ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ ఎప్పటికి పూర్తయ్యేనో?

ABN, Publish Date - Apr 15 , 2024 | 12:09 AM

గూడెంకొత్తవీధిలో ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏడాది కాలంగా ఈ యూనిట్‌ భవన నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తున్నది.

అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్న ఎకో పల్పింగ్‌ యూనిట్‌ భవనం

గూడెంకొత్తవీధిలో 70 శాతం నిర్మాణాలు పూర్తి

కాంట్రాక్టరు రూ.40 లక్షలు ఖర్చు చేసినా ఒక్క బిల్లు కూడా మంజూరుకాని వైనం

ఏడాదిగా నిలిచిన పనులు

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్న ఆదివాసీలు

గూడెంకొత్తవీధి/చింతపల్లి, ఏప్రిల్‌ 14: గూడెంకొత్తవీధిలో ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏడాది కాలంగా ఈ యూనిట్‌ భవన నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తున్నది. ఆదివాసీ రైతులు నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి చేయూతనందించేందుకు ఐటీడీఏ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ యూనిట్‌ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పల్పింగ్‌ యూనిట్‌ కోసం కొనుగోలు చేసిన యంత్రాలు సైతం తుప్పుపడుతున్నాయి. నిధుల కోసం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పలు మార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేకుండాపోయింది. దీంతో గిరిజన రైతులు నిరాశ చెందుతున్నారు.

ఆదివాసీ రైతులు పండించిన కాఫీ పండ్ల నుంచి నాణ్యమైన పార్చిమెంట్‌ ఉత్పత్తి చేసేందుకు చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌ తరహాలో రూ.1.3 కోట్ల ట్రైకార్‌ నిధులతో గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోనూ నిర్మించేందుకు ఐటీడీఏ 2022 సెప్టెంబరులో పనులు ప్రారంభించింది. 2023 జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని ఐటీడీఏ లక్ష్యాలను నిర్దేశించింది. అదే ఏడాది కాఫీ సీజన్‌ నాటికే ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి తీసుకు వస్తామని ఐటీడీఏ అధికారులు ప్రకటించారు. అయితే నిర్మాణాలకు సంబంధించిన నిధులను వైసీపీ ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల పనులు పూర్తి కాలేదు. 2023-24 కాఫీ సీజన్‌ ప్రారంభంలో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీడీఏ అధికారులు ప్రకటించారు. యూనిట్‌ నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం ఐటీడీఏ అధికారులు పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపించినప్పటికి కనీస స్పందన కరువైంది. కాఫీ సీజన్‌ ముగిసిపోయినప్పటికి ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలు ఒక్క అడుగు ముందుకు సాగలేదు.

పెట్టుబడి నిధుల కోసం ఎదురుచూపు

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టరు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టి 70 శాతం నిర్మాణాలు పూర్తి చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా విడుదల కాకపోవడం వల్ల కాంట్రాక్టరు పనులను నిలిపివేశారు. బిల్లులు మంజూరు చేస్తే పనులు కొనసాగించే అవకాశముంటుందని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పలు మార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపించినప్పటికి కనీస స్పందన రాలేదు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సైతం ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికి నిధులు లేకపోవడం వల్ల పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టరుపై ఒత్తిడి చేయలేకపోతున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టరు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు.

నిరుపయోగంగా యంత్రాలు

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో యంత్రాలు నిరుపయోగంగా పడి వున్నాయి. ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి సంబంధించిన యంత్రాలను సుమారు రూ.20 లక్షల నిధులతో కొనుగోలు చేసినప్పటికి వాటిని అమర్చే పరిస్థితి లేక ఓ పక్కన నిరుపయోగంగా వున్నాయి. ప్రస్తుతం యంత్రాలు తుప్పుపడుతున్నాయి. ప్రధానంగా ఎకో పల్పింగ్‌ యూనిట్‌ వద్ద పైకప్పు నిర్మాణం, యంత్రాలు అమర్చేందుకు విద్యుత్‌ సరఫరా ఉండాలి. ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవడానికి ఈపీడీసీఎల్‌ అధికారులకు సుమారు రూ.8 లక్షల నిధులు చెల్లించాలి. విద్యుత్‌ కనెక్షన్‌కి సంబంధించిన నిధులు సైతం ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ వద్ద పనులు చేపట్టే అవకాశం లేకుండాపోయింది.

కాఫీ ఉత్పత్తిలో జీకేవీధి అగ్రగామి

జిల్లాలో గూడెంకొత్తవీధి మండలం కాఫీ ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉన్నది. మండలంలో ఆదివాసీ రైతులు అత్యధికంగా 42 వేల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. సరైన సేద్య పద్ధతులు పాటించకపోవడం వల్ల ఆశించిన దిగుబడులు రాకపోయినప్పటికి ప్రతి ఏడాది 4,200 టన్నుల క్లీన్‌ కాఫీ ఉత్పత్తి చేస్తున్నారు. ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్‌ కాఫీ పండ్లకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నది. కిలో పండ్లకు రూ.43 గరిష్ఠ తొలి ధరను అందజేస్తున్నది. దీంతో గిరిజన రైతులు కాఫీ పండ్లను మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మండల కేంద్రంలో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి రాకపోవడం వల్ల మండలానికి చెందిన ఆదివాసీలు పండించిన కాఫీ పండ్లను చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి తరలించుకోవాల్సి వస్తున్నది. దీంతో రవాణా ఖర్చు పెరుగుతున్నది. రవాణా ఖర్చు పెరగడం వల్ల రైతులకు వచ్చే బోసస్‌ తగ్గే అవకాశమున్నది.

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి వస్తే..

గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆదివాసీలు కాఫీ తోటల నుంచి సేకరించిన పండ్లను వెనువెంటనే ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి తరలించే అవకాశముంటుంది. చింతపల్లికి తరలించే రవాణా ఖర్చులు తగ్గుతాయి. రైతులు ప్రైవేటు వర్తకులను ఆశ్రయించకుండా సేకరించిన పండ్లను పూర్తి స్థాయిలో మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. రైతులు చెర్రీగా విక్రయించుకోకుండా మెజారిటీ పండ్లను పార్చిమెంట్‌గా విక్రయించుకుని గరిష్ఠ ధర పొందే అవకాశం ఉంటుంది.

Updated Date - Apr 15 , 2024 | 12:09 AM

Advertising
Advertising