తొలిరోజు 97.2 శాతం పింఛన్ల పంపిణీ
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:50 PM
జిల్లాలో మంగళవారం 97.2 శాతం మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
పింఛన్ల సొమ్ము అందజేత
భాగస్వాములైన మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు
ఉత్సాహంగా పాల్గొన్న కూటమి శ్రేణులు
పార్వతీపురం, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం 97.2 శాతం మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. జిల్లాకేంద్రంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పింఛన్లు పంపిణీ చేశారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కూటమి శ్రేణులు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కాగా జిల్లాలో 1,42,393 మంది లబ్ధిదారులు ఉండగా.. తొలిరోజు 1,38,256 మందికి పింఛన్ల సొమ్ము అందించారు. మొత్తంగా సాయంత్రం ఐదు గంటల వరకు రూ.57.42 కోట్లు పంపిణీ చేశారు. సీతంపేట మండలం 98.22 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా.. గరుగుబిల్లి మండలం 96 శాతంతో చివరి స్థానంలో ఉంది.
ఏడు కిలోమీటర్లు నడిచి, కొండలెక్కి
సాలూరు రూరల్: సాలూరు మండలం ఏవోబీలో ఎత్తయిన గిరిశిఖరాల్లో ఉన్న కొదమ పంచాయతీ పరిధి చింతామల, లొద్ద, బందపాయి గ్రామాలకు పంచాయతీ కార్యదర్శి ఎర్ర్నాయుడు ఏడు కిలోమీటర్లు నడిచి కొండలెక్కారు. చింతామల,లోద్ద, బందపాయిల్లో 97 మందికి గాను 96 మందికి మధ్యాహ్నంలోగా 96 పింఛన్ల సొమ్ము అందించారు.
పింఛను డబ్బులు ఎవరిస్తున్నారు: మంత్రి సంధ్యారాణి
సాలూరు రూరల్: సాలూరు పట్టణం 26వ వార్డు డబ్బివీధి, వేంకటేశ్వర కాలనీలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛను డబ్బులు ఎవరిస్తున్నారని వృద్ధురాలు బలగ చిలకమ్మను ప్రశ్నించగా.. చంద్రబాబు ఇస్తున్నారని ఆమె బదులిచ్చింది. వేంకటేశ్వర కాలనీలో నడవ లేని వృద్ధురాలు కొండమ్మ ఇంటికెళ్లి పింఛను మొత్తం అందించారు. అంతకముందు స్థానికులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలనె నెరవేరుస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆమె తెలిపారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తిరుపతిరావు, శైలజ, పైడిరాజు, మంగమ్మ, అన్నపూర్ణ, శ్యామల, శోభారాణి,అశోక్, జనసేన నేత శివకృష్ణ, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 11:50 PM