అండర్ స్టాండింగ్!
ABN, Publish Date - Nov 22 , 2024 | 01:05 AM
జీవీఎంసీ స్థాయీ సంఘం కొందరు సభ్యుల తీరుతో అండర్ స్టాండింగ్ కమిటీగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీవీఎంసీ స్థాయీ సంఘంలోని కొంతమంది సభ్యులపై ఆరోపణలు
ఎజెండా చేతికి అందగానే కాంట్రాక్టర్లకు ఫోన్లు
పది శాతం కమీషన్ ఇస్తేనే ఆమోదిస్తామంటూ బేరాలు
అందరికీ వాటాలు ఇవ్వాల్సి ఉందని చెబుతున్న వైనం
వాయిస్ రికార్డు చేసిన ఒక కాంట్రాక్టర్
నేడు స్టాడింగ్ కమిటీ సమావేశం
117 అంశాలతో ఎజెండా
అనేక వివాదాస్పద అంశాలు
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్థాయీ సంఘం కొందరు సభ్యుల తీరుతో అండర్ స్టాండింగ్ కమిటీగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎజెండాలో చేర్చిన అంశాలను ఆమోదించాలంటే పది శాతం కమీషన్ ఇవ్వాలంటూ కొందరు పట్టుబడుతున్నట్టు సమాచారం. కమిటీలోని ఇతర సభ్యులతోపాటు మేయర్, కార్యదర్శి పేషీకి కూడా వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని, కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించని పక్షంలో ఆయా అంశాలను తిరస్కరించడమో, వాయిదా వేయడమో చేస్తామని బెదిరిస్తున్నట్టు కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.
జీవీఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడిన తొలి రెండు స్టాండింగ్ కమిటీల్లో ఎజెండాలో చేర్చిన అంశాల్లో బిల్లులు చెల్లింపు, కాంట్రాక్టులు అప్పగింత వంటి అంశాలకు రెండు శాతం కమీషన్ వసూలు చేసేవారనే ఆరోపణలు ఉండేవి. మూడో ఏడాది ఏర్పడిన స్టాండింగ్ కమిటీ మాత్రం కమీషన్‌ను ఐదు శాతానికి పెంచినట్టు చెప్పుకునేవారు. తాజాగా ఏర్పడిన స్టాండింగ్ కమిటీ హయాంలో మాత్రం కమీషన్ మొత్తాన్ని ఏకంగా పది శాతానికి పెరిగిపోయిందంటున్నారు. స్టాండింగ్ కమిటీలో సభ్యులందరి పాత్ర కమీషన్ వసూలు అంశంలో బయటపడకపోయినా, నలుగురు మాత్రం కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరుగా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి ‘మీ అంశం ఒకటి ఎజెండాలో పెట్టారు. మీరు మాత్రం ఇంకా మమ్మల్ని కలవలేదు. వచ్చి కలిస్తే ఆమోదించేస్తాం’ అని చెబుతున్నారు. కాంట్రాక్టర్లు వెళ్లి కలిస్తే స్టాండింగ్ కమిటీతోపాటు మేయర్, కార్యదర్శి పేషీలో ఖర్చులకు పది శాతం ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెబుతున్నారు. తాము కలవని పక్షంలో ఎజెండాలోని ఆయా అంశాలను ఆమోదించడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈనెల ఎనిమిదిన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మూడు అంశాలపై సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయడంతో మేయర్ గొలగాని హరివెంకటకుమారి అయోమయానికి గురయ్యారు. ఆయా అంశాలకు సంబంధించిన టెండర్లు పిలిచినప్పుడు అధికారులు ఏఏ పత్రికల్లో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారనే దానితోపాటు జనవరిలో వేలం పూర్తయితే ఇంతవరకూ కాంట్రాక్టర్‌కు ఎందుకు అప్పగించలేదని కొంతమంది సభ్యులు ప్రశ్నించారు. దీనికి అధికారులు వివరణ ఇవ్వడానికి నీళ్లు నమలడంతో సభ్యులంతా ఆయా అంశాలను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ ఆయా అంశాలను వాయిదా వేద్దామని ప్రతిపాదించగా, ఒక సభ్యుడు మాత్రం జీవీఎంసీకి ఆదాయం వస్తుంది కాబట్టి, ఆమోదించాలంటూ మేయర్‌ను కోరారు. ఆ సభ్యుడు పక్కనే ఉన్న సభ్యులకు చెవిలో ఏదో చెప్పగానే, మెజారిటీ సభ్యులు వెంటనే అధికారులు వివరణ ఇవ్వకపోయినా ఆ అంశాలను ఆమోదించేయాలని మేయర్‌ను కోరడంతో ఆమె అవాక్కయ్యారు. ఇప్పటికిప్పుడే మీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారని, ఏం చేద్దామో...స్పష్టంగా చెప్పాలనడంతో సమావేశంలో ఉన్న అధికారులంతా ఒక్కసారిగా నవ్వారు. దీంతో సభ్యులు ఆయా అంశాలపై వివరణ ఇచ్చేవరకూ వాయిదా వేయాలని కోరారు. అయితే ఆ అంశంపై ఒక సభ్యుడు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడుకుని ఆమోదిస్తామని హామీ ఇచ్చారని, విషయం మిగిలిన సభ్యులకు చెప్పకపోవడంతో వారంతా తిరస్కరించాలని కోరారని, తీరా మేయర్ కూడా వాయిదా వేద్దామా?, తిరస్కరిద్దామా?...అనే అడిగేసరికి సదరు సభ్యుడు అప్రమత్తమై మిగిలిన సభ్యులకు కమీషన్ ఇవ్వడానికి కాంట్రాక్టర్ అంగీకరించాడని చెప్పడంతో మళ్లీ అభిప్రాయం మార్చుకున్నారని అక్కడున్న వారంతా చర్చించుకోవడం కనిపించింది.
