వాటర్ ట్యాంకులు శిథిలం
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:11 AM
మునిసిపాలిటీలో దశాబ్దాల క్రితం నిర్మించిన పలు తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టుగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో పలు ట్యాంకుల నాణ్యత, సామర్థ్యాన్ని పరీక్షించిన అధికారులు.. కొన్ని ట్యాంకులు వినియోగించడానికి వీలుకాని పరిస్థితిలో వున్నాయని ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ కొత్త ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరిన ట్యాంకులనే వినియోగిస్తున్నారు.
పెచ్చులు ఊడిపోయి.. బయటకు కనిపిస్తున్న ఇనుప ఊచలు
బలహీనంగా మారిన పిల్లర్లు
ఎలమంచిలి వాసులకు పొంచి ఉన్న ముప్పు
ట్యాంకులను నిరర్థకంగా మార్చని అధికారులు
ఎలమంచిలి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో దశాబ్దాల క్రితం నిర్మించిన పలు తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టుగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో పలు ట్యాంకుల నాణ్యత, సామర్థ్యాన్ని పరీక్షించిన అధికారులు.. కొన్ని ట్యాంకులు వినియోగించడానికి వీలుకాని పరిస్థితిలో వున్నాయని ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ కొత్త ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరిన ట్యాంకులనే వినియోగిస్తున్నారు.
మునిసిపాలిటీలోని 22వ వార్డు వెంకటాపురంలో సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం 60 వేల లీటర్ల సామర్థ్యంతో తాగునీటి ట్యాంకు నిర్మించారు. ఎలమంచిలి అప్పట్లో మేజర్ పంచాయతీగా వుండడంతో ట్యాంకు నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంతో కొంతకాలానికే ప్లాస్టరింగ్ పెచ్చులు ఊడిపోవడం మొదలైంది. క్రమేణా పెచ్చులతోపాటు కాంక్రీట్ కూడా రాలడం ప్రారంభమైంది. ముఖ్యంగా ట్యాంకు అడుగు భాగం, పిల్లర్లు పలుచోట్ల పెచ్చులు ఊడిపోయి ఇనుప ఊచలు కనిపిస్తున్నారు. దీంతో ట్యాంకు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకర స్థితిలో వున్న ఈ ట్యాంకుకు సమీపంలోనే పిల్లలు ఆడుకుంటూ వుంటారు. ఈ ట్యాంకు చెంతనే మరో చిన్నపాటి తాగునీటి ట్యాంకు ఉండడంతో స్థానికులు ఇక్కడ నీరు పట్టుకుంటుంటారు. శిథిలావస్థకు చేరిన ఓవర్‌హెడ్ ట్యాంకుకు నీటి పంపింగ్‌ను ఆపేయడమే కాకుండా వెంటనే దానిని కూల్చివేయాలి. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
కాగా మునిసిపాలిటీ ఐదో వార్డులోని మంత్రిపాలెం కాలనీ వద్ద ఉన్న తాగునీటి మినీ ట్యాంకు కూడా శిథిలావస్థకు చేరి నీరు వృథాగా పోతున్నది. కొక్కిరాపల్లి వార్డులోని తాగునీటి ట్యాంకు సైతం ఇదే స్థితికి చేరింది. మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే ఆయా తాగునీటి ట్యాంకులకు మరమ్మతులు చేయాలని, లేదంటే కూల్చి వేయాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Nov 15 , 2024 | 01:11 AM