమర్ వంటి నేతల వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వైసీపీ పాలకులు ప్రశాంతంగా ఉండే విశాఖ నగరాన్ని గంజాయి వనంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను పాతాళంలోకి నెట్టాడన్నారు. ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాడన్నారు. కోడికత్తి, బాబాయ్ గొడ్డలి, గులకరాయి డ్రామాలతో ప్రజలను మభ్యేపెట్టే యత్నాన్ని జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నాడన్నారు. మూడు రాజధానులంటూ నాటకాలాడిన జగన్..చివరికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రశ్నించే గొంతుకలను నొక్కడం, ఎదురుతిరిగిన వారిపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. జగన్‌ను ఇంటికి పంపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం గాడిన పడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావడం తప్పనిసరన్నారు. లోటు బడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధిలో పరుగులు పెట్టించారని, తలసరి ఆదాయం పెరిగేలా చేశారన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొందరు నేతలు యత్నిస్తున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
మేనిఫెస్టోతో ప్రజల జీవితాల్లో వెలుగులు..
తెలుగుదేశం పార్టీ అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటే పార్టీ అని బాలకృష్ణ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేవిధంగా మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. గురజాడ, శ్రీశ్రీ వంటి ప్రముఖులు పుట్టిన పుణ్యనేల, కళలకు కాణాచీ ఈ ప్రాంతమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో సౌమ్యులు, విజ్ఞులు అని, ఆలోచించి ఓటేయాలన్నారు.
ఎంవీవీ, కేకే రాజుపై విమర్శలు..
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాష్ట్ర అభివృద్ధి, విశాఖకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో చర్చించిన దాఖలాలు లేవని, తప్పుడు పత్రాలతో సీబీసీఎన్‌సీ భూములు కొట్టేసే ప్రయత్నం చేశారని బాలకృష్ణ విమర్శించారు. ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు గూండాయిజం, అరాచకాలు మితిమీరుతున్నాయని, భూ కబ్జాలు చేస్తాడన్నారు. అతని గురించిన తెలిసిన ప్రజలు అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో తేల్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు (తూర్పు), గణబాబు (పశ్చిమ), విష్ణుకుమార్‌రాజు (ఉత్తరం) పాల్గొన్నారు. సభలో బాలకృష్ణ తనదైన శైలిలో డైలాగ్‌లు, మేనరిజంతో అభిమానులను అలరించారు. విశాఖలో అత్యధికంగా సినిమాలు షూటింగ్ చేశానని, తాను ఇక్కడ షూటింగ్ చేసినన్ని సినిమాలు మరే హీరో చేయలేదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు వస్తే తనలోని నెత్తురు మరుగుతుందన్న మాటలకు సభకు హాజరైన ప్రజలు హర్షధ్వానాలు చేశారు.
బాలయ్యకు బ్రహ్మరథం
అడుగడుగునా నీరాజనం పలికిన అభిమానులు, కార్యకర్తలు
దారివెంబడి గజమాలలతో స్వాగతం
పెదజాలరి పేట నుంచి ఆరిలోవ చివరి బస్టాప్ వరకూ రోడ్ షో
కంచరపాలెం మెట్టులో సభ అనంతరం తిరిగి గోపాలపట్నం జంక్షన్ వరకూ...
విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):
ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పెదజాలరిపేట వద్ద నుంచి రోడ్ షో ప్రారంభించారు. బాలకృష్ణకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఓపెన్ టాప్ జీపుపై నిలబడి బాలకృష్ణ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. పెదజాలరిపేట నుంచి లాసన్స్ బే కాలనీ మీదుగా ఎంవీపీ కాలనీ, సమతా కాలేజీ జంక్షన్, వెంకోజీపాలెం జంక్షన్, హనుమంతువాక, డెయిరీ ఫామ్ జంక్షన్, రవీంద్రనగర్ జంక్షన్, తోటగరువు, బాలాజీనగర్, ఆరిలోవ పోలీస్ జంక్షన్ మీదుగా ఆరిలోవ కాలనీ చివరి బస్టాప్ వరకు రోడ్ షో సాగింది. దారివెంబడి అశేష జనసందోహం, అభిమానులు ఆయనకు గజమాలలతో స్వాగతం పలికారు. ప్రతి జంక్షన్ వద్ద వందలాది మంది ఎదురువచ్చి స్వాగతం పలికారు. జై బాలయ్య...జైజై బాలయ్య నినాదాలతో రోడ్‌షో సాగిన ప్రాంతాలు మార్మోగాయి. బాలయ్యను చూసేందుకు పెద్దఎత్తున మహిళలు, యువత ఆయా జంక్షన్లు, కూడళ్ల వద్ద బారులుతీరారు. బాలయ్యపై పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనేకచోట్ల అభిమానంతో చంటి పిల్లలను బాలకృష్ణకు ఇవ్వగా..వారిని ఆప్యాయంగా తీసుకుని ముద్దుపెట్టి ఆశీర్వచనాలు అందిస్తూ ముందుకుసాగారు. ఆరిలోవ చివరి బస్టాప్ వద్ద రోడ్ షో ముగించిన బాలకృష్ణ అక్కడి నుంచి నేరుగా కంచరపాలెం మెట్టు వద్ద ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభ అనంతరం కంచరపాలెం మెట్టు నుంచి ఎన్‌ఏడీ మీదుగా గోపాలపట్నం జంక్షన్ వరకూ రోడ్ షో సాగింది. అక్కడి నుంచి ఎస్.కోట నియోజకవర్గ పరిధిలోని కొత్తవలసలో నిర్వహించిన సభలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. రోడ్ షోలో బాలకృష్ణ వెంట కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు. రోడ్ షోలో భాగంగా ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి బాలకృష్ణ తనదైన శైలిలో చేసిన పలు విన్యాసాలు అభిమానులను అలరించాయి. మైక్ పైకి విసిరి పట్టుకోవడం, కళ్లద్దాలను తనదైన శైలిలో పైకి విసిరి జేబులో పడేలా చేయడం వంటివన్నీ చూసిన అభిమానులు పులకించిపోయారు. జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు.
Updated Date - May 04 , 2024 | 01:56 AM