తాజాగా శుక్రవారం మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించడానికి కార్యదర్శి బీవీ రమణ ఏర్పాట్లు పూర్తిచేశారు. 117 అంశాలతో ఎజెండా తయారుచేసి గురువారం సభ్యులకు అందజేశారు. ఎజెండా అందగానే కమిటీలో కొందరు సభ్యులు కొంతమంది కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి కమీషన్ల కోసం బేరాలడడం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ ఒకరు వాయిస్ రికార్డు చేసి తనకు అత్యంత సన్నిహితుడికి పంపించడంతో జీవీఎంసీలో పెద్దఎత్తున చర్చ జరిగిందని కొందరు అధికారులు చెబుతున్నారు.
పారిశుధ్య సిబ్బంది పేరుతో బిల్లులు
జీవీఎంసీ పరిధిలో దాదాపు 6,500 మంది అవుట్‌సోర్సింగ్ కార్మికులు, 1,100 మంది శాశ్వత కార్మికులు ఉన్నారు. వీరంతా ఉన్నప్పటికీ జోన్-3 పరిధిలోని 21వ వార్డు బీచ్‌రోడ్డులో పారిశుధ్య నిర్వహణకు 30 మంది కార్మికులను నెలరోజులపాటు నామినేషన్ పద్దతిలో నియమించారని చెప్పి ఒక కాంట్రాక్టర్‌కు రూ.4.65 లక్షలు బిల్లు చెల్లించేందుకు ఎజెండాలో ప్రతిపాదించారు. అలాగే ప్రతి వార్డు సచివాలయానికి ఒక క్లాప్ వాహనం చెత్త తరలించేందుకు ఉండగా, చెట్ల వ్యర్థాలు, డెబ్రిస్ తరలించేందుకు జీవీఎంసీకి చెందిన వాహనాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అయినప్పటికీ జోన్-2 పరిధిలోని ఐదు నుంచి 13వ వార్డు వరకూ చెట్ల వ్యర్థాలు తరలించేందుకు రెండు వాహనాలను నెల రోజులుపాటు పెట్టినందుకు కాంట్రాక్టర్‌కు రూ.4.48 లక్షలు చెల్లించాలంటూ ఎజెండాలో ప్రతిపాదించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే జోన్-2 పరిధి 5,6,7 వార్డుల్లో చెత్త సేకరించడానికి క్లాప్ వాహనాలకు అదనంగా మూడు టాటా ఏస్ వాహనాలను పెట్టిన కాంట్రాక్టర్‌కు రూ.4.86 లక్షలు చెల్లించాలని ఎజెండాలో చేర్చడం విశేషం. వీటన్నింటినీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తిరస్కరించాలని భావించినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి కొందరు సభ్యులు మాట్లాడగా పది శాతం కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించడంతో వాటిని ఆమోదించాలని తీర్మానించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటితోపాటు జీవీఎంసీ పరిధిలో ఎక్కువ వెలుతురునిచ్చే సామర్థ్యం కలిగిన వీధి దీపాలు ఏర్పాటు, ప్రతి జోన్‌లో పాములు పట్టుకునేందుకు ఒక క్యాచర్‌ను రూ.పది వేల వేతనానికి నియమించుకోవడం, వీధికుక్కలను పట్టుకుని ఆపరేషన్లు చేసేందుకు వాహనాలను సమకూర్చుకోవడం, నగరంలో నిరాశ్రయుల షెల్టర్లలో పనిచేస్తున్న సిబ్బంది ఏడాదిపాటు పొడిగింపు, షెల్టర్‌లో ఉండేవారికి భోజనాలు సమకూర్చే అంశాలను ఎజెండాలో చేర్చారు. 70, 76, 96 వార్డుల్లో అభివృద్ధి పనులు, దుకాణాల వేలం వంటి అంశాలను ఎజెండాలో చేర్చారు.
Updated Date - Nov 22 , 2024 | 01:05 AM