వినాయక పందిళ్లకు అనుమతులపై గందరగోళం
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:08 AM
వినాయక చవితి పందిళ్లకు అనుమతుల వ్యవహారం గందరగోళంగా మారింది. అనుమతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సింగిల్‌విండో కౌంటర్ మంగళవారం సాయంత్రం ఎత్తివేశారు. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో పలువురు ఆ దిశగా (గణేష్ ఉత్సవ్ వెబ్‌సైట్) యత్నించారు. అయితే వెబ్‌సైట్ గంటలకొద్దీ మొరాయించింది.
కలెక్టరేట్‌లో సింగిల్ విండో కౌంటర్ ఎత్తివేత
ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచన
వారం రోజుల కిందట దరఖాస్తులనే
క్లియర్ చేయలేదనే విమర్శలు
విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
వినాయక చవితి పందిళ్లకు అనుమతుల వ్యవహారం గందరగోళంగా మారింది. అనుమతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సింగిల్‌విండో కౌంటర్ మంగళవారం సాయంత్రం ఎత్తివేశారు. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో పలువురు ఆ దిశగా (గణేష్ ఉత్సవ్ వెబ్‌సైట్) యత్నించారు. అయితే వెబ్‌సైట్ గంటలకొద్దీ మొరాయించింది. దీంతో కొందరు సమీపంలోని పోలీస్ స్టేషన్లకు వెళ్లి వివరాలు అడుగుతున్నారు. అయితే వారం కిందట ఆన్‌లైన్‌లో పెట్టుకున్న దరఖాస్తులనే ఇప్పటివరకూ క్లియర్ చెయ్యలేదు. సింగిల్ విండో ద్వారా వచ్చిన 111 దరఖాస్తులను పోలీసులకు అందజేశామని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల ఏడో తేదీనే వినాయక చవితి. అంటే కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తుదారులకు ఇంత స్వల్ప వ్యవధిలో జీవీఎంసీ, ఈపీడీసీఎల్, రోడ్లు, భవనాల శాఖ, పోలీసులు అనుమలులు ఇవ్వడం సాధ్యమేనా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు పోర్టల్ ఏర్పాటు
వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటుచేసే పందిళ్లకు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు ‘హెచ్‌టీటీపీ://గణేష్‌ఉత్సవ్.నెట్’ పేరిట ప్రత్యేకించి ఒక పోర్టల్‌ను రూపొందించారు. తొలుత కలెక్టరేట్‌లో సెల్ ఏర్పాటుచేసి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల ఒకటో తేదీన ప్రారంభించిన ఈ కౌంటర్‌కు మొత్తం 111 దరఖాస్తులు రాగా వాటిని నగర పోలీస్ కమిషనరేట్‌కు పంపారు. ప్రాంతాల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్లే అనుమతులు మంజూరు చేస్తాయని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకునే విధానం మంగళవారంతో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ బుధవారం ప్రారంభించారు. మండపానికి అనుమతి కోసం ప్రత్యేకించి రూపొందించిన వెబ్‌సైట్‌కు వెళ్లి తొలుత రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత పలు విభాగాల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవడంతోపాటు మీ-సేవలో ఈపీడీసీఎల్, జీవీఎంసీ ఫైర్ విభాగాలకు రూ.500 వంతున చెల్లిస్తూ చలానా తీసుకోవాలి. ఇంకా పందిళ్లలో ప్రతిష్ఠించే బొమ్మ ఎత్తు బట్టి...అంటే ఎనిమిది అడుగుల వరకూ రూ.700, 8.1 అడుగుల నుంచి 15 అడుగుల వరకు రూ.1000, 15.1 అడుగుల నుంచి 30 అడుగుల వరకూ అయితే రూ.1400 చలానాను మీ-సేవా కేంద్రంలో చెల్లించాలి. వీటిని ఆయా విభాగాలకు వెళ్లి సమర్పించి ఎన్‌వోసీ పొందాలి. ఇంకా రోడ్లు, భవనాల శాఖ, సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎన్‌వోసీ తీసుకోవాలి. అన్నీ ఎన్‌వోసీలను ఆన్‌లైన్‌లో నమోదుచేసిన రిజిస్ట్రేషన్ ఫారానికి జత చేసి నగర పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సెల్‌లో అందజేయాలి. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే దరఖాస్తును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపిస్తారు. అక్కడ అనుమతి మంజూరుచేస్తూ మండపం ఏర్పాటుకు సర్టిఫికెట్ ఇస్తారు. దీనిపై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. మండపం కొనసాగించే రోజుల్లో ఎవరైనా తనిఖీ చేసినప్పుడు ఆ సర్టిఫికెట్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్‌పై స్కాన్ చేస్తే సరిపోతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Updated Date - Sep 05 , 2024 | 01:08 AM