అండర్ స్టాండింగే!
ABN, Publish Date - Nov 30 , 2024 | 01:14 AM
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుగా ఊహించినట్టుగానే ముగిసింది.
నాలుగు మినహా అన్ని అంశాలకూ సభ్యులు గ్రీన్‌సిగ్నల్
స్థాయీ సంఘ నిర్ణయాలపై విమర్శలు
విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుగా ఊహించినట్టుగానే ముగిసింది. ఎజెండాలో కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఉన్నప్పటికీ సభ్యులు కనీసం వాటిపై సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండానే ఏకపక్షంగా ఆమోదించేయడం సమావేశానికి హాజరైన మిగిలిన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో 117 అంశాలతో తయారుచేసిన ఎజెండాపై సభ్యులు చర్చించారు. జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే ఏడు వేల మందికిపైగా పారిశుధ్య కార్మికులు ఉన్నారు. అయితే కొన్ని వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ కోసమంటూ అదనంగా తాత్కాలిక సిబ్బందిని నియమించినందున వారికి వేతనాలు చెల్లించాలనే అంశం ఎజెండాలో చేర్చగా సభ్యులు కనీసం ప్రశ్నించకుండానే ఆమోదిస్తున్నట్టు చేతులు ఎత్తేశారు. అలాగే ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకు 630 క్లాప్ వాహనాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని వార్డుల్లో చెత్త తరలింపునకు అదనంగా వాహనాలను అద్దె ప్రాతిపదికన ఏర్పాటుచేసుకున్నామని, కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించాలని ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించేశారు. అలాగే చెట్ల వ్యర్థాల తరలింపునకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేయడం వంటి అంశాలపై కూడా సభ్యులు కనీసం ప్రశ్నించలేదు. ఆయా కాంట్రాక్టర్లతో కొంతమంది సభ్యులు ముందుగానే అవగాహన కుదుర్చుకోవడం వల్లే సమావేశం ఆ విధంగా జరిగిందని అధికారులు అభిప్రాయ పడ్డారు. జోన్-8లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటరావు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా, కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ సభ్యులు వాయిదా కోరారు. అలాగే నిరాశ్రయుల వసతి గృహాల్లో సిబ్బంది సేవలు పొడిగింపు, ఆశ్రయం పొందేవారికి భోజన సదుపాయాలకు సంబంధించిన అంశాలను కూడా సభ్యులు స్వయంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయా అంశాలను వాయిదా వేయాలని మేయర్‌ను కోరారు. అలాగే 76వ వార్డులో రూ.49.74 లక్షలు వ్యయంతో డ్రెయిన్ నిర్మాణానికి అనుమతిచ్చే అంశంపై సభ్యులు వివరణ కోరగా, సదరు అధికారి అందుబాటులో లేకపోవడంతో అంశాన్ని వాయిదా వేశారు.
మధ్యాహ్న భోజన పథకం రేట్లు పెంపు
ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఒక్కొక్కరికి రూ.6.19
ఆరు నుంచి పదో తరగతి వరకు రూ.9.28 పైలు
విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):
విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ రేట్లు డిసెంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఏటా ఏప్రిల్‌లో రేట్లు పెంచుతారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది రేట్ల పెంపు ఆలస్యమైంది. ఇప్పటివరకూ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.5.88 (రూ.5.45 ప్లస్ రూ.0.43పై) ఇస్తుండగా...దానిని రూ.6.19 పైసలకు పెంచారు. అంటే రోజుకు రూ.0.31 పైసలు పెంచారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఇప్పటివరకూ రూ.8.57 (రూ.8.17 పైసలు ప్లస్ రూ.0.40 పైసలు) ఇస్తుండగా...డిసెంబరు ఒకటో తేదీ నుంచి రూ.9.28కు పెంచారు. అంటే రూ.0.71 పైసలు.
విశాఖపట్నం జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 72,918 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. జిల్లాలో 582 పాఠశాలలు ఉండగా నగరంతోపాటు ఆనందపురం, భీమిలి మండలాల్లోని 315 పాఠశాలల్లో విద్యార్థులకు అక్షయ పాత్ర ద్వారా భోజనం సరఫరా అవుతుండగా, మిగిలిన పాఠశాలల్లో స్థానికంగా వంట ఏజెన్సీలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం బియ్యం, గుడ్లు, చిక్కీలు అందజేస్తుంది. భోజనం తయారీకి అవసరమైన ఖర్చుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తున్నాయి.
జిల్లాలో 72,918 మంది విద్యార్థులకు నెలకు సగటున రూ.90 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వంట వండడం అంటే గ్యాస్ లేదా కట్టెలు, పప్పులు, కూరలు, ఇతర దినుసులు సంబంధిత వంట ఏజెన్సీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పెరిగిన రేట్లను పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక విద్యార్థులకు రోజుకు రూ.8.00, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.12.00కు పెంచాలని వంట ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా పెంచిన రేట్లు కొంత వరకూ ఊరట కలిగించినా, పెరిగిన ధరలకు అనుగుణంగా లేవని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్షురాలు గూనూరు లక్ష్మి అన్నారు. వంట వండే కార్మికుల వేతనాలు కూడా పెంచి ఉంటే న్యాయం జరిగేదని అభిప్రాయపడ్డారు. కాగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రేట్ల పెంపుపై ఎస్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇ.పైడిరాజు హర్షం ప్రకటించారు.
సెప్టెంబరు నుంచి అందని బిల్లులు
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించే ఏజెన్సీలకు సెప్టెంబరు నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 9,10 తరగతి విద్యార్థులకు అక్టోబరు నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం వండే సహాయకులకు సెప్టెంబరు వరకూ వేతనాలు మంజూరుచేశారు.
Updated Date - Nov 30 , 2024 | 01:14 AM