రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యం
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:23 PM
మన్యంలో మ్యాక్స్ ద్వారా రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యంగా నిర్దేశించామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో పార్చిమెంట్ ఉత్పత్తి
మ్యాక్స్ ద్వారా ఆదివాసీ రైతులకు గరిష్ఠ ధరలు
ఈ ఏడాది కిలో కాఫీ పండ్లకు రూ.44
జీసీసీ ద్వారా పార్చిమెంట్ కిలోకి రూ.285
పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్
చింతపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మన్యంలో మ్యాక్స్ ద్వారా రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యంగా నిర్దేశించామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద కాఫీ పండ్ల పల్పింగ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ కాఫీ రైతులకు మ్యాక్స్ ద్వారా గరిష్ఠ ధరలు అందిస్తామన్నారు. గత ఏడాది ఏజెన్సీ పదకొండు మండలాల్లో 4,300 మంది రైతుల నుంచి 836 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను సేకరించామన్నారు. ఆదివాసీల నుంచి సేకరించిన కాఫీ పండ్లు కిలో తొలి విడతగా రూ.43 ధర చెల్లించామని చెప్పారు. మార్కెటింగ్ అనంతరం వచ్చిన లాభాల నుంచి కిలోకి అదనంగా బోనస్ రూపంలో రూ.మూడు అందజేశామన్నారు. ఈ ఏడాది మ్యాక్స్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన కాఫీ ఉత్పత్తి చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. గిరిజన రైతుల నుంచి నాణ్యమైన పండ్లను సేకరించి పార్చిమెంట్ తయారు చేస్తామన్నారు. ఈ ఏడాది ఏజెన్సీ పదకొండు మండలాల్లో కాఫీ పండ్ల సేకరణకు 6,500 మంది రైతుల నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లు సేకరించాలని మండలాల వారీగా అధికారులకు లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు. ఈ ఏడాది రైతులకు మ్యాక్స్ ద్వారా కిలో పండ్లకు రూ.44 ధర చెల్లిస్తామని, కాఫీ గింజలు విక్రయించి వచ్చిన లాభాల నుంచి బోనస్ అందజేస్తామన్నారు. గిరిజన సహకార సంస్థ కిలో కాఫీ పార్చిమెంట్‌ను రూ.285 ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. గిరిజన రైతులు కాఫీ పండ్లను రూ.44, పార్చిమెంట్ రూ.285 కంటే తక్కువగా మార్కెట్‌లో విక్రయించుకోరాదని సూచించారు. రైతులు మ్యాక్స్, జీసీసీ కల్పిస్తున్న మార్కెటింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజన సహకార సంస్థ 2500 మంది రైతులకు ఎన్‌పీవోపీ ఆర్గానిక్ ధ్రువీకరణ పత్రాలు అందజేసిందన్నారు. ఈ రైతుల నుంచి ప్రత్యేకంగా కాఫీ గింజలను సేకరించి మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గిరిజన రైతులు పండించిన కాఫీ గింజలను జీసీసీ బ్రాండ్‌పై మార్కెటింగ్ చేసేందుకు టాటా కంపెనీ ముందుకొచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో కాఫీ పంట ద్వారా ఆదివాసీ రైతులు అధిక లాభాలు పొందేందుకు అవసరమైన ప్రణాళికను ఐటీడీఏ సిద్ధం చేస్తుందని, అరకు కాఫీ మార్కెటింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి మోదీ నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు.
ఎకో పల్పింగ్ యూనిట్ల నిర్మాణానికి రూ.7 కోట్లు నిధులు
జీకేవీధి, జి.మాడుగులలో నిర్మాణ దశలో ఉన్న ఎకో పల్పింగ్ యూనిట్లను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.7 కోట్ల నిధులను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపిందని ఐటీడీఏ పీవో తెలిపారు. ఈ నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి జీకేవీధి, జి.మాడుగుల కాఫీ పల్పింగ్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాక్స్ అధ్యక్షుడు సెగ్గె కొండలరావు, కాఫీ ప్రాజెక్టు ఏడీ ఎన్. అశోక్, కాఫీ బోర్డు జేఎల్‌వో ప్రదీప్‌కుమార్, హెచ్‌వో అరుణ కుమారి పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 11:23 PM