Share News

వలంటీర్లకు వైసీపీ వల

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:26 AM

వార్డు వలంటీర్లకు వైసీపీ నాయకులు గేలం వేస్తున్నారు.

వలంటీర్లకు వైసీపీ వల

కళ్యాణ మండపాల్లో సమావేశాలు

రాజీనామా చేసి ఎన్నికల్లో పార్టీకి పనిచేయాలని పిలుపు

ప్రస్తుతం వస్తున్న దానికంటే నాలుగింతలు ఎక్కువ ఇస్తామంటూ ఆఫర్‌

ఫలితాలు వచ్చిన తరువాత మళ్లీ వలంటీర్‌గా తీసుకుంటామంటూ హామీ

అలా వెళ్లిన వారికి మరోమారు అవకాశం ఇవ్వకూడదనే వాదన

విశాఖపట్నం/వెంకోజీపాలెం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):

వార్డు వలంటీర్లకు వైసీపీ నాయకులు గేలం వేస్తున్నారు. ఎన్నికలలో అధికార పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తూ ఎవరికైనా దొరికిపోతే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది కదా?...అని ఎవరైనా ప్రశ్నిస్తే...తాము ప్రత్యామ్నాయం చూస్తామంటున్నారు. వలంటీర్లు అంతా ప్రస్తుతం వారి ఉద్యోగాలకు రాజీనామా చేసేయాలని వైసీపీ నాయకులు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని ఉండదని, ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదని అంటున్నారు. జూన్‌ నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు తమ కోసం పనిచేస్తే వలంటీర్‌గా వచ్చే జీతం కంటే నాలుగు రెట్లు అధికంగా ఇస్తామని ఆశ పెడుతున్నారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రాగానే అందరినీ మళ్లీ వలంటీర్లుగా తీసుకుంటామని చెబుతున్నారు. వైసీపీ కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు వారికి చెందిన కళ్యాణ మండపాలు, భవనాల్లో వలంటీర్లతో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం తూర్పు, ఉత్తర నియోజకవర్గాల్లో ఇలాంటి సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 16వ వార్డు వైసీపీ నాయకులు హెచ్‌బీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనున్న కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. దీనికి సుమారు 40 మంది వలంటీర్లు హాజరయ్యారు. వీరిలో కనీసం నాలుగో వంతు రాజీనామాలు చేయడానికి సిద్ధపడినట్టు సమాచారం. వారు ఆ నిర్ణయం తీసుకోవడానికి భారీగానే ముట్టజెబుతామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

ఎన్నికల సంఘం దృష్టి పెట్టాల్సిందే

ఎన్నికల ముందు ఇలా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోకుండా నిబంధనలు పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. ఏ కారణంతో రాజీనామా చేస్తున్నారో పేర్కొనాల్సిందిగా కోరాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధన కూడా పెట్టాలని కొందరు చెబుతున్నారు.

కేకే రాజు ప్రచారంలో మలేరియా శాఖ ఉద్యోగి

విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి కేకే రాజు తన ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలేరియా విభాగంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రసాద్‌ పాల్గొన్నారు. ఆయన్ను అక్కడ చూసిన పలువురు...‘నువ్వు ఈ సమయంలో ఎందుకు వచ్చావు?’ అంటూ ప్రశ్నించడం విలేకరుల కంట పడింది.

వైసీపీ సేవలో వలంటీర్‌

‘నార్త్‌’లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు

ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు

మురళీనగర్‌, మార్చి 28:

వార్డు/గ్రామ వలంటీర్లు రాజకీయ నేతల ప్రచారంలో పాల్గొనకూడదు. ఈ నిబంధనను బేఖాతరు చేస్తూ విశాఖ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి మాధవధారలోని వార్డు వలంటీరు ఏకంగా వైసీపీ తరపున ప్రచారం చేయడం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. జీవీఎంసీ 51వ వార్డు మాధవధార అంబేడ్కర్‌ కాలనీ 287 సచివాలయంలో రూప వలంటీరుగా పనిచేస్తోంది. విధుల్లో చేరినప్పటి నుంచి వైసీపీ కార్యకర్త మాదిరిగా పనిచేస్తున్న ఆమె ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరో అడుగు ముందుకువేసి బుధవారం 50వ వార్డు పరిధిలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. అంతేకాకుండా ఇక్కడ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంది. తన వార్డు పరిధిలోని వైసీపీ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, తదితర కార్యక్రమాల్లో వైసీపీ నేతలతో ఉత్సాహంగా పాల్గొంటున్న ఈ వలంటీరు వైఖరిపై ఆదినుంచీ విమర్శలు వినిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిని అవకాశంగా తీసుకున్న ఆమె తాజాగా వైసీపీ అభ్యర్థి కేకే రాజు తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోందని వార్డు వాసులు చెబుతున్నారు. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేసిన వలంటీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 01:26 AM