పంచ గ్రామాల భూ సమస్యకు పరిష్కారం?
ABN, Publish Date - Sep 12 , 2024 | 01:15 AM
వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో ముడివడిన పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచ గ్రామాల్లో అన్యాక్రాంతమైన భూములకు ప్రత్యామ్నాయంగా సింహాచలం దేవస్థానానికి సుమారు 426 ఎకరాల బదలాయింపునకు చర్యలు తీసుకుంటోంది.
దేవస్థానానికి సుమారు 426 ఎకరాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం
ములగాడ, ఆనందపురం మండలాల్లో భూములు పరిశీలన
ఎన్నికల హామీ నెరేవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
సింహాచలం, సెప్టెంబరు 11:
వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో ముడివడిన పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచ గ్రామాల్లో అన్యాక్రాంతమైన భూములకు ప్రత్యామ్నాయంగా సింహాచలం దేవస్థానానికి సుమారు 426 ఎకరాల బదలాయింపునకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బుధవారం ఆనందపురం మండలంతో పాటు గాజువాక సమీపాన గల ములగాడలోని సర్వే నంబరు 35లో భూములను పరిశీలించింది. త్రిసభ్య కమిటీలో దేవస్థానం ఈఓ, రెవెన్యూకు చెందిన ఆర్‌జేసీ కూడా ఉన్నారు. దేవస్థానం భూముల్లో గల 12,149 ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు, అందుకు ప్రత్యామ్నాయంగా సుమారు 426 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తొలుత దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఈనెల ఒకటో తేదీన సింహాచలం దేవస్థానం ఈఓతో కలిసి ప్రత్యామ్నాయంగా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన ములగాడ భూములను పరిశీలించినట్టు తెలుస్తోంది. బుధవారం మరోమారు భూములు పరిశీలించిన బృందం త్వరలో జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నది. ఇదిలావుండగా పంచగ్రామాల భూ సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు/అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం అధికారులు ముందుకువెళుతున్నారు.
Updated Date - Sep 12 , 2024 | 08:03 AM