గ్రావెల్ తవ్వకాలపై విజి‘లెన్స్’
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:29 AM
పెందుర్తి మండలం గుర్రంపాలెం పారిశ్రామిక లేఅవుట్, దానికి ఆనుకుని ఉన్న కొండ నుంచి భారీగా గ్రావెల్ తవ్వినట్టు గనుల శాఖ విజిలెన్స్ నిర్ధారించింది.
గుర్రంపాలెం పారిశ్రామిక లేఅవుట్‌లో తనిఖీలు
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్టు
విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలం గుర్రంపాలెం పారిశ్రామిక లేఅవుట్, దానికి ఆనుకుని ఉన్న కొండ నుంచి భారీగా గ్రావెల్ తవ్వినట్టు గనుల శాఖ విజిలెన్స్ నిర్ధారించింది. పారిశ్రామికవాడలో ఐదు ఎకరాల మేర ప్లాట్లు వేసిన ఏపీఐఐసీ...పారిశ్రామిక సంస్థలకు కేటాయించింది. అయితే కొన్ని ప్లాట్లలో పెద్ద పెద్ద గోతులు ఉండడంతో ఫిల్లింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక ప్లాట్ ఫిల్లింగ్‌కు అదే ప్లాట్‌లో గ్రావెల్/మట్టి తవ్వి తరలించుకున్నట్టయితే అనుమతి అవసరం లేదు. అదే పక్కనున్న ప్లాట్ లేదా సమీపంలో కొండ లేదా ఖాళీ ప్రదేశం నుంచి తవ్వి తరలించాలనుకుంటే గనుల శాఖ నుంచి తాత్కాలిక పర్మిట్లు తీసుకుని, క్యూబిక్ మీటరుకు రూ.90 వంతున చెల్లించాలి. అయితే లేఅవుట్‌లో కొందరు గనుల శాఖ అనుమతి తీసుకోకుండా లేఅవుట్‌లోనూ, పక్కనున్న కొండ నుంచి గ్రావెల్ తవ్వి తమ ప్లాట్లకు తరలించుకున్నారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఐదారు నెలల క్రితం వెలుగులోకి తెచ్చింది. అయినా ఏపీఐఐసీ అధికారులు పట్టించుకోలేదు. గనుల శాఖ అధికారులు రెండు, మూడు పర్యాయాలు తనిఖీ చేసి ఏపీఐఐసీకి లేఖలు రాసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ గనుల శాఖ విజిలెన్స్ అధికారులు రెండు నెలల క్రితం ఒకసారి తనిఖీ చేశారు. తాజాగా తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి కొలతలు వేశారు. ఆరు ప్లాట్లలో గ్రావెల్ ఫిల్లింగ్ చేసినట్టు గుర్తించారు. అయితే ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలించారనేది లెక్కలు వేస్తున్నారు. త్వరలో పారిశ్రామిక సంస్థలు/వ్యక్తులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని విజిలెన్స్ అధికారులు నిర్ణయించారు.
Updated Date - Dec 15 , 2024 | 01:29 AM