కస్తూర్బా విద్యాలయాలపై పర్యవేక్షణేది?
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:46 PM
జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల(కేజీబీవీలు)పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సమగ్ర శిక్ష విద్యా విభాగం పరిధిలో ఉండే కేజీబీవీలపై ఇతర విద్యాఖాకాధికారులు పర్యవేక్షించే అధికారం లేకపోగా, సమగ్ర శిక్షలో వాటిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారి లేకపోవడం గమనార్హం.
జిల్లా ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా గాడినపడని సమగ్ర శిక్ష
డీఈవోకే రెండున్నరేళ్లుగా సమగ్ర శిక్షా ఏపీసీ ఇన్‌చార్జి బాధ్యతలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కేజీవీబీల ప్రత్యేకాధికారులు
తాజాగా జి.మాడుగులలో జుట్టు కత్తిరింపు ఘటన
గతంలో ముంచంగిపుట్టులో ఎస్‌వో తీరుపై రోడ్డెక్కిన బాలికలు
రంపచోడవరంలో క్రమశిక్షణ పేరిట గుంజీలు తీయించిన ఘటనలో అస్వస్థతకు గురైన బాలికలు
పాడేరులో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల(కేజీబీవీలు)పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సమగ్ర శిక్ష విద్యా విభాగం పరిధిలో ఉండే కేజీబీవీలపై ఇతర విద్యాఖాకాధికారులు పర్యవేక్షించే అధికారం లేకపోగా, సమగ్ర శిక్షలో వాటిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారి లేకపోవడం గమనార్హం. అలాగే జిల్లా ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ సమగ్ర శిక్ష విభాగానికి జిల్లా అధికారిగా ఉండే అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ (ఏపీసీ)పోస్టు భర్తీ చేయకుండా జిల్లా విద్యాశాఖాధికారికే ఆ పోస్టు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించి ఉన్నతాధికారులు కాలం గడిపేస్తున్నారు. దీంతో సమగ్ర శిక్షలో కింద స్థాయి అధికారులు, సిబ్బంది కనీస పర్యవేక్షణ లేని దుస్థితి కొనసాగుతున్నది. ఇదే అదనుగా ఆయా విద్యాలయాల్లోని ప్రత్యేకాధికారిణులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతర ఆశ్రమ పాఠశాలల్లో వలే కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ వార్డెన్ పోస్టులు వేర్వేరుగా కాకుండా ఆ రెండింటినీ ప్రత్యేకాధికారి పేరిట ఒకరే నిర్వహించాల్సిన పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో ప్రత్యేకాధికారిణి తనను నచ్చినట్టు వ్యవహరిస్తూ బాలికలకు సరైన పోషకాహారం, ఇతర వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు, విద్యార్థుల బాగోగులు సైతం పట్టించుకోని దుస్థితి నెలకొంది.
డిప్యూటీ డీఈవోకే అదనపు బాధ్యతలు
వాస్తవానికి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలతో పాటు సమగ్ర శిక్ష ద్వారా అమలయ్యే విద్యకు సంబంధించిన వ్యవహారాలపై జిల్లాకు పెద్దగా సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ)ఉంటారు. అయితే గత రెండున్నరేళ్లుగా సమగ్ర శిక్షా ఏపీసీ పోస్టు భర్తీ చేయలేదు. పైగా స్థానిక డిప్యూటీ డీఈవోగా బాధ్యతలు చేపడుతున్న అధికారికే జిల్లా విద్యాశాఖాధికారి, ఏజెన్సీ డీఈవోతో పాటు సమగ్ర శిక్ష ఏపీసీ బాధ్యతలను సైతం అప్పగించారు. డిప్యూటీ డీఈవోగా ఉన్న అధికారికే మూడు జిల్లా స్థాయి పోస్టుల బాధ్యతలు అప్పగించడంతో ఆయన అధికారిక సమావేశాలు, నివేదికలు సమర్పణకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సమగ్ర శిక్ష ఏపీసీ పోస్టుకు న్యాయం చేయలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీని వల్ల కేజీబీవీల్లో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కేజీబీవీల్లో ఎన్నో సంఘటనలు
తాజాగా జి.మాడుగులలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేకాధికారిణి అకారణంగా బాలికల జుట్టును కత్తిరించిన వైనం వెలుగులోకి వచ్చింది. కేవలం బాలికల పట్ల అసహనంతోనే ఎస్‌వో ఆ చర్యకు పాల్పడినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అలాగే గత నెలలో రంపచోడవరం కేజీబీవీలో బాలికలను క్రమశిక్షణ పేరిట విపరీతంగా గుంజీలు తీయించారు. దీంతో ఈ ఘటనలో సుమారు వంద మంది బాలికలకు కీళ్లు పట్టేసి ఆస్పత్రి పాలయ్యారు. అంతకు ముందు ముంచంగిపుట్టు కేజీబీవీలో సరైన భోజనం, బోధన జరగడం లేదని బాలికలు పాడేరు- జోలాపుట్ మెయిన్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రత్యేకాధికారిణిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో డుంబ్రిగుడ కేజీబీవీలో ఓ బాలిక గర్భందాల్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. హుకుంపేట కేజీబీవీలో జరిగిన నాడు - నేడు పనులను గతంలో ప్రత్యేకాధికారిణి బాలికలతో చేయించారనే ఫిర్యాదులు వచ్చాయి. పాడేరులోని కేజీబీవీలో ఆహారం కలుషితమై పదుల సంఖ్యలో బాలికలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలైన ఘటనలు రెండు మార్లు జరిగాయి. ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన ఘటనలు మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని అనేక ఘటనలు కేజీబీవీల్లో చోటు చేసుకుంటున్నాయని ప్రజా, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలను సమగ్రంగా పర్యవేక్షించి విద్యార్థినులకు మెరుగైన విద్యాబోధన, భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - Nov 18 , 2024 | 11:46 PM