చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:29 AM
రెండు జిల్లాల్లో చోరీ కేసులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. బుధవారం ఆమె ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
17 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ దీపిక
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 11 : రెండు జిల్లాల్లో చోరీ కేసులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. బుధవారం ఆమె ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని పలుచోట్ల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పరవాడ, అనకాపల్లి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి సుమారు రూ.12 లక్షలు పైబడి విలువ చేసే 17 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. విశాఖ నగరంలోని రెల్లివీధికి చెందిన వడ్డాది పోలరాజు, నగర పరిధిలోని చేపలుప్పాడ గ్రామానికి చెందిన చినమన యల్లాజీలను అరెస్టు చేశామన్నారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధి సాలాపువానిపాలెంలో గత నెల 27వ తేదీన వంటాకు ఎరుకునాయుడు ఇంట్లో చోరీ జరిగిందన్నారు. ఈ ఘటనలో ఏడు తులాలకు పైగా బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయన్నారు. ఈ మేరకు పరవాడ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పరవాడ డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి క్లూస్ టీమ్ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టామన్నారు. పైన పేర్కొన్న పోలరాజు, యల్లాజీలను ఈ కేసులో నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్టు చెప్పారు. అలాగే, అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీవోఎస్ కాలనీ, విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్, వీటీ అగ్రహారంలలో కూడా నిందితులు చోరీలకు పాల్పడ్డారని వివరించారు. ఈ నేరాలకు సంబంధించి కొంత సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు చెప్పిన ఆధారంగా ఈ కేసుల్లో దొంగిలించబడిన మరికొంత సొత్తును కొనుగోలు చేసిన నల్లా వెంకటేష్ నుంచి కూడా కొన్ని బంగారం వస్తువులను రికవరీ చేయడమైందని ఆమె తెలిపారు. నిందితులను లంకెలపాలెం జంక్షన్ వద్ద బుధవారం అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, సీసీఎస్ ఎస్‌ఐ పి.రమేష్, పరవాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Updated Date - Sep 12 , 2024 | 12:29 AM